చదువుతున్న నవలను పరుపుమీద పడేశాను.బద్ధకంగా రెండు నిమిషాలు ఇటూ అటూ దొర్లేను.శరీరం కింద ఫోమ్ పరుపు మెత్తగా నలుగుతోంది.దిండులో కొంతసేపు ముఖం దాచుకున్నాను.వింత పరిమళం కమ్మేసింది!నేను వాడే బ్రిల్ క్రీం, ఆప్టర్ షేవ్‌లోషన్, చార్లీ స్ర్పే; ఇవికాక సమీర ముఖానికి దట్టంగా పట్టించుకునే మేక్స్ ఫేక్టర్, వాల్జడలో రాత్రి నలిగిపోయిన మల్లెపువ్వుల పరిమళం; ఇవన్నీ కలిపిన వింత సువాసన!!హాయిని గొలిపే సుగంధం!!కళ్ళు మూసుకుని రెండు నిమిషాలు అలాగే వుండిపోయాను.‘‘గుడ్‌మార్నింగ్’’చెవిలో గుసగుసలాడుతున్నట్లుగా - మెల్లగా సమీర కంఠస్వరం, నా చెవికి అతి సమీపంగా!! దిండులో నుండి ముఖం బయటకు లాగి! బద్ధకంగా కళ్లు విప్పి ఆమె వంక చూస్తూ అన్నాను.‘‘గుడ్ మార్నింగ్.. టైమెంతయింది?’’‘‘ఆరున్నర! ఈవేళ ఆదివారం కదా!... అందుకని తొందరగా లేపలేదు... ఇంకాస్సేపు రెస్టు తీసుకోండి!’’బెడ్‌మీద నా ప్రక్కలో కూర్చుంటూ, నా జుత్తులోనికి ఆమె వేళ్లు పోనిచ్చి సుతారంగా రాస్తు అంది సమీర.‘‘నేను నిద్రలేచి చాలా సేపయింది’’ ఆవలిస్తూ అన్నాను.ఆశ్చర్యంగా నావంక చూసింది సమీర.‘‘అవును... రాత్రి సగం చదువుతూ వదిలేసిన పుస్తకం ఇంతవరకూ చదివేను...’’ అన్నాను.‘‘చెప్పరేం మరి? .... కాఫీ తెస్తానుండండి... డైనింగు టేబిలు దగ్గరకు వస్తారా? ఇక్కడకు తెమ్మంటారా?’’ అంటూ అడిగింది.‘‘ఇక్కడికి తెస్తే బాగుంటుంది’’సమీర మెల్లగా లేచి, హంసలా వయ్యారంగా కదుల్తూ గదిలోంచి వెళ్ళిపోయింది.నేను మెల్లగా మంచం మీద నుండి లేచాను.నైటు బల్బు ఆర్పేశాను.గదిలో చీకటి పరుచుకుంది!కిటికీ దగ్గరకు నడిచి సుతారంగా ‘‘వెనీషియల్ బ్లైండ్స్’’కు కట్టి వున్న తాడు లాగేను.పూతరేకు మడతల్లా వున్న మడతలు తమాషాగా విచ్చుకున్నాయి.
గదిలోకి వెలుతురు చొచ్చుకుని వచ్చింది.అవతల ప్రకృతిలో అప్పుడే నీరెండ పరుచుకుంటోంది. ఇంటిచుట్టూ ఆవరణ నిండా నిండిపోయిన చెట్లు, అడవిలో మానుల్లా పెరిగి పోయాయి. వేపచెట్లు నాలుగు, వాటి మానులకు వేరు తెలియని క్రీపర్ అల్లుకుపోయింది. గేటుకు అటూఇటూ కాపలా దారుల్లా నిలబడిన అశోక వృక్షాలు!ప్రహారీగోడకు ఆనుకుని ఈ చివర నుండి ఆ చివర వరకూ దట్టంగా పరుచుకున్న బోగన్‌విల్లా పొదలు.బలిసిన గున్నమామిడి చెట్టు.ఇవన్నీ కలిసి అవతలి ఎండను కిటికీ గుండా ఇంటిలోకి రానివ్వకుండా చేస్తున్నాయి.కిటికీకి అడ్డంగా వున్న వెనీషియల్ లీవ్స్‌లో నుండి అవతలకు చూస్తే, ఆ దృశ్యం చాలా తమాషాగా కనబడుతోంది.దూరంగా కనబడే మేడమీద అమర్చిన టి.వి. ఆంటెన్నాపై ఏదోపేరు తెలియని పక్షి వాలి విలాసంగా తోక వూపుతోంది.ఆ బంగళా వెనుక బీచ్‌రోడ్!కాస్త అవతలగా అనంతంగా పరుచుకున్న సముద్రం! దిక్చక్రం దగ్గర రెండు ఓడలు మసగ్గా కన్పిస్తున్నాయి.స్టిప్ వాటర్స్‌లో మరో రెండు ఓడలు లంగరు దింపుకుని నిరీక్షిస్తున్నాయి!!!