ఉన్నత పాఠశాల చదువు పూర్తయ్యాక నాన్న నన్నో ప్రశ్న అడిగాడు ‘‘ఇప్పుడేం చెయ్యాలనుకుంటున్నావ్‌?’’నేను జవాబు చెప్పకుండా నాన్నని ఎదురు ప్రశ్నించాను. ‘‘నేను ఏం చేస్తే బావుంటుందనుకుంటున్నారు?’’‘‘ఉద్యోగం చేస్తే బావుంటుంది’’ నాన్న సమాధానం.‘‘ఒకరి కింద పని చెయ్యటం నాకిష్టం లేదు’’ అన్నాను.‘‘అలాగైతే వ్యాపారం చెయ్‌’’ అన్నారాయన.‘‘ఈ కాలంలో నీతిగా వ్యాపారం చెయ్యలేం. జనాల్ని లేదా ప్రభుత్వాన్ని మోసగించటం నాకిష్టం లేదు’’ నిష్కర్షగా అన్నాను.‘‘మరైతే ఏం చేస్తావ్‌?’’‘‘ఇంకా చదువుకుంటాను.’’అలా కాలేజీలో చేరి డిగ్రీ వరకు చదువుకున్నాను. డిగ్రీ పూర్తయ్యాక నాన్న మళ్ళీ అడి గాడు.‘‘ఇప్పుడేం చెయ్యాలనుకుంటున్నావ్‌?’’‘‘ఆ విషయం ఇంకా నిర్ణయించుకోలేదు’’.‘‘కాని బతుకు దెరువు కోసం ఏదో ఒకటి చెయ్యక తప్పదు కదా’’.‘‘నేనేం చెయ్యాలనుకుంటున్నానో చెబితే అది మీకు నచ్చక పోవచ్చు’’.‘‘అంటే ఏం చెయ్యాలో నువ్వు ఇదివరకే నిర్ణయించుకున్నావన్న మాట.’’‘‘అవును. కాని మీకది నచ్చదని చెప్పలేదు’’.‘‘లోకో భిన్న రుచి! నా ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకు. నీ మనసులో ఉన్నదేమిటో సూటిగా చెప్పెయ్‌’’.‘‘నాకు రచయిత కావాలని ఉంది’’.‘‘ఏం రాయాలనుకుంటున్నావ్‌? వ్యాసాలా, కథలా?’’‘‘కథలు!’’‘‘నీ ఇష్టం. కాని కథలు రాయటం నువ్వనుకున్నంత తేలిక కాదు. దానికి జీవితానుభవం కావాలి.’’నాన్న అభిప్రాయాన్ని సవాలుగా తీసుకుని నేను రచనా వ్యాసంగాన్ని వృత్తిగా చేపట్టి కథలు రాయటం మొదలు పెట్టాను.

నా మొదటి పాఠకుడు నాన్న! ఏమి రాసినా మొదట ఆయనకే చదివి వినిపించేవాణ్ణి. కాని ఆయన నా కథను మెచ్చుకోకుండా ‘‘ఇందులో కొత్తదనమేముంది? అంతా పాత చింతకాయ పచ్చడి’’ అనేవాడు.ఆయన విమర్శ నన్ను నిరాశపర్చేది. రాసిన కాగితాల్ని చింపి పారేసేవాణ్ణి. ‘‘ప్రతి పాఠకుడు కొత్తదనం కోసం తహతహలాడుతున్నాడు. కాని ఈ కాలపు రచనల్లో వైవిధ్యమనేది మచ్చు కైనా కన్పించటం లేదు. అందువల్ల నీ తొలి కథని కొత్తదనం, వైవిధ్యం వెల్లివిరిసేలా రాసి నిన్ను నువ్వు సాహితీ లోకానికి పరిచయంచేసుకో. దానికోసం నువ్వు జీవితాన్ని దగ్గరి నుంచి పరిశీలించాలి’’ అంటూ నాన్న తన మనోభావాల్ని వెల్లడించేవాడు.నాన్న ఫ్రెంచి సాహిత్య చరిత్రని క్షుణ్ణంగా చదివాడు. దాని ఆంగ్ల అనువాద పుస్తకాల్లోని ముఖ్యమైన వాక్యాల్ని ఎర్ర రంగు పెన్సిల్‌తో మార్క్‌చేసి నన్ను చదవమని ఇచ్చేవారు. అయితే నాకా రచనల్లో కొత్తదనమేమీ కన్పించలేదు. బహుశా ఆ కాలానికదే కొత్తదనం కావచ్చు. లేక నేను కొత్తదనాన్ని గ్రహించే స్థాయికి ఎదగకపోయి ఉండొచ్చు.నా రచనల్లో కొత్తదనం కోసం నేను ఏడాదిగా ప్రయత్నించినా అనుకున్నది సాధించలేకపోయాను. అక్కడికీ కొన్ని రచనల్లో ఓ మోస్తరు కొత్తదనం చూపగలిగినా నాన్నని మెప్పించలేకపోయాను. తన అభిలాషని నేను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఓ రోజు ఆయన ఓ దినపత్రికలోని క్లిప్పింగ్‌ నాకిచ్చాడు. అందులో తన ఇంటర్వ్యూలో ప్రముఖ ఫ్రెంచి నవలా రచయిత ప్రౌస్ట్‌ ఇలా పేర్కొన్నాడు.