ఈ భూమ్మీద మా అడ్రసు లేని రోజుల్లో నమ్మిన బంటు లాంటి మా యింటి జీతగాని గురించి మా అమ్మ చెప్తుంటే వాడిని చూడాలని, వాడిప్పుడు మా యింట్లో పని చేస్తుంటే ఎంత బాగుండేదని అన్పించేది మాకు.వాడి పేరు కుప్పడు. తమిళనాడు లోని తిరువణ్ణామలై నుంచి వచ్చి దాదాపు ఐదేండ్లు మా యింట్లో పని చేసి వున్నట్టుండి సొంత యింటి మీద గుబులు మళ్లి వెళ్లిపోయినాడు. వెళ్లేటప్పుడు పదే పదే మళ్ళీ రమ్మని చెప్పినా రాలేదని చెప్పేది మా అమ్మ.కుప్పడు మళ్లీ వస్తే బాగుణ్ణు అని మాకు అన్పించడానికి ఒక బలమైన కారణముంది. వాడు వేరుశెనక్కాయలు ఒలుస్తూ తమిళ భాషలో చెప్పిన కథల్ని మాకు అర్థమయ్యేట్టుగా తెలుగులో చెప్పేది మా అమ్మ. ఆ కథల్లో రాజ కుమారులు, రాజ కుమార్తెలు, నక్కలు, తోడేళ్లు, శవాన్ని పూడ్చిన గుంతలో నుంచి ఆ శవం పాట రూపంలో ఆవేదనను వ్యక్తం చేయడం మొదలైన వాటితో కూడుకొని వినడానికి చాలా ఆసక్తిగా వుండేవి. 

పాటలు మాత్రం మా అమ్మ తమిళంలోనే పాడి విన్పించేది.మావూరు తమిళనాడు బార్డర్‌లో వుండడం వల్ల అక్కడి వాళ్లందరికి తెలుగు, తమిళం రెండు భాషలూ వస్తాయి. ఇంట్లో పెద్దవాళ్లందరూ తమిళంలోనే మాట్లాడుకొనేవాళ్లు. ఎందుకలా చేసేవాళ్లో ఇప్పటికీ అంతు పట్టదు.ఇంకో చిత్రమేమిటంటే మా వూరిని, మాలపల్లిని వే రు చేస్తూ తారు రోడ్డుండేది. మాలపల్లి వాళ్లు మా పొలాల్లో కూలినాలి చేసేవాళ్ళు. వాళ్ళు ఆంధ్రాలో వున్నా తమిళమే మాట్లాడేవాళ్లు. కానీ పనిపాటలకు వచ్చినప్పుడు మా వూరి పిల్లలతో మాట్లాడాల్సివస్తే వాళ్లు తెలుగులో మాట్లాడే వాళ్లు. మా పిల్లలందరం వాళ్లతో అరవంలోనే మాట్లాడేవాళ్లం.వాళ్లు తెలుగు మాట్లాడినా, పిల్లలం అరవంలో మాట్లాడినా చాలా కృత్రిమంగా అనిపించేది. అయినా అందులో మార్పు మాత్రం వుండేది కాదు.ఒకరోజు నేను, మా అక్క స్కూలు నుంచి ఇంటికి వచ్చేసరికి పశువుల కొట్టంలో ఆవుల్ని కట్టేస్తూ ఒక కొత్త వ్యక్తి కనిపించాడు.సాధారణంగా మావూరికి ముళబాగల్‌, పుంగనూరు, నెల్లిపట్ల మొదలైన వూర్ల నుంచి ఇంట్లో చెప్పాపెట్టకుండా అలిగి వచ్చే వాళ్ల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. అలా వచ్చిన వాళ్లు రోడ్డులో చింత చెట్ల క్రింద వున్న బండ మీద కూర్చున్న మా వూరి వాళ్లతో మాటలు కలిపి ఏమైనా పని ఇప్పించమని అడగడం, వాళ్లు మా యిల్లు చూపడం, అలా వచ్చినవాళ్లు మా యింట్లో పనికి కుదరడం మామూలే. కుప్పడు కూడా ఒకప్పుడు అలా వచ్చినవాడే.