శోభ వంటపని ముగించి మళ్ళీ కిటికీ దగ్గరకు వచ్చి నుంచుంది. మళ్ళీ అదే దృశ్యం! విశాలమైన ఇసుక మైదానం. మధ్యలో ఓ ఒంటరి చెట్టు. అదేం చెట్టో శోభకి తెలియదు. కాని అందమైన చెట్టు. చిన్నపిల్లాడిలా ముద్దొచ్చే చెట్టు. అది ఎంతగా ముద్దొచ్చేదంటే దాన్ని దగ్గరికి తీసుకోవాలనీ, ముద్దాడాలనీ శోభకి అని పించేది. ఆ చెట్టు కోసమే ఆమె ప్రతిరోజూ కిటికీలోంచి బయటికి చూస్తూ గంటల తరబడి నుంచునేది. అంతసేపూ ఆ చెట్టును తప్ప ఇంకేమీ చూసేదికాదు. దాని వేర్లు భూమాతను పెనవేసుకుని, కొమ్మలు ఆకులు గాలితో సయ్యాటలాడుతూ ఉంటే ఆ చెట్టు ప్రాణమున్న పసివాడిలా శోభను అలరిస్తుంది. ఒక్కోసారి సుడిగాలి లేచినప్పుడు ఇసుక, దుమ్ముధూళి వల్ల కొద్దిసేపు కిటికీ బయటి దృశ్యం మసకబారుతుంది. అప్పుడు కొద్దిక్షణాలు ఆ చెట్టు కనబడదు. శోభ కలవరపడుతుంది. గాలి తీవ్రత తగ్గాక మళ్ళీ చెట్టు కనబడగానే ఆమె మనసు స్థిమితపడుతుంది.ఇంటిపని చేస్తున్నప్పుడు కూడా శోభ మనసు చెట్టు మీదే ఉంటుంది. ఆమెకి కొద్దిపాటి తీరిక దొరగ్గానే మళ్ళీ కిటికీ దగ్గరకొచ్చి నుంచుంటుంది. నిజానికి భర్త జయంతీలాల్‌ ఆఫీసుకు వెళ్ళిపోయాక ఆమెకి ఇంట్లో పెద్ద పనేమీ ఉండదు. జయంతీలాల్‌ ఆఫీసు నుంచి తిరిగొచ్చినప్పుడు కూడా శోభ ఆ కిటికీ దగ్గరే నుంచుని ఉంటుంది. జయంతీలాల్‌ భార్యను ఇబ్బంది పెట్టకుండా తనే వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి బాత్రూంకి వెళ్ళి ఫ్రెష్‌ అయి వస్తాడు. బట్టలు మార్చుకుని హాల్లోకి వచ్చి సోఫాపై కూర్చుంటాడు. తన కళ్ళద్దాలను శుభ్రపరిచాక వాటిని ధరించి శోభవైపు చూస్తాడు. కిటికీ వద్ద నుంచున్న భార్య అతనికి ఎంతో అందంగా కనిపిస్తుంది. 

కిటికీలోంచి వచ్చే వెలుతురు ఆమె అందాన్ని రెట్టింపు చేస్తుంది. అలా రెప్పార్చకుండా భార్యను చూస్తూ మైమరచిపోతాడు. కిటికీ దగ్గరేకాదు. ఇంకెక్కడైనా అత నికి ఈ ప్రపంచంలో అందంగా కనపడేది ఒక్క భార్య మాత్రమే!భర్త ఇంటికి వచ్చాడని గ్రహించిన శోభ కిటికీ దగ్గరి నుంచి కదిలి గబగబా భర్త పక్కకొచ్చి కూర్చుంది. ‘‘అరే, మీరు వచ్చేశారా? నన్నెందుకు పిలవలేదు? మంచినీళ్ళు ఇమ్మంటారా?’’ అని ఆత్రంగా అడిగింది.‘‘వద్దులే. నేనే కిచెన్‌లోకి వెళ్ళి తాగొచ్చాను’’.‘‘అరెరె. మీరే వెళ్ళి తాగారా? నన్నెందుకు పిలవలేదు. ఆఫీసులో పనిచేసి బాగా అలసిపోయి ఇంటికి వస్తారు కదా. ఇక్కడ కూడా మీరే పని చేస్తే ఎలా? నేనెందుకున్నాను? ఇంట్లో అలంకరణ కోసమా?’’‘‘నిజం చెప్పావు శోభా, ఈ ఇంటికి నిజమైన అలంకారానివి నువ్వే’’ భార్యను దగ్గరికి లాక్కుంటూ అన్నాడు జయంతీలాల్‌.