రాత్రి నిద్రలేదు. దొంగలు ఇంట్లో పడినట్టు ఏవేవో శబ్దాలు, భయం. దుప్పటి కప్పుకుని, గట్టిగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు. చెమటలు పట్టిపోయాడు. తెల్లారి చూస్తే ఏమీ లేదు.శీతాకాలం. పైగా వాయుగుండం వాన. దానాదీనా చలి చంపేస్తోంది. ఆ చలిలోనే స్నానం చేశాడు దీక్షితులు. నుదుట బొట్టుపెట్టుకున్నాడు. కాఫీ కాచుకుని, వేడి వేడిగా తాగుతూ ఇంటి గుమ్మంలో కూర్చున్నాడు.వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడే పలకరించే దిక్కులేదు. ఇప్పుడీ వర్షంలో ఎవరొస్తారు? నిన్న కూడా ఎవరూ రాలేదు. ఈ రోజు వస్తారో రారో తెలియదు. వస్తే బాగుణ్ణనుకున్నాడు దీక్షితులు. నోటికి అడ్డంగా అరచేతిని అడ్డుపెట్టి ఊదాడు. తర్వాత ఆ చేతిని వాసన చూశాడు. కాఫీ వాసన వేస్తోంది చెయ్యి. పర్వాలేదనుకున్నాడు.చందమామ కథల్లో ఉన్నట్టుగా ఊరికి ఉత్తరాన మర్రిచెట్టులా ఈ బంగళా. ఆరు గదుల ఇల్లు. కింద నాలుగు గదులూ, పైన రెండు గదులూ. అప్పుడెప్పుడో చవగ్గా వస్తోందంటే కొనేశారు కొడుకూ-కోడలూ. ముచ్చటగా మూడు నెలలు కూడా లేరు ఈ ఇంట్లో. అంతలోనే అమెరికా వెళ్ళిపోయారు.పెద్దపెద్ద టీవీలు, బీరువాలు, మంచాలన్నీ... అయిదు గదుల్లో సర్ది తాళం పెట్టారు.‘‘నీకు ఈ కిచెన్‌, ఆ బెడ్రూం, ఆ బాత్రూం సరిపోతాయి కదా నాన్నా?’’ అడిగాడు కొడుకు.‘‘సరిపోతాయి’’ అన్నాడు దీక్షితులు.‘‘నీకేం భయం లేదు, రాత్రిపూట వాచ్‌మేన్‌ వస్తాడు. నువ్వు కూడా ఇక్కడ మహా అయితే ఓ ఆరుమాసాలో, ఏడాదో ఉంటావు, అంతే! ఆ తర్వాత అమెరికా వచ్చెద్దూగాని, కంగారుపడకు.’’ అన్నాడు కొడుకు.‘‘సరే’’ అన్నాడు దీక్షితులు.కొడుకూ-కోడలూ అమెరికా వెళ్ళిపోయారు.కొడుకు చెప్పినట్టుగానే నైట్‌వాచ్‌మేన్‌ వచ్చాడు. అయితే ఎక్కువ కాలం పని చెయ్యలేదు.‘‘ఇక్కడ పాములు ఎక్కువసార్‌’’ అన్నాడు. మానేశాడు.ఫోన్‌ మోగింది. ఆత్రంగా పడుతూ లేస్తూ వెళ్ళి, రిసీవర్‌ అందుకున్నాడు దీక్షితులు.‘‘హలో’’ అన్నాడు.‘‘దీక్షితులుగారితో ఒకసారి మాట్లాడాలి.’’ అటు నుంచి ఎవరో పెద్దాయనే మాట్లాడుతున్నాడు.‘‘చెప్పండి, నేను దీక్షితుల్నే మాట్లాడుతున్నాను.’’‘‘నమస్కారం సార్‌.’’‘‘నమస్తే’’‘‘మీరు సాముద్రికం బాగా చెబుతారనీ, చెయ్యి బాగా చూస్తారనీ తెలిసింది. మరోలా అనుకోకపోతే రేపు ఆదివారం నన్ను రమ్మంటారా?’’‘‘ఆదివారవాఁ...’’ అంటూ ఆగి, వెంటనే అన్నాడిలా దీక్షితులు.‘‘రేపు ఆదివారం ఇద్దరు ముగ్గురు వస్తాం అన్నారు. రేపటిదాకా ఎందుకు? వీలయితే ఇవాళే రండి.’’‘‘ఇవాళ కుదరదు సార్‌.’’‘‘ఇవాళంటే ఇప్పుడు కాదు, సాయంత్రం రండి.’’‘‘ఈ వర్షంలో రాలేను సార్‌! వర్షం తగ్గితే రేపు ఆదివారం వద్దామనుకుంటున్నాను.’’‘‘వద్దామనుకుంటున్నాను కాదు, రేపు ఆదివారం అయినా తప్పకుండా రండి.’’సమాధానంగా నవ్వు వినవచ్చింది.‘‘వస్తానండీ, ఉంటాను.’’ అన్నాడతను. ఇంకో మాటకు అవకాశం లేకుండా ఫోన్‌ కట్‌ చేశాడు. బాధనిపించింది దీక్షితులికి. రిసీవర్‌ క్రెడిల్‌ చేసి, చేతిలోని కాఫీ గ్లాసుని ఓసారి చూశాడు. ఎంగిలి గ్లాసును కడుక్కోవాలి, తప్పదనుకున్నాడు. సింక్‌ దగ్గరగా నడిచాడు దీక్షితులు. నడుస్తోంటే... మోకాళ్ళు రెండూ నరకం చూపించాయి. నడవలేకపోయాడు. అడుగడుగుకీ ఆగిపోయి, సేదదీరాల్సి వచ్చింది. లక్ష్మి నయం అనుకున్నాడు.