మనిషికి మరో మనిషి అంటే భయం. బయటకు తొంగి చూడాలంటే భయం.అడుగెయ్యాలంటే భయం. అంతా భయం. మనసులో భయం, కల్మషం, భిన్న భావాల సంఘర్షణ. ఇలాంటి చోట మానవత్వాన్ని మనిషితనాన్ని కాపాడేవారు ఎవరైనా ఉంటారా?ఎందుకు లేరూ?మంచిని రక్షించాలని తపించే కరీముల్లాలు ఉన్నారు.అందుకేనేమో... మండు వేసవి నిప్పులు చెరిగినా, కొద్దిగా ఆలస్యంగానయినా ఆకాశం వర్షిస్తుంది.ఒక మనసున్న యువకుడు, నా కంపెనీకి ఒక ఫ్యూచర్‌లీడర్‌గా దొరికాడనే ఆనందం, నన్ను ఆ జడివానలో తడిపేసింది.‘‘మతం కన్నా మంచి గొప్పది, మానవత్వం గొప్పది. తోటి మనిషిని, మనిషిగా గుర్తించక, నేను ఈ మతస్తుణ్ణి అని మానవత్వాన్ని, మానభంగం చేస్తుంటే ఊరు కోలేక, నావంతు కర్తవ్యం నిర్వహించాను సర్‌ ఆ రోజు’’ అంటున్న కరీముల్లా మాటలే నా చెవిన ప్రతిధ్వనిస్తున్నాయ్‌.కరీముల్లా ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనిపించింది ఆ క్షణం.జన్మతహా హిందువైన అతడు నిజంగా హిందువా?ముసల్మాన్‌ పేరు పెట్టుకున్న అతను ముసల్మానా?కాదు...అతను ఈ గడ్డ గర్వించదగ్గ ముద్దుబిడ్డ.నా కంపెనీలో ఇంటర్వ్యూ జరిపే పద్దతి చాలా విభిన్నంగా ఉంటుంది. అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఎందుకంటే వాళ్లే ఈ కంపెనీని రేపు ముందుకు నడిపించే రధ సారధులు.టెక్నికల్‌ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన అందర్నీ ఒకేసారి పిలవటం నాకు అల వాటు. వాళ్ళందరికీ అనేక విషయాలొచ్చి, వాళ్ళు చర్చిస్తుంటే, వాళ్ళ ఆలోచన తీరూ, లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌ అవీ జాగ్రత్తగా గుర్తించి నాకు నచ్చిన వాళ్ళని ఎంచుకుంటాను.

ఆ ప్రయత్నంలో భాగంగా జరిపిన ఇంటర్వ్యూలో నా దృష్టికి వచ్చిన మణిపూస కరీముల్లా.అభ్యర్థులు అందరూ తమని తాము ముందు ఇంట్రడ్యూస్‌ చేసుకుంటున్నారు.‘‘అయాం కరీముల్లా, సన్నాఫ్‌ రామనాధశాస్త్రి’’ అని చెప్పినప్పుడే అతని కేస్‌ కొంచెం ఇంట్రె స్టింగ్‌గా అనిపించింది.నేను ఇచ్చిన అన్ని టాపిక్స్‌ మీదా చాలా మెచ్యూర్డ్‌గా మాట్లాడుతున్న అతను నన్ను మరింత ఆకర్షించాడు.మిగతా అందరు అభ్యర్థుల్నీ పంపించి, అతన్ని ఒక్కడినే ఉండమన్నాను.అది అంత రిలవెంట్‌ క్వశ్చన్‌ కాకపోయినా, చాలాసేపటి నుండీ నన్ను వేధిస్తున్న ప్రశ్నని అడి గేశాను.