తూర్పున ఎక్కడో సూర్యోదయం కాబోతున్న సూచనగా చీకట్లు మెల్లమెల్లగా విచ్చుకుంటున్నాయి.కార్తీక పూర్ణిమ. గుడిగంటలు అదే పనిగా మోగుతున్నాయి.అప్పటివరకూ బంగారు వన్నె వెన్నెలకాంతిని విరజిమ్మిన చందమామ మొహం తెల్లబోతోంది. ఆ ఉదయ సంధ్యలో పొగమంచు దట్టంగా అలముకుని ఉంది.తెల్లవారుఝామున మూడు గంటల నుంచీ జనం నాటు పడవల్లో పట్టిసీమ రేవు నుంచి వీరభద్రేశ్వరాలయం ఉన్న పట్టిసం లంకలోకి పోటెత్తినట్టు వస్తున్నారు. ఇసుక మేటలు వెయ్యడం వలన లాంచీలు రాలేవు. అందుకే పడవల వాళ్లు మంచి హుషారుగా ఉన్నారు. అద్దరి నుంచి ఇద్దరికీ నిమిషాల్లో తెడ్డు వేసేస్తున్నారు. ఏడాదికోసారి అరుదుగా వచ్చే అవకాశం. పడవల నిండా జనాన్ని కుక్కేసి తీసుకొస్తున్నారు. జనం వచ్చిన వాళ్లు వచ్చినట్టేగోదావరిలో మూడు మునకలేసి తడిబట్టల్తో తపతపలాడుతూఆలయంవైపు దారి తీస్తున్నారు. పూజలు,దర్శనాలు ముగించుకున్న వాళ్లని తిరిగి ఇద్దరి నుంచిఅద్దరికి చేరవేస్తున్నారు పడవల వాళ్లు.అలా జనంతో కలిసి మొదటి పడవలో వచ్చి లంకలో దిగేడు భద్రుడు. అందరితో బాటే అసంకల్పితంగా గోదాట్లో మునకలేసాడు. కాళ్లకింద ఇసుక తగుల్తోంది. ముందుకు పోనీకుండా రక్షణ వలయం ఉంది. గుడివైపు వెళ్లబుద్ధి కాక ఎడమవైపు నిర్జన ప్రదేశం లోకి నడిచాడు. పాదాలు నీళ్లలోకి వేళ్లాడేసి ఇసుకలో కూర్చున్నాడు. 

కార్తీక దీపాల వెలుగులో మెరుస్తున్న గోదారి అతని పాదాల్ని కరుస్తోంది. ఓపలేక చటుక్కున పైకి లాకున్నాడు. వెన్నులోని మజ్జ మొత్తాన్ని ఎవరో పీల్చేసుకున్నంత బలహీనత. ఆగలేక వెల్లకిలా వెనక్కి వాలేడు చల్లని ఇసుక తడికి ఒక్కసారి వజవజా వణికేడు. అతని లోపలి వ్యాకులత త్వరలోనే చలిని జయించింది. రెండు రోజులుగా తిండి, నిద్రలేని అతని శరీరం అలసి సొమ్మసిల్లిపోయింది. నిద్రాదేవి కరుణించి అతని కళ్లమీదికి పాకి వచ్చింది.దుఃఖంతో నిండిన ఏదో చీకటిలోకంలో విహరిస్తోంది భద్రుడి ఆత్మ. దుఃఖాన్ని భరించలేక మౌనంగా రోదిస్తోంది.‘‘బతికున్నాడంటావా?’’‘‘ఏమో మరి!’’సర్రున నీటిని కోస్తున్న చప్పుడు.‘‘ఎగువనించి కొట్టుకొచ్చినట్టుంది శవం. మొన్నీమద్దెనిలాగే కాదా పాపికొండల కాడ అడిపోయిన మనిసి ఈ లంకొడ్డుని తేల్త’’‘‘ఛా, ఊరుకో. పేణం ఉన్నట్టన్పిత్తంది’’.‘‘మరి, ఫూటుగా తాగేసడిపోయేడంటావా ఇంతపొద్దున్నే? దగ్గిర కెల్లకయ్యోయ్‌, పోలీసోళ్లు మనమీదెట్టెయ్‌గల్రు’’.టక్కున కళ్లు విప్పేడు భద్రుడు. తల తిప్పి చూడగానే ఎడమవైపు పదడుగల కవతల నిక్కరు మాత్రమే వేసుకున్న బక్క పల్చని మనిషి, అతని వెనకనుంచి తొంగి తొంగి చూస్తున్న ఆడమనిషి కన్పించేరు. వాళ్ల వెనక చిన్న నాటుపడవ వొడ్డు మీదికి సగం చేర్చి ఉంది.చటుక్కున లేచి కూర్చున్నాడు భద్రుడు.వాళ్లలా అనుకోవడంలో పొరపాటు లేదు. నిద్రలో ఎప్పుడు కిందికి జారి పోయేడోతను, సన్నని నీటి అలలు వచ్చి తనని నడుము వరకూ తడిపి వెళ్తున్నాయి.