మనసులో అణుమాత్రమైనా ఖాళీ లేకుండా నిరాశ నిండిపోతుంటే డాక్టర్‌గారి రూమ్‌ లోంచి వాడిన ముఖంతో బయటకు వచ్చాను.నర్సు పిలవటంతో వెయిటర్స్‌లోంచి ఓ అమ్మాయి లేచి లోపలకు వెళుతోంది.‘‘దేవుడా...ఎంతో ఆశతో లోపలికి వెళ్తున్న ఈమెకు, పాపం నాలాంటి పరిస్థితిని ఇవ్వకు’’ అని మనసులో అనుకుంటూ మెయిన్‌ డోర్‌ వైపు కదిలాను.నడుస్తున్నానే గానీ, అడుగులు తడబడుతున్నాయి. నా చుట్టూ ఉన్నవేవీ నాకు పట్టడం లేదు. ఏదీ మనసుకి ఎక్కడం లేదు.‘‘ఏయ్‌...శిరీ...శిరీషా...’’ గట్టిగా పిలిచారెవరో.తల వంచుకుని నడుస్తున్నదాన్నల్లా ఉలిక్కిపడి చూశాను.నాకు కొంచెం దూరంలో రాణి...! రాణి నా కాలేజ్‌మేట్‌.అది నా దగ్గరకొస్తూనే, ‘‘ఏంటే అంత పరధ్యానం? ఒక్కదానివే వెళ్తున్నావేంటి? మీ వారేరీ? ఎప్పుడూ చిలకా గోరింకల్లా తిరుగుతారుగా...’’ అంటూ అటూ ఇటూ వెతుకుతున్నట్లుగా చూస్తూ అడిగింది.నేను రాని నవ్వును బలవంతాన ముఖం మీదకి తెచ్చుకుని, ‘‘ఆయన రాలేదు. చిన్న పనుండి నేనే ఇటొచ్చాను’’ అన్నాను. నేను హాస్పిటల్‌కి వెళ్ళిన విషయం మరీ ముఖ్యంగా డాక్టర్‌గారు చెప్పిన మాటలు దీనికి తెలియకూడదనే నిశ్చయంతో.‘‘నిన్ను కలిసి చాలా రోజులైంది. రా...అలా ఐస్‌క్రీం తింటూ మాట్లాడుకుందాం..’’ అంది నా చేయి పట్టుకుని లాగుతూ.

తాపీగా కూర్చుని ఐస్‌క్రీం తినే పరిస్థితా నాది...! వెళ్ళడానికి మనసొప్పక, ‘‘ఇప్పుడు తినలేనే. అర్జంటుగా ఇంటికి వెళ్ళాలి’’ అని చెప్పాను.నన్ను పై నుంచి చూస్తూ, ‘‘ఓహో...అర్థమైందిలే. డైటింగ్‌ చేస్తున్నావన్నమాట. ముప్ఫై ఐదు దాటుతున్నా పాతికేళ్ళమ్మాయిలా స్లిమ్‌గా కనిపించాలనా? ఏ...అలా లేకపోతే మీ ఆయన్ని ఎవరన్నా నాజూకమ్మాయి ఎత్తుకుపోతుందని భయమా?’’ గొంతులోంచి పలికే మాటల్ని మెలికలు తిప్పి దీర్ఘాలు తీస్తూ అడిగింది రాణి.‘‘ఏంటే...నీ సెటైర్లు..? పద వెళ్దాం..’’ అన్నాను అయిష్టంగానే. దీని డైలాగులు పడేకంటే, పార్లర్‌లో పడి దాంతో ఐస్‌క్రీం తినడమే మేలనిపించింది.ఇద్దరం దగ్గర్లోని ఐస్‌క్రీం పార్లర్‌కెళ్ళాం.‘‘ఇంతసేపైంది, మా పిల్లలెలా ఉన్నారని అడగ వేంటే...’’ దబాయింపుగా అంది రాణి.‘‘ఏదీ నువ్వు అడగనిస్తే కదా?..’’ అన్నాను.నువ్వు అడక్కపోయినా చెప్తాలే. సమ్మర్‌ హాలిడేస్‌ కదా.... పెద్దోడు అత్తగారింటికి వెళ్ళాడు. చిన్నోడు ఊళ్ళోనే అమ్మా వాళ్ళింట్లో ఉన్నాడు. వాళ్ళ పోలికలు అని వాళ్ళు పెద్దోణ్ణీ, వీళ్ళ పోలికలొచ్చాయని వీళ్ళు చిన్నోణ్ణీ నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నారు. ఒకడు బంగారం, ఒకడు వజ్రమనుకో. చెప్పినమాట, గీసిన గీత దాటరు, తెలుసా...’’ దాని మాటలు అడ్డులేని ప్రవాహంలా సాగుతున్నాయి.