ఇంగ రెండు జాములకి పొద్దు మొలిస్తింది’’ అనింది నగిరింటి దీపం.‘‘ఇంగొక్క జాము ఎదురుచూసి గోపినింటిదాని మింద ఆశ వదులుకోవాల్సిందే!’’ అనింది పెద్దింటి దీపం.‘‘ఇంగా... ఒగ జాము ఎదురుచూడాల్నా?’’ అనింది మూతి అదోరకంగా పెట్టి చిలకముక్కు దీపం.‘‘రాత్తిరంతా ఎదురుచూసినదానివి ఇంగొక్క జాము ఎదురు చూడలేవా?’ ఆలోపు ఒక కత చెప్తాను. ఆఖరి కత’’ అనింది పెద్దింటి దీపం.

కొత్తచెరువు కింద వరిమళ్ళు కోతకొచ్చినాయి. ఈపొద్దో రేపో కట్టమింద దేవర చేసి కోతలు మొదలెట్టాలి.గొర్రెలతాత మంచంమింద కుర్చోని బీడీ తాగతా వుంటే వచ్చినాడు కొత్తచెరువుకింద నీళ్ళు పారగట్టే మాదిగ కొండన్న.‘‘ఏమిరా ఇట్లా వచ్చినావు?’’ అని చెప్పి నడుముకి చుట్టుకున్న సింగితం తీసి బీడీ ఒకటి ఇచ్చినాడు. దోసిలిపట్టి బీడీ తీసుకున్నాడు కొండన్న.‘‘కట్టమింద దేవర చెయ్యల్లగదా!’’ అన్నేడు బీడీ ముట్టించి.‘‘అందరి దగ్గిర దుడ్లు వసూలుచెయ్యి. చేద్దాము’’ అన్నేడు గొర్రెలతాత.‘‘మీతో ఒగమాట చెప్పి వసూలికి పోదామని వస్తి’’ అన్నేడు.ఆ మాటతో పక్క జేబిలోనుంచి నూట పదహార్లు తీసి ఇచ్చినాడు.దోసిలిపట్టి తీసుకోని పైకిలేసినాడు కొండన్న.‘‘ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయడం ఏమనగా? సుక్కురారం కొత్తచెరువు కట్టమింద దేవర చేస్తా వుండారు. రైతులందరు రావాలి. రైతుల్ని నమ్ముకోని వుండే కుమ్మరి, మంగలి, చాకలి, మాలమాదిగలంతా రావాలి’’ అని చెప్పి బుదారం సంతలో వీరతిమ్ముగోడు ‘డంటనకడంటనక’ అని పలక కొడతా దండోర వేసినాడు.

సుక్కురారం కంటే ముందే పొయ్యి, కట్టె కంపా కొట్టి దావచేసి కట్టమింద దేవర చేసుకునే దానికి వీలుగా అరువు చేసివచ్చినారు రాజన్న, వెంగట్రవణ చిన్నాయన, సక్కు పిన్నమ్మ, రామాంజుల వదిన పొయ్యి పేన్నీళ్ళు చల్లి, పేడతో అలికి, ఎర్రమన్నుతో పట్టీలు తీసి, ముగ్గులేసి వచ్చినారు.సుక్కురారం పొద్దున్నే రెడ్డోరిపల్లె నుంచి చాకలి వెంకటప్పన్న, చిన్నక్క వచ్చినారు. కుమ్మరి వేమసిద్దు కొత్తకుండల్ని పట్టుకోని వచ్చినాడు.పరవాణ్ణం వండడానికి కావలసిన పప, బియ్యం, బెల్లం ఇచ్చింది కల్లేణమ్మ. కట్టమిందకు పొయ్యి కొత్తకుండలు కడిగి పసుపు కుంకాలు పెట్టి, మూడురాళ్ళు పెట్టి పొయ్యి వెలిగించింది చిన్నక్క.