ఏసీ కారు చల్లగా ముందుకు సాగిపోతోంది. ఒక అందమైన బంగళా ముందు ఆగింది.చేతిలోకి శుభలేఖల కట్టా, కుంకుమభరిణా తీసుకుని, కట్టుకున్న పట్టు చీరలు సర్దుకుంటూ నేనూ, భవానీ కారు దిగాం. ఆ బంగళా మా దూరపు చుట్టం సులోచనది. సులోచన భర్త శ్రీరంగం పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. ఇంకొ న్నాళ్ళలో రిటైర్‌ కాబోతున్నారు. ఉన్న ఆస్తిని సులోచనా, శ్రీరంగం తమ తెలివితో పదింతలు చేసి పారేశారు. సులోచన ఎం.ఏ చదివింది. అందమైనది. ఆమెకు యాభై అయిదేళ్ళు. శ్రీరంగానికి యాభై తొమ్మిది. కానీ ఇద్దరూ ప్రేమి కుల లాగానో, కొత్తగా పెళ్ళయినవాళ్ళ లాగానో ఉంటారు. నవ్వుతూ, తుళ్ళుతూ జోక్స్‌ వేసుకుంటూ గడుపుతారు.భవాని నా మేనత్త కూతురు. 

కూతురు పెళ్ళి శుభ లేఖలు పంచటానికి నన్ను తోడు రమ్మంది. తల్లి తరఫునే కాకుండా భర్త మూలంగా కూడా సులోచనతో భవానీకి బంధుత్వం ఉంది. అదీగాక భవాని భర్త కూడా ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. అందువల్ల భవానీకి బంధువర్గంలో మంచి ఆదరణ ఉంది.సులోచన ఇల్లు శాంతినగర్లో ఉంది. ఇంటి చుట్టూ బోలెడు స్థలంలో పూలతోట, రకరకాల వృక్షాలు, ఇంటి పోర్టికోలో ఒక కారూ, షెడ్డులో మరో కారూ, రెండు ఖరీ దైన కుక్కలూ, అన్నీ ఆ ఇంటివాళ్ళ అభిరుచినీ ఐశ్వర్యాన్నీ తెలియజేస్తున్నాయి.కాలింగ్‌ బెల్‌ రెండుసార్లు కొట్టాక పనిమనిషి వచ్చి గేటు తీసి, కుక్కల్ని అదిలించి, గబగబా వెళ్ళిపోయింది. నేనూ, భవానీ విశాలమైన హాల్లోకి ప్రవేశించి, అక్కడ ఉన్న ఖరీదైన సోఫాల్లో కూర్చున్నాం. కార్లో ఉండగానే మేం వస్తున్నట్లు సులోచనకి ఫోన్‌ చేసి చెప్పాం. అయినా సులోచన ఇంకా హాల్లోకి రాలేదు.అయిదు నిమిషాలు గడిచాక సులోచన వచ్చింది. ఎప్పుడూ టిప్‌టాప్‌గా కనిపించే సులోచన దీనంగా, దిగు లుగా ఉంది. కళ్ళ కింద నల్ల చారలు మాత్రమే కాక బుగ్గల మీద కన్నీటి చారికలు కూడా ఉన్నాయి. సులోచనను ఎన్నడూ ఆ స్థితిలో చూడని నాకు భయం వేసింది. భవాని వైపు చూశాను. కానీ తను పెద్దగా కంగారు పడుతున్నట్లు కనిపించలేదు.