‘కూరలోయ్‌ కూరలూ’’ కూరలబండి నారాయణ కేక విని వీధిలోకి వచ్చింది హేమలత. అదే సమయానికి పక్క ఫ్లాట్లలోంచి హిమానీ, ఇంకా కొందరూ వచ్చేశారు.కూరలబండి నిండా కూరగాయలు. ఎవరికి కావల్సినవి వాళ్ళు బండిలో ఉన్న బుట్టలో వేసు కుని, నారాయణకి అందిస్తుంటే అతను వాటిని తూచి, వాళ్ళు తెచ్చుకున్న బుట్టల్లో వేస్తున్నాడు.బెండకాయలు ఏరుకుంటున్న హేమలత హఠాత్తుగా తలఎత్తి చూసి ఆశ్చర్యపోయింది. ఎదురుగా నిల్చుని బీరకాయలు చూసుకుంటున్న హిమానీ ఎందుకో గానీ, హేమలతను చూసి నవ్వుకుంటోంది. ఉన్నట్లుండి హేమలత తనను చూసేసరికి బిత్తరపోయి నవ్వాపుకునేందుకు విఫల ప్రయత్నం చేస్తోంది.‘‘ఏమైంది హిమానీ?’’ హేమలత అడిగింది.‘‘ఏం లేదు ఆంటీ. ఏదో గుర్తుకొచ్చింది అంతే’’ అనేసి, మామూలుగా మొహంపెట్టి, బీరకాయలు తీసుకుని, అక్కణ్ణించి నిష్క్రమించింది హిమానీ.అక్కడ ఉన్న అందరి మొహాల్లో అదొక మాదిరి నవ్వు, కొందరి మొహాల్లో జాలీ గమనించింది హేమలత.

 లేత బెండకాయలు, ములక్కాడలూ, టమోటాలూ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలూ, వంటకి ఏవీ తగ్గకుండా అన్నీ లెఖ్కచూసి, బుట్టలో వేసి నారాయణకి అందించింది హేమలత. వెళ్ళి, వెంటనే వంట చేసుకోవాలి. హేమలత పుత్ర రత్నం బాబీకి మధ్యాహ్నం క్యారియర్‌ పంపాలి. అందుకే ఏదీ పట్టించుకోకుండా వెంటనే ఇంటికి తిరిగి వచ్చింది.హేమలత భర్త ధనుంజయం పొద్దున్న ఒక చపాతీ తినేసి, బాక్స్‌లో కాస్త అన్నం కూరా పెట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. కానీ బాబీ అట్లా ఏదో ఒకటి తినే రకం కాదు. బాబీకి తల్లి వంట అంటే ప్రాణం. బాబీకి అన్నీ రుచిగా, వేడిగా ఉండాలి.బాబీకి ఇరవై మూడేళ్ళు.

బాబీ అంటే హేమ లతకీ, ఆమె భర్తకీ ప్రాణం.హేమలత కూరలు తరిగి వంట మొదలు పెట్టింది. బెండకాయ వేపుడు, టమోటా పప్పు, ములక్కాడల పులుసూ ఘమఘమలాడుతున్నాయి. వాటిని హాట్‌ ప్యాక్‌లో సర్ది, కొసమెరుపుగా అప్ప డాలూ, వడియాలూ వేయించి, వేరే కవర్లలో పెట్టి సిద్ధం చేసింది.బాబీ ఎప్పుడూ ఒక అద్భుతం లాగే కనిపిస్తాడు హేమలతకి. వాడు పుట్టి ఇరవై మూడేళ్ళవుతున్నా ఇంకా ఇందాకే వాడు పుట్టి, క్యారుక్యారుమని ఏడు స్తున్నట్లుంటుంది. వాడు బోర్లా పడటం, పాకటం, మెల్లగా నడవటం, అన్నీ కళ్ళముందు కదుల్తుంటాయి. వాడి నవ్వూ, ప్రతీ చేష్ఠా ఒక అద్భుతం లాగే ఉంటుంది.