సాయంత్రం అయిదప్పుడు ‘‘అమ్మా సీపుర్లు... అమ్మా సీపుర్లు’’ అని అరుస్తూ ఓ ముసలామె ఇంటిముందు ఆగింది. అరవై ఏళ్ళ ముసలమ్మ కొబ్బరి చీపుర్ల కట్ట నెత్తిమీద పెట్టుకొని ఉంది.‘‘ఎలా ఇస్తున్నావు..’’ అడిగాను.‘‘మూడు పది రూపాయలమ్మా’’ అంది.‘‘పదికి మూడా... ఎంత శ్రమపడితే మూడు చీపుర్లు తయారవుతాయి. చాలా తక్కువకే ఇస్తోంది’’ మనసులో అనుకున్నాను. ‘‘సరే మంచివి ఆరు చీపుర్లు ఇయ్యి’’ అన్నాను.గబగబా మంచివి ఆరు చీపుర్లు తీసి కిందపెట్టింది.‘‘ఎదురింటి వాళ్ళు పిలుస్తున్నారు అమ్మా! అక్కడా ఇచ్చి వస్తాను’’ అని అటు వెళ్ళింది.‘‘ఆరు రూపాయిలకి ఇవ్వు’’ అని వాళ్ళు బేరం ఆడుతున్నారు.చీపుర్లు చూడగానే నాకు ముప్ఫై ఏళ్ళ నాటి సంఘటన గుర్తుకొచ్చింది. అప్పుడు ఊర్లో నాన్నమ్మ దగ్గర ఉన్న రోజులు. అప్పుడు నాకు పదకొండేళ్ళు.‘‘నాన్నమ్మకి జొరమొచ్చింది. ఒకరోజు నేను తెల్లారి లేవగానే చెల్లి చెప్పినమాట. గబగబా నాన్నమ్మ మంచం దగ్గరకు వెళ్ళాను. మూలుగుతూ ఉంది. అమ్మ వేడి టీ చేసి ఇచ్చింది. దుప్పటి కప్పుకొని మంచం మీద కూర్చుని మూలుగుతూ టీ తాగుతూ అందర్నీ ఆకర్షించే పనిలో పడింది. పక్కింటి రాముడమ్మ ‘‘జొరమొచ్చిందా వొదినా’’ అని పలకరించింది. మూలుగుతూనే ‘‘ఊ’’ అని మాత్రమే అంది. నుదురుమీద చెయ్యిపెట్టి చూసింది. వేడివేడిగా ఇంత ఉడుకన్నం తినేసి దుప్పటి కప్పుకొని పడుకోయే... తగ్గిపోతాది’’ అని ఉచిత సలహా పారేసింది. 

అలాగే పక్కనున్న నలుగురైదుగురు పలకరించారు.నాన్నమ్మ మూలుగుతూనే అమ్మని వేడన్నం వండమని ఆర్డరేసింది. నిలబడి చూస్తున్న నాతో ‘‘ఏటే అలా సూత్తావూ...ఎల్లి పలకర్ర పట్టుకురా. మొఖం కడుక్కుంటాను. మీ అమ్మని వేడినీళ్ళు పెట్టమను’’ అని అమ్మకి వినబడేలా చెప్పింది.బయట గోలెం దగ్గర పీట వేసుకొని, నోట్లో పుల్లపెట్టి నములుతూ... దగ్గుతూ... మూలుగుతూ పావుగంట సేపు దంతావధానం కానిచ్చింది.ఇంటి ముందు నుండి పోయే ఆడా... మగా అంతా ‘‘బామ్మా.. జొరమొచ్చిందా... వొదినా వొంట్లో బాలేదా...’’ అని వగైరా వగైరా పలకరింపులు. వేడి నీళ్ళతో చక్కగా ముఖం... కాళ్ళు చేతులు కడుక్కుంది. మళ్ళా మంచం మీదే కూర్చుంది. కాసేపైనాకా అమ్మ వేడి వేడి అన్నం గిన్నెలో వేసి తెచ్చింది. అన్నంలో వార్చిన గంజి వేసుకొని, పిండొడియం నంజుకుని తినేసింది. తర్వాత దుప్పటి కప్పుకుని ముసుగెట్టి పడుకుంది. కాని, ముసుగులోనుంచి మూలుగుతూనే ఉంది. ‘‘సుశీలా... కాళ్ళు సలిపేస్తున్నాయే...’’ అంది.అమ్మ విసుక్కుంది. ఇంత చిన్నదొస్తే చాలు.. చిన్నపిల్లల కంటే అధ్వాన్నం. మూలుగుతూనే ఉంటుంది. ‘‘తెల్లారి ఇంకే పని లేదా నాకు. ఇంకా ఎవరి స్నానాలు కాలేదు. కొళాయి వచ్చేసింది. నీళ్ళు తేవాలి. ఏయ్‌ శ్యామూ! ఇట్రా మీ నాన్నమ్మ కాళ్ళంట పట్టు’’ అంది.