తిరుపతి నుండి వచ్చిన బస్సు కంచి బస్టాండులో ఆగేటప్పటికి సరిగ్గా పదకొండు గంటలయింది.దాన్నుండి చేతి సంచితో దిగిన అరవై ఐదేళ్ళ చిదంబరం పైపంచెతో నుదుట పట్టిన చెమట తుడుచుకున్నాడు. ఎండ తక్కువగానే ఉన్నా ఉక్కపోస్తోంది. తిరుపతి నుండి కంచికి దూరం తొంభై కిలోమీటర్లు. రోడ్లు బాగుండటంతో రెండు, రెండున్నర గంటలకు మించి సమయం పట్టదు.బస్టాండు బయటకు వస్తూ అటూఇటూ చూశాడు చిదంబరం. ఇప్పుడు దమయంతిని పట్టుకోవాలి. ఎక్కడ తిరుగుతున్నదో పిచ్చిముఖం అనుకున్నాడు.భార్య పట్టుచీర కొనుక్కుంటానన్నది. అందునా దాన్ని కంచిలోనే కొని కామాక్షి అమ్మవారికి చూపించి ఇంటికి తెచ్చుకోవాలిట. తను అప్పటికీ చెప్పాడు. ‘‘చూపించి రావటం దేనికీ. తీసుకువెళ్ళి కుంకుమ పూజ చేయించి, ఆ రాత్రికి అక్కడ లాడ్జిలో ఉండి, పొద్దున్నే తలారా స్నానం చేసి కొత్తచీర కట్టుకెళ్ళి మరోసారి అమ్మవారిని దర్శించుకుంటే బాగుంటుంది గదా!’’ అని.‘‘మీదంతా ఎగతాళి!’’ అంటూ మూతి తిప్పింది భార్య.ఈ గోల ఇప్పుడు గాదు ఎప్పుడూ ఉండేదే. ఏదో వంకన ఇప్పటికి కనీసం ఓ డజను చీరలైనా కొని ఉంటుంది. 

అందుకే తను ఈసారి తాత్సారం చేస్తూ వచ్చాడు.స్నేహితుడు గోవిందం నిన్న పొద్దున్న వచ్చి ‘కొండకు వెళ్ళొద్దాం పద’ అంటే వెళ్ళాడు. దర్శనం ఆలస్యమవ్వటంతో అక్కడ వాడి స్నేహితుడుంటే రాత్రి గడిపి, పొద్దున్నే పాపవినాశనం వెళ్ళి స్నానం చేసి కిందకు వచ్చేటప్పటికి ఎనిమిదయింది. ఇంటికి వస్తే వాకిట తాళం వేసి ఉంది. దాన్ని చూస్తుంటే మొన్నరాత్రి తమ మధ్య జరిగిన పెద్ద వాదన గుర్తుకు వచ్చింది.‘‘రేపు కంచి వెళదాం. మళ్ళా వారం రోజుల్లోనే నా పుట్టిన రోజు వస్తోంది. చీరకు జాకెట్టు కుట్టించుకోవాలి. మీరు రాకపోతే నేనే వెళ్ళి వస్తాను. ఇంతోటిదానికి తోడు కావాలా ఏమిటి? మా మామయ్య అక్కడ బ్యాంకు మేనేజర్‌గా పనిచేసిన మూడు సంవత్సరాలలో నేను ఒంటరిగా ఎన్నిసార్లు వెళ్ళలేదూ? నాకు షాపులన్నీ తెలుసు! ఆయన ఇప్పుడు అక్కడ లేకపోయినా ఆయన పేరు చెబితే చాలు నాకు తగ్గించి ఇస్తారు!’’ మాటకు ముందు ఆ గ్రామఫోన్‌ రికార్డు పెట్టేస్తుంది.‘‘వస్తాను లేవే, గోల చేయబోకు!’’ అనయితే అన్నాడు కాని పొద్దున్నే గోవిందం వచ్చి కొండమీదకు వెళ్దాం అనటంతో భార్యకిచ్చిన మాటను పక్కకు పెట్టి బయల్దేరాడు. అంబాళ్‌నశ్యం పచ్చసంచీలో ఓ ధోవతి పెట్టుకుని, ‘‘కంచి రేపెళ్దాం లే!’’ అని భార్యతో ఓ మాట అనేశాడు.దమయంతి వెళుతున్న భర్తను చూస్తూ మూతి తిప్పింది వాకిటి దగ్గర నిల్చొని. దాని అర్థం అది అయ్యే పని కాదులే అనే!