1991 - మార్గశిరమాసంలో ఒకరోజు - ఉదయం పూట పొద్దెక్కేవేళ -ఈ సంగతి జరిగి ఉండకపోతే - కేశవమూర్తి గురించి, ఎవడైతే మీకెందుకు?ఆ రోజు కేశవమూర్తి రోజువారీ పనులు చేసేక్రమంలో వీధి వాకిట్లో పూల మొక్కలకి రబ్బరు గొట్టంతో నీళ్లు పెడుతున్నాడు.‘‘అయ్యా, అందమైన ముగ్గున్న మీ వీధి వాకిలి, తెలుగుపద్యం లాగ ఉంది’’ అనే మాట వినిపించింది. కేశవమూర్తి గేటువైపు చూశాడు. ఎవరో అపరిచితవ్యక్తి లోపలికి వస్తున్నాడు. వాలకం చూస్తే, పండితుడి లాగ ఉన్నాడు. అరవై ఏళ్లుండవచ్చు. పంచెమీద బంగారు రంగు నలిగిన సిల్కి లాల్చీ, ఆకుపచ్చ రంగు శాలువా.....చేతిలో ఉన్న రబ్బరు గొట్టం, కింద పడేసి, నీళ్ల పంపుకట్టేసి - అరుగు మెట్టుదగ్గర ఆ వచ్చే వ్యక్తిని పలకరించడానికి నించున్నాడు.‘‘తమరేనా కేశవమూర్తి గారు?’’ అన్నాడా అపరిచితుడు చేతులు జోడిస్తూ-‘‘నేనే - తమరు?’’‘‘పద్యం చిత్తగించండి’’-కేశవమూర్తి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే:కేశవమూర్తికి పద్య కవిత్వం అంటే యిష్టం. ఒఠ్ఠినే ఇష్టం కాదు. తెలుగు మేష్టారు రామలింగశాస్త్రి గారి ధర్మవాఁ అని - పద్యంలో ఉంటేనే కవిత్వం, అని - కడుపిన్న వయస్సు నుంచి నమ్మి కావ్యాలూ, శతకాలూ, చాటువులూ తెగ చదివేశాడు.

 ఉద్యోగం బ్యాంకి ఆఫీసరు గిరీ అయినా, మంచికో చెడ్డకో సాహిత్యవ్యసనంలో పడ్డవాడు.అవధానాలకీ, భువన విజయాలకీ, పరవశించి తప్పట్లు కొట్టినవాడే-కాని, ఏం జ్ఞానోదయం అయిందో యేమో, కవి అంటే చాలు దరిమిలా అనుమానంగా చూస్తున్నాడు-అపరిచిత వ్యక్తి పద్యం అందుకున్నాడు. సంగీత వరస కూడానూ-కళల పాలిట మీరొక కల్పవృక్షమనుచువింటిని; నేడింక మనసుదీరదర్మనమ్మునుజేసుక ధన్యుడైతి!తమకు తోచిన చందానుదయనొసగుడు!కేశవమూర్తికి విషయం అర్థమైంది.‘‘ఒక్క నిమిషం. అలా కూర్చోండి. హఠాత్తుగా పద్యాలు వింటే నాకు గాభరాగా ఉంటోందీ మధ్య. చెప్పండి - మీరు వచ్చిన పని...’’‘‘అట్లు నిలదీసి అడిగిన ఆగలేను!’’‘‘అలా పద్యపాదాలతో సంభాషణ వద్దు. వచనంలో మాట్లాడు కుందాం-’’అపరిచితుడు కాస్త సర్దుకు కూర్చుని, భుజానికి వేళ్లాడే సంచిని ఒళ్లోకి తీసుకుని సంభాషణ మొదలు పెట్టాడు-‘‘రాజమహేంద్రవరం స్వగ్రామం; పేరు సోమసుందర శతావధాని’’.‘‘ఓహో! అవధానాలు చేస్తారన్నమాట’’