సమస్యలు శ్రద్ధగా విని, స్వభావానుగుణంగా విభజించి, జాగ్రత్తగా పరిష్కారాలు సూచించి, నడవడిక మార్చుకోమని చెప్పడం నా వృత్తి. అంతవరకే! కార్యచరణ విశిష్టంగా బోధించడం కాదు. గీతాబోధలో శ్రీకృష్ణుడు అర్జునుడికి‘ఇలా చేయి’ అని ఎన్నడూ చెప్పలేదు. అంతా డొంక తిరుగుడే. అలాంటి పద్ధతి ఒకసారి కౌన్సిలింగ్‌లో ఊహించి ఆచరణలో పెట్టించిసఫలీకృతురాలినయ్యాను. ఆ వివరాలే ఇవి...మాలతి ఎంబిఏ పాసయి, తనతోనే చదువుకున్న సీనియర్‌ మోహన్‌ని పెళ్లిచేసుకుంది. మోహన్‌ ఇండస్ర్టీ ప్రారంభించి చాలా వృద్ధిలోకి తీసుకువచ్చాడు. మాలతి తన నగలూ, తండ్రిచ్చిన ఆస్తీ ఏ బాధా లేకుండా మోహన్‌ ఇండస్ర్టీ నడపడానికి ఇచ్చేసింది. తన క్వాలిఫికేషన్‌ పక్కన పెట్టేసి, గృహిణిగా సెటిల్‌ అయిపోయింది. మోహన్‌ సమర్థతకి గౌరవమిచ్చి, భర్తగా వల్లమాలిన ప్రేమ చూపించేది. సాఫీగా నడచిపోతున్న పరిశ్రమలో ప్రభుత్వం చేసిన మార్పుల పరిణామంగా నష్టాలొచ్చాయి. అవి మోహన్‌ తట్టుకోలేకపోతున్న తరుణంలో మాలతి అన్న రాజా భార్య జ్యోత్స్న సాయం చేసింది. జ్యోత్స్న తండ్రి బాగా డబ్బు, పరపతి వున్నవాడు. అధికారులతో మంతనాలు జరిపి పరిశ్రమని నిలబెట్టాడు. మోహన్‌కిది తీర్చలేని రుణంగా కనపడింది. అంతా జ్యోత్స్న వల్లే అనుకున్నాడు. పదేపదే వాళ్లింటికి వెళ్లి కృతజ్ఞతలు తెల్పుతూ, రాకపోకలు పెంచుకున్నాడు. ఒకరోజు జ్యోత్స్న తండ్రి, ‘మా అమ్మాయిని పార్టనర్‌గా చేసుకోవోయి’ అన్నాడు. 

మోహన్‌ వెంటనే ఒపకున్నాడు. అప్పటికే వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం ఒక కొత్త మలుపు తిరిగింది. ఫోన్లూ, మీటింగ్‌లూ, డిన్నర్లూ, ఇలా కలిసి చేసే పనులకు ‘పార్ట్ట్‌నర్‌ షిప్‌’ వంక అయిపోయింది. ఎవరేం అడిగినా, ‘పరిశ్రమని అభివృద్ధి చేస్తున్నాం’ అనేవాడు.రానురాను మాలతికి తన స్థానభ్రంశం అవుతోందేమోనన్న సంశయం కలిగింది. ఆ మాటే మోహన్‌తో అంటే, ‘నీకేమైనా పిచ్చా? తను నాకు చెల్లెలి వరస. ఇలాంటి ఆలోచనలు ఎమ్‌బిఏ చదివిన నీకెలా వచ్చాయి?’ అని కసిరాడు. అప్పటికి ఏదో సరిపెట్టుకున్నా, మాలతి లోలోన కృంగిపోతూ, విపరీతంగా లావయిపోయింది. స్లిమ్మింగ్‌ కోర్సులు చేసి ఒళ్లు తగ్గించుకుందామన్నా ఫలితాలు తాత్కాలికంగానే వుండేవి.