ఫోను రింగవుతోంది. అప్పుడు సమయం రాత్రి ఎనిమిదిన్నర. రాఘవరావు గారు భోజనం చేస్తున్నారు. ఆయన భార్య జానకమ్మ వడ్డిస్తోంది.‘‘వెళ్ళి ఫోను తియ్యి’’... భార్యకి చెప్పారు రాఘవరావు గారు.‘‘అందుకే చెప్పాను. నేను కూడా భోజనానికి కూర్చోనని... మధ్యలో ఇలాంటివి వస్తే ఇబ్బందని...’’ విసుక్కుంటూ వెళ్ళి ఫోన్‌ తీసింది. అది కార్డ్‌లెస్‌ ఫోను.‘‘హలో ఎవరూ...నువ్వా... విశ్వం.. ఆఁ...నాన్నగారు ఉన్నారు.... భోజనం చేస్తున్నారు. మళ్ళీ ఫోను చెయ్యక్కర్లేదు. కార్డ్‌లెస్‌ ఫోను వచ్చిందిగా... అది ఇస్తాను నాన్నగారికి. ఇంతకీ నువ్వెలా ఉన్నావు... ఎప్పుడొస్తున్నావు... పరీక్షలయ్యాయా... ఉండు లైన్లో.... ఇదిగో మీకే మీ పుత్రరత్నం...’’ అంటూ జానకమ్మ ఫోను రాఘవరావు గారికి అందించింది.‘‘ఏం నీక్కాదా...’’ అంటూ ఫోను అందు కున్నారు రాఘవరావుగారు.‘‘చెప్పు విశ్వం...ఏవిఁటి సంగతి అంటూ ఫోను చెవి దగ్గిర పెట్టుకున్నారు. కుడి చెయ్యి కంచంలోనే ఉంది. చేతి నిండా పెరుగుతో కలిపిన అన్నం ముద్ద వుంది.విశ్వం ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు జానకమ్మకి. భర్త మొహంలో మారుతున్న రంగులు విచిత్రంగా కన్పిస్తున్నాయి. అతని మొహంలో రౌద్రం పెరుగుతోంది. నుదుట ముడ తలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విశ్వం ఏ విషయం చెప్తున్నాడో అర్థం కాలేదు.‘‘నువ్వు చెప్పేదేనా...నా మాట కూడా విను..’’ రాఘవరావు గారి నోటి వెంట ఒక్క అరుపుతో కూడిన మాట విని భయపడింది జానకమ్మ.పుట్టి బుద్ధెరిగి ఆయనలో అంత కోపం ఎప్పుడూ చూడలేదు. 

అసలు విశ్వం మీద అంతలా ఎప్పుడూ కోపం ప్రదర్శించలేదు. పరీక్ష తప్పినప్పుడు కూడా నెమ్మదిగా మందలించి చదువు అశ్రద్ధ చేయొద్దని, అదే నీకింత అన్నం పెడుతుందని నచ్చచెప్పి దార్లో పెట్టారు. అలాంటిది ఇవాళ ఏం కొంప మునిగిందో.... ఆయన కోపం తారాస్థాయికి చేరుకుంది. కంచంలో చెయ్యి పెద్ద చప్పుడు చేస్తూ కంచాన్ని పైకె త్తి టేబుల్‌ మీద పడేసింది. పెరుగన్నం అంతా టేబుల్‌ మీద చిందర వందరగా పడి పోయింది.ఫోను దూరంగా విసిరేసారు రాఘవరావుగారు. కోపం దుఃఖంలోకి మారిపోయింది. నిస్సహాయ స్థితి ఆయన్ని ఆవహించింది. ఎంగిలి చెయ్యి అని కూడా చూడకుండా ఆయన నుదుటి మీద ఆ చేత్తోటే కొట్టుకున్నారు. కళ్ళ వెంట కన్నీరు ధారాపాతంగా కారిపోతోంది.నోట్లోంచి ‘అయ్యో!’ అన్నమాట వెలువడింది.జానకమ్మ ఆ హఠాత్పరిణామానికి భయపడిపోయింది. భర్త తన కొడుకు నోటి వెంట ఎలాంటి దుర్వార్త విన్నారో... అసలేం జరిగిందో తెలీక వణికి పోయింది.ఒక్క విషయం మాత్రం స్పష్టంగా ఆమెకి తెలుస్తోంది. అది... విశ్వానికి ఏమీ హాని జరగలేదని. ఎందుకంటే విశ్వమే అవతల మాట్లాడుతున్నాడు కనుక.