సాయంత్రం ఆరుగంటలయినా మిట్టమధ్యాహ్నపు వడగాలులు ఇంకా వీస్తూనే ఉన్నాయి. బీటలు వారిన నేల దాహార్తితో చినుకుల కోసం ఎదురుచూస్తోంది. కనుచూపుమేరలో అక్కడక్కడ తుమ్మమొక్కలు కనిపిస్తున్నాయి తప్పించి పచ్చదనం ఎక్కడా కనపడటం లేదు. అడపాదడపా పడే వర్షం కూడా ఆ మొక్కలకోసమేనన్నట్లు కాస్తనీటిని చిలకరించి వెళ్ళిపోతోంది. నాలుగు సంవత్సరాల నుంచీ ఇదేవరుస. కరువు-క్షామం అంటే ఆ ఊరి ప్రజలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో!పొలం గట్టుమీద కూర్చొని ఉన్నాడు శివయ్య. దిగాలుగా ఉన్నాడు. మనసంతా భారంగా ఉంది. నలువైపులా దిక్కులు చూస్తున్నాడు. తన చిన్నప్పుడు తండ్రితో కలిసి వచ్చినప్పుడు పొలం ఎలా ఉండేదో తలచుకుంటూ ఉంటే బాధగా ఉంది. దూరంగా కొండచిలువ పాకుతూ వెళుతోంది. అదిచూసి అడవిలో తిండి లేకా? తిన్నది సరిపోక ఊరి మీద పడుతోందా? అనిపించింది. తను మాత్రం తినడానికి ఉన్నా లేకపోయినా ఊరు వదిలి వెళ్ళలేని పరిస్థితి అనుకున్నాడు.

ఉదయం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. రోజూలానే ఉదయాన్నే పొలం గట్టుమీద కూర్చున్నాడు. కరణంగారి పాలేరు వచ్చి ‘‘అయ్యగారు రమ్మన్నారు’’ అని చెప్పాడు. అతనితో కూడా కరణంగారి ఇంటికి వెళ్ళాడు. అరుగుమీద కరణంతో పాటు పెద్దమనిషి కూర్చొని ఉన్నాడు. దగ్గరకు వెళ్ళగానే ‘‘శివయ్య! ఈయన కొత్తగా వచ్చిన బ్యాంక్‌ మేనేజరు. ఋణాలు వసూలు చేసుకోవడానికి వచ్చారు. నువ్వు ఋణం తీసుకొని సుమారు నాలుగు సంవత్సరాలయింది. ఇంతవరకు వడ్డీ కూడా కట్టలేదు’’ అన్నాడు కరణం.‘‘నిజమే బాబయ్య! పరిస్థితులన్నీ మీకు తెలుసు. కనీసం తిండి గింజలకే కష్టమయిపోతోంది’’ అన్నాడు శివయ్య.‘‘అది మన బాధ. ఆయనది ఉద్యోగ ధర్మం. ఎంతో కొంత కడితే మరికొంత కాలం ఆయన్ని బ్రతిమాలి నోటీసు రాకుండా చెయ్యవచ్చు. ఈలోపులో అదృష్టం బాగుంటే వర్షాలు పడతాయేమో చూద్దాం’.‘‘సరే బాబయ్య! ఏదో ఒక ప్రయత్నం చేస్తా’’ అంటూ వెనుదిరిగాడు. అదే ఆలోచనతో ఇంటికి వచ్చాడు. గంజి కూడా తాగబుద్ధి కాలేదు. అలానే నేలమీద వాలాడు. అర్ధరాత్రవుతున్నా నిద్రపట్టటం లేదు. పదేపదే మెలకువ వస్తోంది. తన నిర్ణయం సబబా! కాదా! అనే మీమాంసలో ఉన్నాడు. పుట్టినప్పట్నించి తన ఎదురుగా పెరిగినవి. పిల్లలులేని తనకు పిల్లలు అవే అనుకుంటూ మూపురం మీద చెయ్యివేసి రాస్తున్నాడు. శివయ్య చెయ్యి ఒంటిమీద పడగానే తల్లిస్పర్శలా భావన కలిగి కళ్ళుతెరిచి శివయ్య వైపు చూస్తున్నాయి ఆ ఎద్దులు. ఆ కళ్ళల్లో తమ యజమాని మీద ప్రేమ, నమ్మకం ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఆ రెండు ఎడ్లలో ఏ ఒక్కదాన్నీ దూరం చేసుకోవడానికి మనస్సు ఒప్పటం లేదు శివయ్యకి. కానీ తప్పదు. గుండెను ఎంత రాయిలా చేసుకుందామన్నా గుండెలో అలజడి, చిన్నతడి. భార్యవైపు చూశాడు. వెల్లకిలా పడుకొని ఇంటి పైకప్పులోనుంచి అక్కడక్కడ కనపడే ఆకాశం చూస్తోంది. ‘‘నిద్రరావటం లేదా!’’ అడిగాడు.