ఆయన పేరు బుల్లబ్బాయి.పేరుకి బుల్లబ్బాయి కాని నిజంగా బుల్లబ్బాయి కాదు. వయసు ఏభై ఏళ్ల పైమాటే!ఊరు - అన్నపూర్ణ కాదు అడుక్కుతినే పూర్ణ అయిన ఈ దిక్కుమాలిన రాష్ట్రంలో ఏదో ఒక ఊరు అనుకోండి.ఆయన మంచి పనివాడు. పొలంలో వళ్లు వంచి గట్టిగా చాకిరీ చేసేవాడు.భార్య రాగమ్మ. ఆమే చాకిరీ చేసే మనిషే!వాళ్లకి రెండు ఎకరాల స్వంత పొలం వుంది. ఇద్దరు కొడుకులు.‘‘ఇయ్యేడు రెండు ఎకరాలు పొలం మగతా తీసుకుని మిరపతోట వేస్తానే! పోయినేడు మిరప తోటల మీద వూళ్లో జనానికి బాగా డబ్బులు వచ్చినియ్యి!’’ అన్నాడు భార్యతో ఒకరోజు.‘‘మగతాకి ఎందుకయ్యా? మనం పొలంలోనే మిరప వేసుకుంటే పోదూ?’’ అంది భార్య రాగమ్మ.‘‘మన పొలానికి నీళ్లు అందుబాటులో లేవు. మిరపకి రెండు తడులు నీళ్లు పెడితే కానీ మంచి దిగుబళ్లు రావు. బాయి కింద వున్న పొలం తీసుకుంటా!’’‘‘సరే కానియ్యి. తీసుకునేదేదో మంచిపొలమే చూడు. మన పొలంలో పత్తివేసుకునికౌలుపొలంలో మిరప వేద్దాం. పోయినేడు పత్తిమీద కూడా బాగా డబ్బులు వచ్చినయ్యి’’ అంది రాగమ్మ.బుల్లబ్బాయి ఎక్కువ కౌలు పెట్టి మంచి పొలం, బాగా నీటి సౌకర్యం వున్న భూమి రెండు ఎకరాలు మగతాకి తీసుకున్నాడు.బుల్లబ్బాయికి చదువు లేదు. చిన్నప్పట్నించీ పొలంలో పని తప్ప మరో పని తెలియదు. పొలం పని మాత్రం కొట్టిన పిండి. 

కొండనైనా పిండి చేయగల దిట్ట! ఎంత పనైనా బుల్లబ్బాయిని చూసి వణికి పోవాల్సిందే! అంత గట్టిగా పనిచేస్తాడు.ఇద్దరు మనుషుల పెట్టు పని చేస్తాడని వూళ్లో జనం అంటారు.స్వంత పొలంలో ప్రత్తి, కౌలు పొలంలో మిరప వేశాడు.ఊళ్లో అందరి కంటే ముందు నాటాడు.‘‘ఎక్కువ మగతా పెట్టి పొలం తీసుకున్నాం. జాగర్తగా చేసుకోవాలి. ఒకరి కంటే మిగులుగానే పంట పండించాలి తప్ప తగ్గకూడదు’’ అన్నాడు భార్యతో.పొలంలో విత్తనం నాటిన తరువాత ఇక పొలాన్నే నివాసంగా మార్చుకున్నాడు.రేపు అనేమాటే లేదు. పనిలో అందరికంటే ముందు వుండేవాడు.పత్తిలో కానీ, మిరపలో కానీ, పురుగు కనబడితే చాలు, వెంటనే కొట్టుకి పోయి మందు లీటరు తీసుకొచ్చి మందు ట్యాంకరు భుజానికి ఎత్తుకొనే వాడు.భార్య మందులోకి నీళ్లు తీసుకొచ్చి పోయడానికి సిద్ధంగా వుండేది.పొలంలో కలుపుమొక్క కనబడేది కాదు. పుట్టిన మొక్కని పుట్టినట్టే లాగి పారేసే వాళ్లు.‘‘పసిబిడ్డను ఎట్ట సాకుతామో, పొలంలో పైరుని కూడా అట్టసాకాలే! ముదిమి పైబడినపడు బిడ్డలు మనకి ఎట్ట అక్కరకొత్తారో, పొలంలో పైరు కూడా అంతే! దాన్ని మనం బాగా చూసుకుంటే అదికూడా మనల్ని బాగా చూసుకునిద్ది!’’ అనేవాడు భార్యతో.