ఇద్దరూ పక్కపక్కనే ఉన్న సీట్లలో కూర్చున్నారు. అతని ఎడమ చేతిని తన కుడి చేతిలోకి తీసుకుందామె.యాభై సంవత్సరాల స్నేహం, అనురాగం, అనుబంధం, సుఖదుఃఖాల్లో తోడుగా చేసిన ప్రయాణం. మరో గంటలో జీవితం కొత్త మలుపు తిరగబోతోంది. ఎప్పుడూ ఊహించని మార్పు రాబోతోంది. ఒక విధంగా ఇది ఇద్దరూ దీర్ఘంగా ఆలోచించి స్వయంగా తీసుకున్న నిర్ణయమే. మరో విధంగా చూస్తే వారికి ఇంకో మార్గం లేదు. ప్రపంచంలో ఇంతకంటే గొప్ప దేశం మరొకటి లేదని ప్రతిరోజు గుర్తుచేసే ఈ దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని వాళ్లిద్దరూ ఎప్పుడూ ఊహించలేదు.మూడు సంవత్సరాల క్రితం, 2011 మేలో స్టీవెన్‌, ఆయేషా ఇద్దరూ పదవీ విరమణ చేసారు. నిజానికి స్టీవెన్‌వాళ్ల యూనివర్సిటీలో వయసు పరిమితి ఏమీ లేదు. ఓపిక ఉన్నంతకాలం పనిచెయ్యొచ్చు. కానీ దాదాపు నలభై సంవత్సరాలపాటు ప్రొఫెసర్‌గా పనిచేసిన స్టీవెన్‌ ఇప్పుడు ఇదివరకున్నంత ఉత్సాహంగా ఉండటం లేదు.

దక్షిణాఫ్రికా చరిత్రమీద నాలుగు సంవత్సరాలుగా రాస్తున్న పుస్తకం తుది రూపానికి చేరుకుంది. పదవీ విరమణ చేసేలోగా గత రెండువందల సంవత్సరాల కెన్యా చరిత్రలో వలసవచ్చిన భారతీయుల పాత్ర గురించి మరో పరిశోధనా గ్రంథం రాయాలనే కోరిక ఉన్నా దానికి కావాల్సినంత ఓపిక ఇప్పుడు లేదనుకుంటున్నాడు. అదీ కాక ఓపిక ఉన్నంతకాలం పనిచేస్తూ ఉంటే ఇక పదవీ విరమణ చేసిన తర్వాత ప్రయాణాలు చెయ్యటానికి ఓపిక ఉండదేమోనని భయం. అప్పుడు ఊరికే ఇంట్లో కూర్చోవాల్సొస్తుందేమోనని ఆదుర్దా. ఇద్దరికీ ఇతర దేశాలూ, ప్రాంతాలూ చూడటమంటే చాలా ఇష్టం. ‘నువ్వు ఉద్యోగం విరమిస్తే నేను కూడా నీతో పాటే ఉద్యోగం మానేస్తాను’ అంది ఆయేషా. నలభై సంవత్సరాల్నించి హెన్రీఫోర్డ్‌ హాస్పిటల్లో సోషల్‌వర్కర్‌గా పనిచేస్తోందామె. చాలా కష్టమైన ఉద్యోగం. రోజూ ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక సమస్యకు పరిష్కారం వెతకాలి. స్టీవెన్‌ సరేనంటే తను కూడా ఉద్యోగ విరమణ చెయ్యటానికి తయారుగా ఉందామె. 2011 మేలో ఇద్దరూ ఒకేసారి ఉద్యోగాలు మానేసారు.