పెళపెళరవంతో పిడుగు దూరంగా భూమిని డీకొంది. ఒక్కసారిగా వురుములతో మెరుపులతో తెలవారబోతున్న మసక వాతావరణం ఉలిక్కిపడింది. ఆ మెరుపుకు చిట్టడివిలా వున్న ఆ యింటి తోటలోని వేపచెట్టూ, రంగు వెలసిపోయిన గోడలూ, క్షణకాలం దేదీప్యమానమయ్యాయి. అంతగా ఎత్తు పెరగని వేపచెట్టు గుబురుగా ముదురు రంగులో వుంది. వేపచెట్టు కొమ్మల్లో గూడు వొకటి వుంది. మేఘావృతమైన ఆ ఉదయం కాస్తా జల్లు కురిసి ఆగింది. కురిసిన వర్షపు జల్లుతో, గూడు తడిసింది. గూడులోని తల్లీపిల్లా రెండూ తడిసిపోయాయి.మరొక్కసారి పెళపెళలాడుతూ ఉరుమూ, జిగ్‌జిగేలుమంటూ మెరుపూ పరుచుకున్నాయి. గూడులోని పిచ్చుకపిల్ల ఆ వెలుగుకూ, ఆ శబ్దానికీ బెదిరిపోయి తల్లి రెక్కల్లోకి వొదిగింది.‘ఈమాత్రం దానికే యింతగా బెదిరిపోతున్నావే. పెరిగి పెద్దగవుతూ యింకెంత భయాన్ని చూస్తావో, యేమో’ అనుకుంటూ తల్లి దాన్ని మరింత దగ్గరగా అదుముకుంది గానీ, తడివల్ల వెచ్చదనాన్ని ఇవ్వలేకపోయింది. తల్లి పిచ్చుక గూడు బయటికొచ్చి తడిసిన వొంటిని ఆరబెట్టుకునేందుకని ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి, వొంటిమీద ఈకలన్నింటినీ ఒక్కసారి కుదుపుతో కదిలించి, రెక్కలను టపటపలాడించింది. అలా నాలుగైదుసార్లు చేసింది. ఎగిరిన ప్రతిసారీ, చిన్నచిన్న నీటి రేణువులు చుట్టూ గాల్లోకి పరుచుకుంటూ, సూక్క్షవర్షం కురిసింది.పిచ్చుకపిల్ల కిచకిచమని పిలుస్తుంటే తల్లి గూడువద్దకు ఎగిరింది.

 పిల్ల పిచ్చుక తల్లిని చూసి సరాగాలు పోతూ దాని వీపుమీదకు ఎక్కి మెడకు మెడను ఆనించి, అమ్మను ముక్కుతో తియ్యగా, సుతారంగా గుచ్చింది. పిల్ల పిచ్చుకను చూస్తుంటే తల్లికి ఎంతో ముచ్చటేసింది. తుషారస్ఫటికాలతో, తడిసిన గచ్చగాయ రంగు వొంటితో, నుదుటి మీద ముదురు రంగు నక్షత్రాకార మచ్చతో, గొంతు కింద నుంచి పొట్టదాకా హిమరాశి పేరుకున్నట్టు, తెల్లగా ఎంతందంగా వుంది తన బిడ్డ! అచ్చం తన పెనిమిటి పోలికే. మైమరపుతో తల్లి పిచ్చుక రెక్కలు టపటపలాడిస్తూ, ముక్కుతో బిడ్డకు మేధో సంజ్ఞ చేసింది. ఏమర్థం చేసుకుందో ఏమోగానీ, పిచ్చుకపిల్ల కూడా తల్లిలానే రెక్కలనాడించింది. అది రెక్కలనాడించినపడంతా దాన్ని తడిపిన వాన చెమ్మ తల్లిచుట్టూ పరుచుకుంటూ వుంది. తల్లి బిడ్డచుట్టూ కేరింతలు కొడుతూ, గూడు మీద కిచకిచమని ఎగురుతూ చిన్నదాన్ని ఉత్సాహపరుస్తూ ఉంది.మెల్లగా తొలిభానుడి రేకలు విచ్చుకుంటున్నాయి. తడిసిన ప్రకృతి వెచ్చబడుతూ వుంది. ఉదయభానుడి బంగారు వర్ణపు కిరణం పిల్లపిచ్చుక గచ్చకాయ వర్ణపు వొంటిని తాకి గిలిగింతలు పెడుతోంది.వేపచెట్టు ఆకుల మీద కాంతి ప్రతిఫలించి కొంత సంభ్రమాన్ని వ్యాపింపజేస్తోంది. మెల్లగా చెట్టు కొమ్మల మీద పరుచుకున్న వెలుగులో జీవసంచారం ప్రారంభమైంది. చీమలూ, నానారకాల పురుగులూ, పక్షులూ కదలబారుతున్నాయి. తల్లి పిచ్చుక, బిడ్డతో మురిపాలు సాగిస్తూనే పురుగుల్ని ఒక కంట గమనిస్తూ ఉంది. పైకొమ్మ మీద తిరుగాడుతున్న పురుగుల్ని నాలుగింటిని వొడిసిపట్టుకొని తెచ్చి బిడ్డముందేసింది. పిల్లపిచ్చుక గిలగిలలాడుతున్న పురుగుల్ని వింతగా చూస్తూ, తప్పించుకోవడానికి పాకిపోతున్న ఒక్కో పురుగునూ పొడిచి పొడిచి వాటి ప్రాణాలతో ఆడుకుంటూ ఆరగించింది. బిడ్డను గమనిస్తున్న తల్లి పిచ్చుక, బిడ్డ ఆటను చూసి నిర్వేదంగా నవ్వుకుంది.