తలుపు మీద వ్రేళ్ళతో కొట్టినచప్పుడు. వెంటనే ‘‘మే ఐ కమిన్‌’’ అన్న పిలుపు చదువుతున్న మెడికల్‌ జర్నల్‌ ప్రక్కన పెట్టి ‘‘ప్లీజ్‌ కమిన్‌’’ అన్నాను.పరిచయమున్న ఓ స్థూలకాయం. వెనకగా ఆరడుగుల వ్యక్తి లోపలికి వచ్చారు.ఆమె పేరు సూర్యకాంతం. పేరుకు తగ్గట్లుగా సూరేకారమే. గుమ్మడి పండు కంటే గుండ్రనైన మొహం - రెండు యాపిల్‌ పళ్ళు అతికించినట్లు బుగ్గలు. మధ్యలో దొండకాయ పెట్టినట్లు ముక్కు - చైనా సంతతిలా కళ్ళు. వెండి వన్నెలో ఒత్తుగా వున్న ఉంగరాల జుట్టు. కొవ్వుముద్దలా గున్న ఏనుగులాంటిశరీరం.ఆమె వెన్నంటి వచ్చిన వ్యక్తి ఆమె భర్త పాపారెడ్డి. ఆజానుబాహువు ఆరడుగుల ఎత్తు. నల్లగా రంగేసి మెరిసిపోతున్న బుంగమీసాలు. కొంచెం బట్టతల లాల్చీ పైజమా వస్త్రధారణ. సౌమ్యుడు. పలుకుబడి గల వ్యాపారవేత్త.ఇద్దరూ దశాబ్దం పైగా నా పేషంట్స్‌.కుర్చీలో పట్టీపట్టని శరీరాన్ని, పప్పు నిండుగా డబ్బాలో పోసి కుదిపినట్లు చేసి కూర్చుంది సూర్యకాంతం ప్రక్కగా ఒదిగి కూర్చున్నాడు పాపిరెడ్డి.ఎప్పుడూ - నా రూంలోకి రాగానే - భర్తకి మాట్లాడే అవకాశం యివ్వకుండా ప్రతీదీ ఆవిడే మాట్లాడటం రివాజు.

ఆయనకు విరోచనాలు అయినా, ఎన్ని - ఎలా అనే విషయం కూడా ఆమె చెపుతుంది. అన్నింటికీ ఆయన మాత్రం ‘‘ఊ’’ కొడతాడు. చివరగా రెండు మాటలు మాట్లాడతాడు. ఎందుకు అని అడక్కుండా డాక్టరు రాసిన మాత్రలు వేసుకోవడం ఆయనకున్న మంచి అలవాటు.ఈరోజు పాపిరెడ్డి వచ్చి కూర్చొన్నప్పట్నించి, వెర్రి చూపులు చూస్తూ, వెకిలిగా నవ్వుతున్నాడు. మధ్యలో వంగి భార్య మొహంలోకి చూస్తున్నాడు. నోటిమీద వేలేసుకుని ‘ష్‌’ అంటూ శబ్దం చేస్తున్నాడు. వింతగా వుంది ఆయన ప్రవర్తన.‘‘చూడండి డాక్టరు గారూ’’ అంటూ యథావిధిగా ఆవిడే ముందు మొదలు పెట్టింది. ఈ మధ్య ఈయన ప్రవర్తన ఏదోలా వుంది. వారం క్రితం అర్థరాత్రి లేపి - చూడుకాంతం - నువ్వు నువ్వు కాదు. నేను నేను కాదు. నువ్వు సావిత్రివి. నేను నాగేశ్వరరావుని సావిత్రి మనాలిలో పల్లవి పాడితే. నేను అంటే నాగేశ్వరరావు చరణం పాడతాడు. ఇద్దరు కలిసి ఊటీలో యుగళగీతం పూర్తి చేస్తామంటూ సంధి ప్రేలాపనలు పేలారు. అదేదో నిద్దట్లో కల వచ్చి అలా చేశారేమో అను కొన్నా.