‘భూమిని అమ్ముకోవడమంటే తల్లిని అమ్ముకోవడమేనా? నేలను నమ్ము కోవడమంటే అమ్మను నమ్ముకోవడమేనా? ఏమో మరి!’‘రెండు మూడేండ్ల నుంచీ తానొక నిర్ణయానికొచ్చినప్పుడంతా ఈ సెంటిమెంటుతో నాయన తన నోరు మూయిస్తావుండాడు. నమ్ముకున్న నేల వల్ల బతుకుబరువు కావడం తప్ప యేమి బాగుపడినట్లు? భవిష్యత్తులో రైతేరాజు కావచ్చునేమో గానీ మధ్యకాలంలో భూమిని వొదిలించుకున్నోడే రాజులాగా కనిపిస్తావుండాడు. మొన్నటి దాకా భూముల్ని డుడ్లకిస్తామన్నా కొనేనాథేడు కనిపించేవాడు కాదు. అట్లాంటిది రాంషా కంపెనీ పుణ్యమా అని తమ ప్రాంత భూములకు మంచి డిమాండే వొచ్చింది. మొదటనే రాంషా తమ పొలాన్ని కొంటామని తమ వూరి సర్పంచ్‌ నాగిరెడ్డితో అడిగించినాడు. అతని తరపున ఎమ్మెల్యే రామిరెడ్డి నాయనమీద చాలా వొత్తిడి తెచ్చినాడు. ఇంకా చాలామంది తమ భూమిని కొనల్లని అప్పట్నుంచీ రకరకాలుగా ప్రయత్నం చేస్తానే వుండారు. కానీ నాయనా ‘గిమగిమా’ అంటే వొప్పుకోవడం లేదు. అమ్మ కూడా నాయన మాటలకు తాళం వేస్తావుంది. సరోజేమో తన ఆలోచనను కాదననూ లేక అత్తామామల్ని నొప్పించనూ లేక సతమత మవుతావుంది. ఏమి చెయ్యల్లనోయేమో!గట్టిగా ఆలోచిస్తూ తోట దగ్గరికి చేరుకున్నాడు సుబ్బిరెడ్డి. టమోటా చెట్లకు నీళ్లు కడుతున్న జీతగాడు పుల్లన్న, సుబ్బిరెడ్డిని చూసి దగ్గరి కొచ్చినాడు. అంతలోనే కరెంటుపోయింది. దగ్గరికొచ్చిన పుల్లన్న, మాటి మాటికీపోతూ వొస్తూ వున్న కరెంటుతో చాలా ఇబ్బందిగా వుందని, త్రీ ఫేస్‌ కరెంటు రావడం లేదని, దాంతో మోటారు సరిగా ఆడడం లేదని ‘యెడగాలవ’ పడతా కాలువ ముందుకు సాగడం లేదని అంబలి పొద్దునుంచీ ఇగ్గులాడినా అర్దెకరా టమోటా కూడా తడి పారలేదని యాష్టపడుతూ చెప్పినాడు.

సుబ్బిరెడ్డి కరెంటు మోటారు రూము దగ్గరికెళ్ళి చూసినాడు. బోర్డుమీద లైటు, గుడ్డిదీపం మాదిరి డిమ్‌గా వెలుగుతూ వుంది. మోటార్‌స్విచ్‌ ఆన్‌ చేసినాడు. ఊహూఁ మోటారు ఆడలేదు. మోటారు మీద చెయ్యిపెట్టి చూసినాడు. చాలా హీట్‌గా వుంది.కరెంటు వీకయినప్పుడు స్టార్టర్‌ పడిపోకుంటే మోటారు కాలిపోయేదే! అంతకుముందు పాత స్టార్టర్‌ పడిపోకపోవడం వల్ల కరెంటు వీక్‌గా వొచ్చినప్పుడంతా మోటారు కాలిపోతుండేది. కాలిపోయిన మోటారు తీసుకొని పోయి వైరింగు చేయించడానికి డిమాండును బట్టి రెండు వేల వరకూ ఖర్చయ్యేది. ప్రాణం నలిగిపొయ్యేది. డబ్బులు పోవడం వొక నష్టమయితే, వైరింగు చేసే వాని కనికరం పొందడానికి విసుగొచ్చేది. వాన్ని బ్రతిమాలి వైరింగ్‌ వేయించుకొని వచ్చి మోటారు బిగించే సరికి పెట్టిన పైర్లన్నీ తడిలేక వాడి పొయ్యేవి. వాడిపోయిన పంటకంతా తడి బెట్టడానికి దేవుడు కనిపించేవాడు. అందుకే మంచి కంపెనీకి చెందిన స్టార్టర్‌ తెచ్చి బిగించినాడు తను. కొత్త స్టార్టర్‌ బిగించినప్పటి నుంచీ మోటరయితే కాలిపోవడం లేదుగానీ కరెంటు సరిగా లోడురాక మోటారు ఆడడం లేదు. ఈ డీ.పీ. కిందున్న మోటర్ల కథలన్నీ ఇంతే. ఎప్పుడో వో కాలంలో వేసిన డి.పీ పాతదై బాగా ఇబ్బంది పెడతావుంది.