ఈ ఫ్రెంచివాళ్లున్నారే... మహా ఘటికులు. బ్రిటిష్‌వాళ్లలా కాదు, ఎప్పుడూ ప్రజలతో మంచి అనిపించుకోవడానికే చూసారు. వాళ్లకిష్టం లేకపోయినా సరే ప్రజల ఆచారాల జోలికెళ్లలేదు. ఉదాహరణకు బాల్య వివాహాలు, వారసత్వ చట్టాలు ఫ్రెంచివారికి ఆమోదయోగ్యం కావు. అయినా సరే తీర్పులు చెప్పేటప్పుడు భారతీయ ప్రాచీన శిక్షాస్మృతులనే ఆధారం చేసుకునేవారు. ఎనభైఏళ్ల క్రితం... పందొమ్మిది వందల ముప్పయి నాలుగులో యానాంను స్థానికులు... కళ్యాణపురం అని పిలుచుకునేవాళ్లు. అప్పుడు జరిగిన ఒక సంఘటనను చరిత్ర మరిచిపోలేదు. పరమఛాందసుడైన నీలకంఠశాస్త్రిని కూడా మరచిపోలేదు.నీలకంఠశాస్త్రి పేరు కడియం చుట్టుపక్కల అన్ని గ్రామాల వారికీ పరిచయమే. కళ్యాణ మహోత్సవాలన్నీ ఆయన కనుసన్నలలో జరగాల్సిందే. ఆయనంటే అందరికీ భయం. తేడా వస్తే ఊరుకోడు. వైదికశాస్త్ర ప్రమాణాలు పాటించడంలో ఏమైనా సందేహాలుంటే ఆయన తీర్చవలసిందే. పెళ్లికొడుకు తండ్రి సుబ్బావధానికి అతనితో దూరపు బంధుత్వం కూడా ఉంది. ముహూర్తం రాత్రి పదిగంటల పదహారు నిమిషాలకు. వధూవరులు చిన్నవాళ్లే. విరూపాక్షుడికి ఏడేళ్లు. మీనాక్షికి అయిదేళ్లు. బ్రిటిష్‌పాలిత ప్రాంతంలో శారదాచట్టం అమలులో ఉంది కాబట్టి బాల్య వివాహం కడియంలో కుదరదు. అందుకే యానాం వచ్చారు.పెళ్లికోసం వచ్చారని అనుమానం వస్తే అక్కడి పోలీసులతో చిక్కు. అందుకే వట్టిచేతులతో యానాం వెళ్లి అన్నీ అక్కడే కొనుక్కోవాలి.

 యానాంలోని వర్తకులకు, స్వర్ణకారులకు అవి బంగారపు రోజులు. తాళిబొట్లు గంపల్లో పెట్టుకుని అమ్ముతారు. పెళ్లిఫీజు అయిదు రూపాయలు కట్టించుకుంటారు. ఎక్కువే అయినా తప్పదు. ధృవపత్రం ఇస్తారు. అదే పెద్ద భరోసా. అది తీసుకుని నిశ్చింతగా తమ ఊరికి పోవచ్చు. ఈ జ్యేష్ఠ మాసంలో వంద పెళ్లిళ్లన్నా జరుగుతాయి. ఇళ్ల అరుగులు కూడా ఖాళీగా లేవు. అవీ అద్దెకిస్తుంటారు. బాజాభజంత్రీల గోల, పారిశుద్ధ్య సమస్య, కలరా వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని ఇక్కడి వాళ్లు ఫ్రెంచివారితో మొత్తుకుంటున్నారట. ఇలా ఎన్నాళ్లు సాగుతుందో?అందరూ భోజనాలకు కూర్చున్నారు. పక్కన మరచెంబుల నిండా మంచినీళ్లు. పెళ్లికి వచ్చేవాళ్లు ఎవరి చెంబు వారే తెచ్చుకుంటారు. విస్తళ్లలో వడ్డించారు. తొందరగా భోజనకార్యక్రమం పూర్తయితే ఒక ముఖ్యమైన పని అయినట్లు లెక్క. నీలకంఠశాస్త్రి కోసం ఎదురుచూస్తున్నారు. పదార్థాలు ఘుమఘుమలాడుతూ ఊరిస్తున్నాయి. శాస్త్రిగారు వస్తున్నానని కబురు పంపారు. ఇక ఎంతసేపయినా నిరీక్షించాల్సిందే. చేత్తో పదార్థాల మీద వాలుతున్న ఈగల్ని తోలుకుంటున్నారు. ఆకలి నకనకలాడుతోంది. నీలకంఠశాస్త్రికి ప్రత్యేకంగా వెండిపువ్వులు అతికిన పీట వేసారు. మిగిలినవారందరూ తాటాకుతో అల్లిన చాపలమీద కూర్చుని వెనుకగోడకు నడుం ఆన్చి అసహనంగా వీధిగుమ్మంకేసి చూస్తున్నారు.విష్ణాలయం వీధిలో మంచి బసే దొరికింది. బాపన్న నాయుడుగార్ని అభ్యర్థించి ప్రహరీగోడ లోపల చప్టా చుట్టూ దడి కట్టుకుని భోజనం ఏర్పాట్లు చేసుకున్నారు. వెలుగుకోసం లాంతర్లు, కాగడాలు ఉండనే ఉన్నాయి. శారదాచట్టం అమలులోకి వచ్చాక ముఖ్యంగా బ్రాహ్మణులకు పెద్ద ఇబ్బందే వచ్చింది. అయిదురోజుల పెళ్లి కాస్తా ఒక రోజులోకి మారింది. పిల్ల రజస్వల అవకుండానే మూడుముళ్లేయించా లని కదా శాస్త్రం. లేకపోతే పరువు పోతుంది. రాజమండ్రి దగ్గర కడియం నుండి పెళ్లికోసం వ్యయప్రయాసలతో యానాం విచ్చేసారు.