‘‘ఇదుగోండి చీమల మందు’’ ఇచ్చాడు కొట్టువాడు ‘‘చీమలమందు దేనికోయ్‌’’ వెనుక నుండి వచ్చిన సుందరం గొంతు గుర్తుపట్టి వెనక్కి తిరిగాడు ప్రకాశం. ‘‘ నా గదిలో గూడుకి చెద పట్టింది’’ ముక్తసరిగా చెప్పాడు ప్రకాశం.‘‘చెదలకు చీమలమందేమిటి నీ పిచ్చిగానీ. మహా ఐతే రెండురోజులు ఆపుతుంది. గోడకు కన్నాలు పెట్టి చెదలమందు కొట్టాలి అప్పుడే సమూలంగా వదిలిపోతాయి. అసలు భగవంతుడు చెదలను ఎందుకు సృష్టించాడంటావ్‌ అసలు వాటివల్ల ఏం ఉపయోగం ఉందో నాకైతే అర్ధం కాదు. ఇల్లు గుల్ల చేసిపోతాయి.’’ చెప్పుకు పోతున్నాడు సుందరం. అవకాశం ఇస్తే దేనిమీద నైనా అలా మాట్లాడుతూనే ఉంటాడు సుందరం. అందుకే ప్రకాశం అతనికి దూరంగానే ఉంటాడు. చిత్రమేమంటే సుందరం ఏ విషయం మీద ఎలా మాట్లాడినా, ప్రకాశానికి గుండేల్లో ఎక్కడో కెలికి నట్టవుతుంది. ‘అసలు భగవంతుడు తనను ఎందుకు సృష్టించాడు?’మౌనంగా ఇంటికి నడిచాడు ప్రకాశం. వీధి మొదలు నుండి చూస్తే చుట్టూ దుమ్ము, ధూళి, శబ్దాలు గోల. ప్రకాశం ఇల్లున్న వీధిని వెడల్పు చేస్తున్నారు. దానికోసం అడ్డుగా ఉన్న ఇళ్ళభాగా లను కొట్టేస్తున్నారు. చాలామంది తమంత తామే కొట్టించుకుంటున్నారు అదీ ఆ హడావుడి. 

అది అభివృద్ధికి ఒరవడి! తన ఇంటికి ఆ భయం లేదు. ఇలా జరుగుతుందని తాను ఊహించకపోయినా, ముప్పై ఏళ్ళ క్రితం ఇల్లు కట్టించినప్పుడు ఇంటి ముందు మొక్కలు పెంచుకోవాలని కాస్త జాగా వదిలి ఇల్లు కట్టుకున్నాడు అది మంచిదయ్యింది. రోడ్డు వెడల్పు చేసినా గేటు, మొక్కలకై ఉంచిన జాగా పోతుంది తప్ప ఇంటికి ఏ నష్టం రాదు.‘‘ఈ దుమ్మూ ధూళిలో ఎక్కడికెళ్ళావు నాన్నా’’ గేటు తీస్తుండగానే ప్రకాశాన్ని ప్రశ్నించాడు కొడుకు సంపత్‌. ‘‘అది... గూడు చెద పట్టిందని మొన్న చెప్పానుగా... చీమలమందు కొందామని’’. ‘‘ఈ వయస్సులో ఇవన్నీ మీకు అవసరమా? రోడ్డు అసలే బాగోలేదు. రాళ్ళు రప్పలూ! ఏ కాలో చెయ్యో విరిగితే...’’ లోపల నుండి చెంబుతో నీళ్ళు తెస్తూ అన్న కోడలి మాటలలో తను చాకిరీ చెయ్యాల్సి వస్తుంది అనే బాధ ధ్వనించింది ప్రకాశానికి. కాళ్ళు కడుక్కుని ఇంటిలోకి వచ్చాడు. ముందు చిన్న వసారా. అది దాటగానే హాలు. హాలుకు కుడివైపుకు ప్రకాశం గది... గదిలోకి వెళ్ళాడు ప్రకాశం. ఎదురుగా గూడు ఖాళీగా కనిపించింది. తన పుస్తకాలు? తను లెక్కల మాస్టారైనా తెలుగుమీద మక్కువతో అనేక గ్రంథాలు సేక రించాడు. భాగవతం తనకు నిత్య పారాయణ గ్రంథం. ఇప్పుడివన్నీ ఉండే గూడు బోసిగా కనిపించింది. అడగనా వద్దా అని తటపటా యించి, మెల్లగా సంపత్‌ని అడిగాడు.

‘‘సంపత్‌! పుస్తకాలు అన్నీ ఎక్కడ పెట్టారు?’’ ‘‘గూడు చెద పట్టిందన్నావని పుస్తకాలను అందాకా వెనుక కొట్టులో పెట్టాం’’. ‘‘పాపం! మొన్న తను చెప్పినా పట్టించుకోలేదని మీరే తొందరపడ్డారు ఈ రోజు చీమలమందు తేవడం చూసి ఎంత నొచ్చుకుని ఉంటాడో. పిచ్చి కన్న! ఏవో ఒత్తిళ్ళు ఉంటాయి. ఎప్పుడూ మీ గురించే ఆలోచించాలంటే వాడి జీవితం ఎలా గడుస్తుంది.’’ ఏడాది క్రితం వరకూ తన చెవిలో వినిపించే తన భార్య లక్ష్మి గొంతు ఇప్పుడు తన మనసులో మాత్రమే ప్రతిధ్వని స్తోంది పిచ్చి లక్ష్మి! పిల్లలంటే ఎంతప్రేమో! మెల్లిగా కొట్టులోకి వెళ్ళి పాత సామాన్ల మధ్య వెతు క్కుంటూ పుస్తకాలను పైకి తీశాడు. భాగవతం, ఆధ్యాత్మిక రామాయణం రెండు చేతులతోనీ ఎత్తు కున్నాడు తెలుగు నిఘంటువు కూడా తీద్దామని ఉన్నా అవకాశం లేక అలాగే వదిలేశాడు. అప్ప టికే దాన్ని సగం పైగా చెద తినేసింది. అతను వెళ్ళిన కొద్దిసేపట్లో ఆ గదికి తాళం పడింది.