ప్రతిసారి తప్పించుకొని వెళ్ళే జింక విషయం అతనికి మింగుడు పడ లేదు. చివరికి ఒక నిర్ణయానికొచ్చాడు. ఆ నిర్ణయం వెనుక తన భార్యా పిల్లల ఆకలి ఉంది. పాపం! పద్నాలుగేళ్ళకే తల్లైన భార్య ఆకలిని, పసి బిడ్డను ఎంతకాలం భరిస్తుంది? సంసారాన్ని ఎంతకాలం సహిస్తుంది?పోలిగాడు అతన్ని గమనిస్తున్నాడు. వట్టిచేతుల్తో వెళ్తే తప్పకుండా చేతగానివాడంటారు. వాడలో కుక్కపిల్ల కూడా అతని ముఖం చూడదు. ముసలినక్కలు ఉండనే ఉన్నాయి. వారు ప్రాయంలో ఉన్నప్పుడు విరగ బొడిసిన బాగోతాన్ని పాడి వినిపిస్తారు.రంగా గాని అత్తగారికి మాగాణి మూలుగుతోంది. వాడు భార్యను తంతే డబ్బు రాలుతుంది. కల్లు తాగుతాడు. సారాయి ఊట వేస్తాడు. వాడికి పండుగ బాగా జరిగింది.పొదల్లో అలికిడి అతని ఆలోచనలకు అడ్డుకట్టవేసింది. గలగలా పారే సెలయేటి గట్టుమీద ఉనికిలో పొంచి ఉన్నాడతను. ఆవలి ఒడ్డు బాగా కనిపిస్తుంది. తుపాకి సూటిగా గురిపెట్టాడు. ఈరోజు దాని ఆయువు మూడినట్లే. శబ్దం వచ్చినవైపు కళ్ళు చిట్లించి చూశాడు. ఎండుటాకుల మీద ఎలుకను మింగుతోన్న పాము కదల్లేక కదులుతోంది. తుపాకి దించాడు. పొద్దు నడిమింటి నుంచి పడమరకు వాలుతూ ఉంది.నాలుక పిడచగట్టుకపోతోంది. ఉనికిలో నుంచి బయటకొచ్చాడు.
పాము ఇంకా పాకుతూనే ఉంది. అతన్ని చూసి మరింత జోరుగా పాకడానికి ప్రయత్నిస్తోంది. తిని నడవలేని పాములాంటి వాళ్ళని చూస్తే అతనికి చిరాకేస్తుంది. సెలయేటి గట్టున కూర్చొని వంగి నీళ్ళు తాగడానికి చేతులు ముందుకు చూపాడు. సవ్వడైంది. తలెత్తాడు. జింక అవతలిగట్టున నీళ్ళు తాగుతోంది. అతను నీళ్ళు తాగడం వాయిదా వేసుకొని మెల్లగా ఉనికి లోకి జారుకొన్నాడు. తుపాకి చేతిలోకి తీసుకొన్నాడు. తిరిగి చూశాడు. ఇంకెక్కడి జింక? పాము ఇంకా పాకుతూనే ఉంది.‘‘ఈ పూటకిక జింక రాదు’’ అతనికి తలతిరుగుతోంది. తలగోక్కుంటూ వెళ్ళి నీళ్ళు తాగాడు. తుపాకి భుజాన వేసుకొని ఇంటికి తిరుగు ముఖం పట్టాడు.దార్లో పోలిగాడు ఎదురయ్యాడు. చేతులు ఖాళీగా ఉండటం చూసి నవ్వాడు. అతను అదేం పట్టించుకోలేదు. పొద్దుగుంకింది. ఇల్లు చేరాడు.పెళ్ళాం ఎదురురాలేదు. తుపాకి తీసుకెళ్ళలేదు. మంచినీళ్ళివ్వలేదు. అతని నొసలు ముడిబడ్డాయి. తుపాకి పంచమీద పెట్టి కాళ్ళు, మొకం కడుక్కొచ్చాడు. గుడిసె తడికె వారగా వేసి ఉంది. అలికిడి కాలేదు. ఆకలిగా ఉంది. తడిక మెల్లగా నెట్టి లోపలికెళ్ళాడు.ఆమె, బిడ్డ పడుకొని ఉన్నారు. వేళగాని వేళ నిద్రేంటని అతనికి కోప మొచ్చింది. అనుమానం వచ్చింది. ఉట్టిమీద వట్టి సట్టి వ్రేలాడుతోంది. ఆమె కట్టుబట్ట కొంచెం తొలగింది. చూర్లో ఎలుక తొంగి చూస్తోంది.