గిరి నాకంటే వయసులో చాలా చిన్నోడు.కనీసం పదిహేనేళ్ళయినా తేడా ఉంటుంది.కాని నాకున్న స్నేహితుల్లో అతనిదే అగ్రతాంబూలం. అతనికే పెద్దరికం..ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు.అవసరమైతేనే తప్ప గొంతు విప్పడు.మంచి చెడ్డలు చెప్పటంలో అతను ఏ మోమాటానికీ తావీయడు.దేనిపైనైనా అతనొక నిర్ణయానికొస్తే దాన్ని వేరెవరూ మార్చలేనంత పకడ్బందీగా ఉంటుంది అతని ఆలోచన.ఎటొచ్చీ ఒక విషయంలో మాత్రం గిరిదీ నాదీ భిన్నమైన దారి కావటం విశేషం.గుళ్ళూ గోపురాలూ నాకిష్టం.గిరికి అవేమీ పడవు.ఎన్నిసార్లడిగినా ‘‘నువ్వెళ్ళిరా’’ అంటాడు.నాలుగేళ్ళ క్రితం గజల్‌ శ్రీనివాస్‌ కచేరీలో గిరి నాకు పరిచయమయ్యాడు.వేళావిశేషమేమిటోగానీ అప్పట్నుంచీ వాడూ నేనూ పడుగు పేకల్లా అల్లుకుపోయాం. ‘‘ప్రాణం ఒకటే! శరీరాలే వేరు’’ అన్నంతగా కలిసిపోయాం.‘‘పూర్వ జన్మలో మీ ఇద్దరూ భార్యభర్తలేమో’’ అంటుంది పద్మ అప్పుడప్పుడు ఇద్దర్నీ ఉద్దేశించి సరదాగా.పద్మ గిరి భార్య.ఆమెక్కూడా అదే ప్రేమ నేనంటే..గిరికీ నాకూ స్నేహం కుదిరాక ఆమె నన్ను అన్నగారికంటే ఎక్కువగా చూచుకొంటోంది.ఇంట్లో వండే ఏ పిండివంటైనా నా నోటికి రావల్సిందే. ప్రత్యేకమైన కూర వండినప్పుడు నాకక్కడే భోజనం.నా శ్రీమతీ అంతే..వాళ్ళపట్ల తను కూడా అంత అనోన్యంగా ఉంటుంది.ఓ రోజు-అప్పుడే ఊర్నుంచి వచ్చి గిరింటికి వెళ్ళాను.వరండాలో ఎవరో నలుగురు అతిథులొచ్చి కూర్చున్నారు.గిరి అక్కడ కనిపించలేదు.లోపలికి వెళ్ళాను.పద్మ పొయ్యి దగ్గర నిలబడి ఏదో వండుతోంది.గిరి అక్కడే క్రింద కూర్చుని వంకాయల్ని నాలుగు భాగాలుగా చీలుస్తూ వాటిలో ఏదో కూరుతున్నాడు.

నేనక్కడే నిశ్శబ్దంగా కాసేపు నిలబడ్డాను.నా రాకను వాళ్ళు గమనించలేదు.‘‘ఏమిట్రా మా చెల్లాయికి ఏదో సాయం చేస్తున్నట్టుగా ప్రదర్శనలిస్తున్నావ్‌...’’ వాళ్ళ పాక యజ్ఞాన్ని భంగం చేస్తూ అన్నాను.‘‘సమయానికి వచ్చావురా...గుత్తొంకాయ కూర’’ ముఖం ఇంత చేసికొని నవ్వుతూ అన్నాడు గిరి.‘‘అన్నయ్యగారూ..మీకు ఇక్కడే భోజనం...వదినగారొచ్చారా మీతోపాటు...’’ అంటూ పద్మ నా వేపు తిరిగి నవ్వుతూ అంది.‘‘లేదమ్మా...రేపొస్తుంది...’’‘‘బంధువులొచ్చార్రా బాపట్ల నుంచి...’’ అంటూ కొబ్బరిచెక్కులూ, మామిడి కాయలు దగ్గరకు తీసుకున్నాడు గిరి.సెల్‌ మ్రోగటంతో నేను పక్కకెళ్ళాను.పది నిమిషాలు దానితో సరిపోయింది. మాట్లాడి గిరి దగ్గరకొచ్చాను.గిరి రోటి పచ్చడి చేస్తూ కనిపించాడు.‘‘అదేమిట్రా...’’‘‘మిక్సీలో అయితే రుచిగా ఉండదని రోటి పచ్చడి చేస్తున్నాన్రా...అయిపోయింది...ఉండు...వాళ్ళను నీకు పరిచయం చేస్తాను...’’ అన్నాడు గిరి.