ఊరికి ఉత్తరానున్న రాదారి బంగళా వెనకవైపు రెండో వాసలో ఉన్న తాటాకుల యిళ్ళ కొప్పుమీద కునక బోతున్న చంద్రుడు మసకమసకగా ఉన్నాడు.ఆ రెండో వాసలో ఉన్న తాటాకు మిద్దె యింటి మధ్య గదికి తూర్పు గడపలో, ఓ మూలనున్న హరికేను లాంతరు గుప్పుగుప్పుమని కునక బోతూంది. ఆ పక్కనే ఉన్న కుక్కి ఈజీచేరులో కునికీడానికి సిద్ధంగా ఉన్న కాంతం నరికిన దేవదారు మొక్కలా ఉంది.ఆ మధ్య గది గడప యివతల ముంగిట్లో గడకర్రలా నించున్న అర్జయ్య ఒక్కసారిగా తేరుకొని గడపలో కుక్కి ఈజీచేరులో పడివున్న కాంతం దగ్గరకి గబగబా వెళ్ళి నందిట్లోకి పట్టుకొని వెక్కివెక్కి ఏడుస్తూ ఆవిడ ముఖం మీద ముద్దులు పెట్టుకొంటూండగా అతని చేతులు చల్లబడ్డాయి. పెదవులు తుడిచేసుకొని గుండెమీద బనీనుకు రాసుకోబోతే బనీను కూడా చల్లగా తగిలింది. ఆ ఈజీచేరు ముందుని తన కాళ్లకింద కూడా చల్లగా ఏదోతగిలింది. అదంతా చచ్చిపోడానికి సిద్ధంగా వున్న ‘‘కాంతం’’ రక్తం.కాంతం ముఖం మీద నీళ్ళు చల్లితే...ఆ వరండా గడపలో నీళ్లతో చెంబుగాని బాల్చీగాని లేదు. ఆ గడపకు రెండో మూలనున్న రేకు తలుపు తోసుకొని అర్జయ్య గదిలోకి వెళ్లేడు. ఆ గదంతా చిందరవందరగా ఉంది. నాలుగయిదు పేకేజీ పెట్టెచెక్కలు విరిగి పోయి ఉన్నాయి. ఓ సరుగుడు కర్రపేడు అడ్డంగా పడివుంది. కిరసనాయిలు ‘‘స్టౌ’’ యింకా వెలుగుతూ వుంది. బర్నర్‌ మీదుండే మూత ఓ పక్కను దొర్లిపోయి వున్నది. స్టౌ పక్కనే మాసిన ఓ తెల్ల లంగా. ఓ ఆకుపచ్చ చీరముక్కా పడి వున్నాయి.

అప్పుడే ఒక పదిహేను నిమిషాల క్రితం తాను చేసిన మహా ఘోరమైన పనికి నిదర్శనాల క్రింద అవన్నీ అలా పడివున్నాయ్‌.ఓ పావుగంట క్రితం ఆ పేకేజీ చెక్కల్తో కాంతాన్ని తలమీదా, చేతుల మీదా, జెబ్బలమీదా, కాళ్ళమీదా, తొడలమీదా, వీపుమీదా ఏమీ కాకుండా చితకబాదేడు. ఆ చెక్కలు చెక్కలైపోయాయి. మూలనున్న సరుగుడు పేడు తీసేసరికి కాంతం యింటిపక్క సందులోకి పరుగెత్తింది. దాని వెనకాతలే సర్రున పరుగెత్తుకెళ్లి దాని కొప్పు దొరకపుచ్చుకొని యింట్లోకి బరబరా ఈడ్చుకొని వచ్చి సరుగుడు పేడుతో నెత్తిమీద కసి తీరా ఒకటి కొట్టేసరికి ఆరో నెల కడుపుతో వున్న కాంతం మొదలంటూ నరికిన దేవదారు మొక్కలా కుప్పకూలిపోయింది.అప్పటికీ తన కసి తీరలేదు. తాను వచ్చేనని తెలియగానే టీ కాయడానికి నీళ్ళు మరగబెట్టడానికి కాంతం వెలిగించిన కిరసనాయిల్‌ స్టౌ యింకా వెలుగుతోంది. స్టౌ మీద కప్పు బాగా కాలి మరిగి ఉంటుంది. ఆ కప్పుతో దానికి వాతలు పెడితేనేగాని దానికి బుద్ధిరాదు. తన కసి తీరదు. వెంటనే దాని చీర చెంగు లాగి పారేశాడు. లంగా ఊడబీకేసేడు. బర్నర్‌ మీద కప్పుతో దాని తొడల్లోపలా రొమ్ము మీదా, పొట్ట మీదా వాతలు వేసేసేడు.