యాదయ్యను తల్లీతండ్రీ మట్టి తట్టలు మోసి డబ్బులు పోగేసి బి.యస్‌.సి. చదివించారు. కొడుకు ఫస్ట్‌క్లాస్‌లో పాస్‌ కాగానే తమ కష్టాలు గట్టెక్కాయని సంతోషించారు. ఎక్కడైనా మంచి కొలువు దొరుకుతుందనుకుంది యాదయ్య భార్య లకి్క్ష. యాదయ్యకి చిన్నతనంలోనే పెళ్లి చేశారు. యాదయ్య తల్లీతండ్రీ ముంబాయిలో మట్టి పని చేస్తున్నారు. లకి్క్ష, యాదయ్య మహబూబ్‌నగర్‌నగర్‌ ప్రక్కన పల్లెటూర్లో వుంటున్నారు. యాదయ్య డిగ్రీ పాసయి సంవత్సరమైంది. హైదరాబాద్‌లో, మహబూబ్‌నగర్‌లో ప్రయత్నించాడు ఏ చిన్న ఉద్యోగమైనా సరే. ఎంతో కొంత సంపాదించి తల్లిదండ్రులకు సాయపడాలని. తనకు ఉద్యోగం దొరక్కపోయేసరికి కూలినాలి చేసి లకి్క్ష ఇంటిని నడుపుకొస్తోంది. తను ఏం చేయాలి? కొలువు ఎక్కడ దొరుకుతుంది? ఆలోచిస్తూ ఇంటి అరుగుమీద కూర్చున్నాడు.‘‘అన్నా! నాయన ఫోన్‌ చేసిండట’’ అంటూ పన్నెండేళ్ల తమ్ముడు మల్లయ్య వచ్చి చెప్పాడు.వెంటనే లేచి పరిగెత్తినట్లుగా రోడ్డుకు అవతల ప్రక్కనున్న రోషన్‌ అలి కొట్టుకెళ్లాడు. రోషన్‌ అలి చిల్లరకొట్టు నడుపుతుంటాడు. అతని కొట్లో టెలిఫోన్‌ కూడా వుంది. రోషన్‌ అలి కొట్టుకు వెళ్లేసరికి, ఫోన్‌ రిసీవరు తీసి ఉప డబ్బాలో పెట్టి ‘‘రా, యాదయ్యా మీ నాయన ఫోన్‌ చేసిండు చూడు’’ అన్నాడు.ఫోన్‌ సంభాషణ,‘‘హల్లో నాయినా బాగున్నావే, అమ్మ బాగుందా?’’‘‘ఆ బాగనే వున్నమురా, నీవెట్లా ఉన్నవ్‌. తమ్ముడు, లచ్చిమి బాగున్నారా. బాగ సదివిస్తన్నవా?’’‘‘బాగనే సదివిస్తన్ననే. బాగా సదివిన నాకే ఎంత తిరిగినా ఉద్యోగం దొరుకుతలేదు. ఏమి చెయ్యాల్నో అర్ధంగాకుండా ఉంది’’.‘‘బాధపడకు బిడ్డా! ‘సబర్‌కాఫల్‌ మిఠా’ అన్నారు. ఏ చదువులు సదవని మేము రెక్కలు ముక్కలు చేసికుంటున్నము. మీ అమ్మమీద నామీద పదివేలు అప తీసికుంటిమి మేస్త్రిగాడి దగ్గర. పిరిగా అన్నంబెట్టి, సుట్ట బీడీ ఖర్చుపోను మిగిలింది అపలేసుకుంటున్నడు.

 ఈ ముంబాయిల నూకలు కూడ పిరమే. ముక్కిపోయిన నూకలు వండిపెట్టి, పప్పో, పచ్చిపులుసో పోస్తడు. ఇగ జొన్నరొట్టెలు పొద్దంత తట్టమోసి ఎవర్ని చెయ్యమంటే, ఎవరు చేస్తరు? మరాఠోల్లకు కూలి ఇచ్చి చేయించరాద, అంటే నేనెక్కణ్ణించి కూలి పైసలియ్యాల మరాఠి దానికి. కాంట్రాక్టర్‌ గాడికి లాస్‌ వచ్చిందంట. ఉన్నదాంట్లనే సదరుకొమ్మంటున్నడట.’’‘‘నాయినా! నాకేదైనా మంచి ఉద్యోగం దొరికితే మీరు మట్టిపని మానేసి ఇంట్లుండాల్నే. ఇంత సదువు సదివి, మీ పని మానిపించలేకపోతున్నా’’.‘‘బిడ్డా నీవు బాధపడకు. నీ కొలువుకేమి తొందర. మేమున్నముగద. దొరికినపడే దొరుకుతుంది. అది మన చేతుల లేదుగదరా’’.‘‘నేను గూడ ముంబాయి రావాల్నాయే. మీతో కల్సి పనిచేస్తా’’.‘‘ఒద్దు నాయినా ఒద్దు. నీవు సదువుకున్నోడివి ఈ పనికి రావద్దు’’.‘‘సరేలే’’‘‘మరి పెట్టేస్తున్నా’’‘‘మంచిది’’యాదయ్య మనసు మనసులో లేదు. తన పెళ్ళాం ఇక్కడ, అక్కడ కూలికైకిలి చేసి తనను తన తమ్ముణ్ణి సాదుతున్నది. తనకు చిన్నపడే పెళ్లిచేసి సగం బాధ్యత తీర్చుకున్నారు తల్లిదండ్రి. లచ్చిమి చేతికి వచ్చిన రెండో సంవత్సరము నుండి కూలి చేస్తున్నది. తాను ఒక్క పని ముట్టుకునేవాడు కాదు. అదే అమ్మ, అయ్య అయి తిండి పెడుతున్నది. తాను నిమ్మలంగ సదుకోడానికి తోడ్పడింది. పెళ్లానికి బరువైపోయాడు ఉద్యోగం దొరకక. నేను కూడ ముంబాయి పోయి అమ్మా నాయిన పని చేస్తే తొందరగా అప తీరుతది. ఔను అట్లానే చెయ్యాలె, కాని లచ్చిమి ఒపకుంటుందో లేదో ముంబయి పోనికి.