‘‘మోహన్‌ గారూ! బయల్దేరదామా?’’ అంది చాంబర్‌ నుండి బయటికొచ్చిన బ్రాంచి మేనేజరు సునంద.‘‘ఎస్‌... మేడం’’ అని సీట్లో నుండి లేచి,ఆమెని ఫాలో అవుతున్న అసిస్టెంట్‌ మేనేజర్‌ మోహన్‌ని చూసి, మిగిలిన స్టాఫంతా జెలసీగా ఫీలయ్యారు.‘‘ఈ రోజు కారు డ్రైవర్‌ రాలేదు. నా కాలుకి దెబ్బతగిలింది. మీరే డ్రైవ్‌ చెయ్యండి’’ అందిసునంద కారు కీస్‌ మోహన్‌కి ఇస్తూ.రేబాన్‌ నల్ల కళ్ళద్దాల్లోంచి కారు వైపు, సునంద వైపు చూశాడు. కారు పాతదే అయినా, కొత్తదనం తగ్గకుండా, చిన్న స్ర్కాచ్‌ లేకుండా పర్‌ఫెక్ట్‌ కండీషన్లో ఉంది.డ్రైవింగ్‌ సీట్లో కూచుని, పక్కన కూచున్న సునందని ఆమె చూడకుండా మరోసారి చూశాడు. తెల్లగా, ఎత్తుగా... అందంగా, కొంచెం మందంగా.. అన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టుంది సునంద రూపం. ఆఫ్‌ వైట్‌ కాటన్‌ శారీ, పాచికలర్‌ బోర్డరు, మ్యాచింగ్‌ బ్లౌజు, నవ్వితే కన్పించేముత్యాల్లాంటి పలువరుస. కోటేరు ముక్కు...ప్రశాంతమైన చూపు, సుమధుర స్వరం... ఇంకేం కావాలి? ఏ వయసు మగాడికైనా.... సర్వస్వం మరచి పిచ్చెక్కిపోవడానికి... రంభ, ఊర్వశి, మేనకల అందాల్ని కలబోసి బ్రహ్మ తయారుచేసిన ఈ పసిడి బొమ్మకి అందమే దాసోహం అంటోందా? అన్పించేలా కన్పిస్తున్న సునందని భార్యగా పొందిన భాగ్యశాలి ఎవరో? ఎంత అదృష్టవంతుడో....?’’ మనసులోనే సునంద అందాల్ని ఆస్వాదిస్తూ డ్రైవ్‌ చేస్తూ... మరోసారి ఆమె స్ట్రక్చర్‌ని స్కాన్‌ చేశాయి మోహన్‌ కళ్ళు. శంఖంలాంటి మెడ, లోనెక్‌ జాకెట్‌, అక్కణ్ణుంచి కిందికి దిగకుండా బిగుతైన లోపలి అందాల్ని సైజుల్ని కొలుస్తుంటే... సడన్‌ బ్రేక్‌ వేసినట్టు... ‘‘మోహన్‌ మొన్న మీరు సజెస్ట్‌ చేసిన ప్రోగ్రాం వివరాలు ఏ.జి.ఎంకి మెయిల్‌ చేశాను. 

ఈరోజు అవసరమైతే మీరు ఆయనకి ఎక్స్‌ప్లెయిన్‌ చెయ్యాల్సి ఉంటుంది’’ అంది సునంద.బలవంతంగా చూపు మరల్చుకుని ‘‘ఓ.కే. మేడం’’ అన్నాడు.రెండు నిమిషాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం.‘‘మీ కాలికి దెబ్బెలా తగిలింది?’’ కావాలనే శబ్దం చేశాడు మోహన్‌.‘‘అదా! ఉదయం ఆఫీసుకొచ్చే హడావిడిలో కాలు గడపకి కొట్టుకుంది. కొంచెం పక్కగా కారాపండి. వేలికి బ్యాండెయిడ్‌ వేసుకుంటాను’’ అంది. కారాగింది. డాష్‌ బోర్డులో ఉన్న బ్యాండెయిడ్‌ తీసి, సీటు వెనక్కి పుష్‌చేసి, దెబ్బ తగిలిన కుడి కాలు పైకి పెట్టి, కాలి మెట్టె తీసి బ్యాండెయిడ్‌ వెయ్యాలని ప్రయత్నించింది... కానీ వీలవలేదు. అంతలో ఫోన్‌ మోగింది.‘‘ఓ.కే... తర్వాత వేసుకుంటాను. పదండి’’ అని కాలు కింద పెట్టబోయింది. అప్పటివరకూ తెల్లగా మెరిపిసోతున్న మోకాలి కింది భాగాన్ని నల్ల కళ్ళద్దాల్లోంచి చూసి మురిసిపోతున్న మోహన్‌, ‘‘నేను బ్యాండెయిడ్‌ వేస్తాను... ఇలా ఇవ్వండి’’ అన్నాడు.