‘‘పురుషుడి బలహీనత స్ర్తీ. బలం కూడా స్ర్తీనే. అందుకే బలవంతంగానైనా స్త్రీని తన వశం చేసుకోవాలని చూస్తాడు పురుషుడు’’.‘‘ఫలితం. స్త్రీ అనాదిగా కన్నీరు కారుస్తోంది.’’‘‘కన్నీరు ఆమె గుత్త సొత్తు. కర్ణుడికి కవచ కుండలాల లాగే.’’‘‘పాపభీతి వుండదా?’’‘‘కామాతురాణాంన భయం లజ్జా. భయమూ సిగ్గూలేనివాడికి పాపుణ్యాల ఆలోచన వుండదు.’’‘‘ఇది పురుషుడి ‘అహం’ కాదా?’’‘‘కావొచ్చు. కానీ పురుషుడి ‘అహం’ క్షణికమే.

తర్వాత వాడు కాంత దాసుడు.’’‘‘దాసత్వం వాడి బలమా?’’‘‘స్ర్తీని జయించడానికి వాడు ఆమెకు దాసుడు కావడానిక్కూడా సిద్ధపడతాడు. జయించాక మీసం మెలేస్తాడు.’’‘‘అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. అంతేనా?’’‘‘ఓటమిని భరించలేడు పురుషుడు స్ర్తీని జయించడం అసాధ్యం అని తెలిసినా. స్ర్తీ అంటే ప్రకృతి....శక్తి.’’‘‘చంద్రునిపై అడుగు పెట్టిన మానవుడు ప్రకృతిపై విజయం సాధించినట్టు కాదా?’’‘భ్రమ, భ్రమలో బతుకుతున్నాడు మనిషి. ప్రకృతికి మహా ఓర్పు - ఆమె ఓర్పు నశించిననాడు మానవుడు మసైపోతాడు. స్ర్తీకి ప్రకృతికి తేడా లేదు.’’‘‘అంటే స్ర్తీ ఓర్మికి ఇంకా పరీక్షాకాలం ముగియ లేదా?’’‘‘ముగింపు తొందరలోనే వస్తుంది.’’‘‘అంతవరకూ పురుషుడి ఆకృత్యాలకు స్ర్తీ బలికావాల్సిందేనా?’’‘‘ఇక్కడ బలైపోవడం అంటూ ఏదీ ఉండదు. రెండు శక్తులు పరస్పరం కలుసుకోవడానికి చేసే పోరాటం ఇది. ఏనాటికయినా ఈ పోరులో గెలుపు స్ర్తీదే.’’‘‘పురుషుడి శారీరక బలం?’’‘‘రెల్లుగడ్డి లాంటిది. 

భగ్గున మండి ఆరి పోతుంది. స్ర్తీ శక్తి నిరంతరం జ్వలించే బడబానలం. ఆర్పే శక్తి లేని పురుషుడు ఆడబిడ్డకు ఊహ వచ్చినప్పటి నుండీ ఆమెను బలహీనపరుస్తూ వస్తాడు. ఆమె ఆ మాయావరణంలోనే అశక్తురాలిగా బతికేస్తుంది. సత్యం తెలుసుకున్ననాడు....’’‘‘ఆమెను నిలువరించే శక్తి ఎవరికీ ఉండ దంటావ్‌. అంతేనా?’’‘‘అవును. నిజమంతే...’’‘‘నేను ఒప్పుకోను. మానవేతిహాసంలో స్ర్తీ తిరగబడినట్టు, ప్రళయ ప్రకృతిలా విరుచుకుపడినట్టూ లేదు. సీతామాత కూడా పతి మాటలు శిరసావహించి అగ్నిలో దూకింది. అగ్ని పుత్రి ద్రౌపది కూడా భీముడు తెచ్చే దుశ్శాసనుని రక్తం కోసం నిరీక్షించింది. అంతేగానీ స్ర్తీలు స్వయంగా...’’‘‘అదే రహస్యం. స్ర్తీని దాసీగా ఉంచాలనే ఆలోచనతో అల్లిన కథలు అవన్నీ. ‘నస్ర్తీ స్వాతంత్య్ర మర్హసి’ ఇట్లాంటి మాటలతో; కథలతో స్ర్తీలపై విజయం సాధించాననుకుంటున్నాడు పురుషుడు.’’