హఠాత్తుగా ప్రత్యక్షమైన ఆ ఆడశాల్తీని చూస్తూనే ‘ఐరన్‌ లెగ్‌’ ఆడవేషంలో వచ్చాడేంటబ్బా? అనుకూంటూ ఫ్రీజైపోయిన కల్పనారాయిలా కళ్లూ, నోరూ పూర్తిగా తెరిచేసి... కట్రాయిలా బిగుసుకుపోయింది. వాసం బొంగులు వరహల్రావ్‌ భార్యామణి రాంబాయి ఉరఫ్‌ రంభ. ఇంకా అలాగే గడ్డకట్టుకునుండిపోతే తన పాదాల కిందున్న ఆ చదరపు గజం నేలా బరువు తట్టుకోలేక ఆ మధ్యేపడో కక్కుర్తి బిల్డర్‌ కట్టిన ఎల్లారెడ్డి గూడ అపార్ట్‌మెంట్స్‌లా పాతాళానికి పయనం కట్టేస్తుందేమోనన్న వంకతో చటుక్కున ‘లైట్లెలిగించుకుని’ డాలూ! నువ్వా?నువ్వెనా? అంటూ పరుగెత్తబోయి అమ్మో! అసాధ్యమైన ఫీట్‌ ‘మనకెందుకులే’ అనేసుకొని తాపీగా కదిలి ఆప్యాయంగా వాటేసుకోబోయి ఆపని కూడా ‘అమ్మో’గా తోచడంతో తన ‘భారీకాయాన్ని’ ‘డాలూ’ అనబడే ఆండాలు భారీ శరీరానికి అలా..అలా... తాకించింది. 

పొరపాటున ఇద్దరూ గనక కిందపడితే వచ్చే భూకంపాన్ని ముందే ఊహించేసుకుని ఔనే రంభా!నేనేనే-నీ డాలూనే...అండాలునే -అయినా-నువ్వుకూడా ఇలా నాలా? అంటూనే తన శరీరాన్ని రంభకాయానికంటించింది.‘తల్లో! నా టెంపో కిరాయిస్తే-నేబోతా’‘అమ్మా! మాతా!కబళంతల్లీ’ స్లైల్లో వినిపించిన ట్రాలీవాలా ఆర్తనాదాన్ని వింటూనే ‘ఔను స్మీ’ అనుకుంటూ జాకెట్‌లో కూరుకుపోయిన జానెడు పొడుగు మనీ పర్సును బలవంతానా పీకి ‘ఇదిగో’ అంటూ అయిదొందల నోటును అతని చేతిలో కుక్కేసింది ‘అండాలు’తల్లో! ట్రాలీట్యూబ్‌లైట్లు పేలిపోయి-డిస్క్‌లు కూడా ‘డిస్కో’ లెవల్లో వంగి పోయాయి. మరో అయిదొందలు...’అతని మాటలు పూర్తి కాకుండానే ‘హూ’ అంటూ భారీగా నిట్టూర్చి...బలంగా ఊపిరి వదిలిపెట్టింది రంభ.అంతే సుడిగాలికి కొట్టుకుపోయిన పూచిక పుల్లలా...రోడ్‌ మీదకు విసిరేయిబడ్డాడు టెంపో ట్రాలీ డ్రైవర్‌.మీకిప్పటికే ఆ సీనేంటో అర్ధమై పోయుం డాలి....ఇక పోతే పాత్రల పరిచయం...కేవలం రెండక్షరాల్ని పేరు పక్కన చెక్కించుకోవాలనే తపనతో వీర గజినీ లెవల్లో గ్రాడ్యూయేట్లయిన అపూర్వ మిత్రురాళ్ల శాల్తీలవి. అపడు ఆండాలు అనబడే అమ్మడు సన్నగా గోంగూరు కాడలా వుండేదని... రంభని పిలిపించుకునే రాంభాయి నవనవలాడే తోటకూర కాడలా వుండేదని చెప్తే నమ్మడానికి మా చెవుల్లో కాలీఫ్లవర్లేమన్నా వున్నాయేంటి? అని మాత్రం అనేయకండి.ఊరిపోయిన ప్రతి చెట్టూ చిన్నపాటి సీడ్‌ లోంచే పుడుతుందని.... ఒకే ఒక్క మనిషి ఎన్నిసార్లైనా ఆమరణ నిరాహారదీక్షలు చేయ్యొచ్చని నమ్మక తప్పని నిజాల్లా-నేటి భారీ శాల్తీలక్కూడా పూర్వాశ్రమంలో పల్చన శరీరాలే వుండేవన్న ట్రూత్‌ను ‘‘తూ...నా బొడ్డు’’ అనేయకండి. అలాంటి నాజూకు ఆకృతులున్న ఆ గుమ్మలిద్దరూ అపడే పెళ్లిళ్లు చేసేసుకొని ఒకరు భాగ్యనగరంలోనూ...మరొకరు కడపలోనూ సెటిలైపోయారు.