తటక్కున తెలివయింది లావణ్యకు. టైం ఏడు దాటుతూంది. గబగబా లేచింది. ఛీ... దరిద్రపు నిద్ర. ఎంత పడుకున్నా సరిపోదు. తనని ఎంత తిట్టుకున్నా తక్కువేననిపించింది లావణ్యకు.పాడు వెంట్రుకలు. దగ్గరకొచ్చి చావయి. మంత్రాల చింతక్కలా వున్న జుట్టును బరబరా ముడి వేసింది. పక్కనే వాళ్ళాయన ప్రకాశ్‌ ఏడయినా అదేదో రాత్రి రెండు గంటల మాదిరి గుర్రుపెడుతుంటే చల్లటి నీళ్ళు గుమ్మరించాలనిపించింది.ఇక పిల్లలను ఒక్కక్షణం చూసింది. మగ పిల్లలు దున్నపోతులు కొట్లాడుకుంటున్నట్టు ఇద్దరు ఒకరి మీద ఒకరు కసిగా కాళ్ళు పారేసుకుని కప్పిన దుప్పట్లను కింద పడేసి అరవీర భయంకరంగా పడుకున్నారు. నిజమే వచ్చేసరికి రాత్రి అయింది. కాని పిల్లలు స్కూల్‌కు తప్పకుండా వెళ్లాలి.భర్త ఆఫీసుకూ వెళ్ళాలి.‘‘ఇక లేస్తారా’’ ప్రకాశ్‌ చెవులు చిల్లులు పడేలా ఒక్క కేక వేసింది.‘‘బంటీ, చిన్నా లేవండిరా’’.పిలిచిన వాళ్ళందరు ఫోజులు మార్చి పడుకున్నారే గాని కళ్ళు తెరిస్తే ఒట్టు.‘‘ఏవండీ మిమ్మల్నే. మీరు లేసి కాస్త వాళ్ళను లేపుతారా’’.బ్రష్‌ మీద పేస్టు పెట్టుకుంటూ మళ్ళీ పిలిచింది.‘‘ఊ’’ అంటూ లేచే ప్రయత్నంలో వున్నాడు.లావణ్య లేపితే ఎప్పుడూ ఆ పిల్లలు నిద్ర లేచింది లేదు. అదేంటో గాని లావణ్య అలా రోజు నిద్ర లేపుతూనే వుంటుంది వాళ్ళు నిద్ర లేవరని తెలిసికూడా. ప్రకాశ్‌ ఒక్కమాట అనగానే దిగ్గున లేచి కూర్చుంటారు అదేమోగాని.

‘‘ఒరేయ్‌ దయ్యాల్లారా నేను లేపితే ఎందుకు లేవరు. డాడీ లేపితే చటుక్కున లేస్తారేమిట్రా’’ అంటే.‘‘మమ్మీ నీ అరుపులు ఎక్కువ. కొడితే అస్సలు తాకదు. డాడీ అరవడు ఒక్కటే చుర్రుమనేలా ఇస్తాడుగా’’ అన్న వాళ్ళ విశ్లేషణకు లావణ్య నోరు తెరిచింది.యుద్ధప్రాతిపదికన అన్ని పనులు అయ్యాయనిపించింది. భర్తను ఆఫీసుకు, పిల్లలను స్కూల్‌కు పంపి, ఓ గంటలో ఇల్లంతా సర్దింది. దసరా సెలవులకని గోదావరిఖని వెళ్ళి హైదరాబాద్‌కు నిన్న అర్ధ రాత్రి దాటాక వచ్చారు. వారం రోజుల దుమ్ము దులిపింది.ఇంట్లో పిల్లలు వున్నప్పుడు ఇల్లు దులపడం, కడగడం, తుడవడం కుదరదని వాళ్ళు వెళ్ళగానే పనులను ముందేసుకుంది. ఓ కప్‌ చిక్కటి టీని చేసుకుని పేపరు తెరిచింది. రెండవ పేజీలో....సగం తాగిన కప్‌ని నిద్రలో వున్న దానిలా పక్కన పెట్టింది.మళ్ళీ ఒక్కసారి చదివింది.మరొక్కసారీ...అవును ఆ అమ్మాయి... ఆ అమ్మాయ్‌... డౌట్‌ లేదు ఖచ్చితంగా... లావణ్య గుండె దడదడమని కొట్టుకోవడం, క్షణంలో మానేయడం... నిన్నటి ప్రయాణం గుర్తుకొచ్చింది.్‌్‌్‌గోదావరిఖని నుండి హైదరాబాద్‌కు బయలుదేరిన బస్‌ రాత్రి తొమ్మిది గంటలకు కరీంనగర్‌ చేరింది. దసరా సెలవులు అయిపోయి మళ్ళీ ఆఫీసులు, స్కూళ్ళు ప్రారంభం కావడంతో బస్టాండ్‌ క్రిక్కిరిసి జనంతో నిండిపోయింది. బస్‌ ఆగగానే బస్‌లోకి వరద నీరు వచ్చినట్టు ఎక్కుతున్నారు. కనీసం దిగేవాళ్ళను తిన్నగా దిగనీయడం లేదు. రష్‌... రష్‌...