రామారావు పనిచేసే ఆఫీసులోనే పని చేస్తున్నాడు చలపతి. కానీ అతనితో మాట్లాడటానికి ఇష్టపడడు రామారావు. ఎప్పుడైనా చలపతి పలకరించబోతే ఏదో వంకన తప్పించుకుంటూ ఉంటాడు. దానికి కారణం... చాలామంచివాడు, ఎంతో మంచివాడు అంటూ అందరూ పొగిడే ఆ మనిషంటే రామారావుకి ఈర్ష్య... అసూయ.‘‘ఒక మనిషి మంచితనం అంచనా వేసేందుకు నువ్వు ఉపయోగించే కొలబద్ద ఏమిటి?’’ అడిగాడు తన భార్యనిఒకరోజు.‘‘బాబోయ్‌! నాకు ఏ కొలబద్దా తెలియదు... వెదురుబద్దా తెలియదు’’ దండం పెట్టింది వాణి.‘‘పోనీ... ఈ ప్రశ్నకి సమాధానం చెప్పు. ఇరుగుపొరుగు ఇళ్ళల్లో ఆడవాళ్ళు నీకు బాగా పరిచయమే కదా... అందర్లోకీ ఎవరెక్కువ మంచివాళ్ళు నీ దృష్టిలో?’’ వెంటనే మాట్లాడ లేదు వాణి... ఒక్కక్షణం ఆలోచించి చెప్పబోయింది.‘‘వీడి ప్రశ్నకి జవాబు చెప్పేదేవిటన్న నిర్లక్ష్యమా?’’ బాణంలా దూసుకొచ్చింది మాట. మనసు చివుక్కుమంది వాణికి. పెళ్ళయినప్పటి నించీ గమనిస్తూనే ఉంది ఆ విసుగు... చిరాకు... ఆ తొందరపాటు మాటలూ...‘‘అందర్లోకీ సుజాతగారూ మంచిగా అనిపిస్తారు నాకు’’.‘‘దొరికిపోయావు చూశావా? ఆవిడెక్కువ మంచిమనిషి అంటున్నావు... ఆవిడతో పాటూ మిగిలిన వాళ్ళ గుణగణాలు కూడా లెక్కలోకి తీసుకున్నావు కదా? దీనికంతటికీ నువ్వు ఉపయోగించిన ఆ కొలబద్ద ఏదో చెప్పు’’.

‘‘నాకదంతా తెలియదండీ. నిజంగా చెప్తున్నాను... ఆవిడ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎప్పుడూ మొహంలో చిరునవ్వు తొంగి చూస్తుంటుంది...’’ ఇంకొ ఏదో చెప్పబోతుంటే మధ్యలోనే కస్సుమన్నాడు.‘‘సింపుల్‌గా ఉండడమే నీ దృష్టిలో మంచితనం అన్నమాట. నేను స్టైల్‌గా ఉంటాను.... అంటే... నీ దృష్టిలో మంచి వాడిని కాదన్నమాట...’’ఉలిక్కిపడింది.‘‘ఏవిటండీ మీరు మరీను. పిడుక్కీ బియ్యానికీ ఒక్కటే మంత్రం అన్నట్టు మాట్లాడు తున్నారే?’’ ఎప్పుడో కాలం చేసిన తన పెద్ద తాతయ్య గుర్తొచ్చాడు వాణికి.కాలికివేస్తే మెడకీ, మెడకివేస్తే కాలికీ వేసేవాడు మాటల్తో.... తన తాతయ్య పోలిక ఈయనకెలా వొచ్చిందబ్బా?‘‘ఏవిటాలోచిస్తున్నావు?’’ చెప్పలేనంత చిరాకు ఆ గొంతులో.‘‘మీరు స్టైల్‌ కొడతారని... అదే... స్టైల్‌గా ఉంటారని నేనెప్పుడూ అనలేదు కదండీ...’’ ఈ జవాబుకి సంతోషిస్తాడనుకుంది.‘‘అంటే?... నేను డబ్బాగాడినని నీ ఉద్దేశ్యం కాబోలు’’.చెంపలేసుకుంది. ‘‘అలా అని కాదండీ... నేనలా అనలేదు..’’చటుక్కున లేచి విసవిసా బయటికి వెళ్ళిపోయాడు. తెల్లబోయింది వాణి.్‌్‌్‌మెకానిక్‌ కుర్రాడు తన స్కూటర్‌ రిపేర్‌ చేస్తుంటే అక్కడే నిలబడ్డాడు రామారావు. అటు వైపుగా వెళ్తున్న ఒక పెద్దాయన ఆగి నిలబడి కుర్రాడిని పలకరించి యోగక్షేమాలడిగి నవ్వుతూ చెయ్యి ఊపి వెళ్ళాడు.వెళ్తున్న ఆయన వంకే చూస్తూ ‘‘చాలా మంచాయన’’ అంటున్న ఆ కుర్రాడి మొహంలో ఖచ్చితమైన అభిప్రాయం కనపడింది రామారావుకి.చటుక్కున అక్కడున్న స్టూల్‌ లాక్కుని కూచున్నాడు.‘‘ఆయన మంచివాడని ఎలా చెప్పగలుగుతున్నావు?’’