నీళ్ళల్లో ఆట్లాడుకుని చిలకముక్కు దీపం పైకి లేసింది. నడుము ఊపుకుంటా గుళ్ళోకి వచ్చింది. దాని వెలుతురు గూడా ఊపుకుంటా మెట్లెక్కింది.మిన్నూమన్నూ ఏకమయ్యేట్టు వాన కురస్తానే వుండాది.‘‘ఆకాశం తూట్లు పడినట్టు ఏం వాన కురస్తా వుండాది తల్లీ!’’ అనింది పొరుగింటి దీపం.‘‘చెరువులు నిండే వాన! దొరువులు నిండే వాన! మనసులు నిండే వాన! మరులుగొలిపే వాన! మట్టిపూలలో దాగి పలవరించే వాన!’’ అని అభినయిస్తూ కవిత్వం చెప్పింది నగిరింటి దీపం.‘‘కవిత్వం వద్దుగాని మాంచి కత చెప’’ అనింది పెద్దింటి దీపం.‘‘ఏం కత చెప్పేది?’’‘‘మీ ఇంట్లో జరిగిన కత చెప? అదే కొండమనాయుడి కత’’ అనింది పెద్దింటి దీపం.‘‘కొండమనాయుడి కత ఒగరాత్తిరి చెప్పే కత గాదు. కతగా చెప్పాలంటే మూడు పగుళ్ళు, మూడు రాత్తురులు పడుతుంది. ఇదే కతని బుర్రకతగా చెప్తే తొమ్మిది పగళ్ళు, తొమ్మిది రాత్తురులు పడుతుంది. గానుగ చింత నగిరికాడ వుండే దాసరోళ్ళ వెంకటసుబ్బయ్య తంబుర్ర వాయిస్తా, గంగులక్క గుమ్మిత వాయిస్తా, అడుగులో అడుగేస్తా ఎలుగెత్తి కత చెప్తే దిక్కులు దొనిపలికేవి. ఏడేడు లోకాలు ఊయలూగేవి. సరే... మీరు అడిగినారు కాబట్టి మూడు నుడుగుల్లో కత చెప్తాను’’ అనికండ్లల్లో కోడిపుంజు పౌరుషం ఉప్పొంగగా,ఎగరేసిన జెండా గాలికి రెపరెపలాడినట్టు తలాడిస్తా కతనెత్తుకునింది నగిరింటి దీపం.

ఇది ఇపడు జరిగిన కత గాదు.ఈపొద్దో రేపో ఈ దేశాన్ని వొదిలి తెల్లదొరలు నీళ్ళకి అవతలనుండే వాళ్ళ రాజ్జానికి పోతారనంగా జరిగిన కత.ఆపొద్దు ఉగాది పండగ.కనవోరిపేట అనంతపురమ్మ దేవలం కాడ పంచాంగం పెట్టినారు. చుట్టుపక్కల పల్లెల్లోని జనమంతా దేవలం ముందు కిటకిటలాడతా వుండారు.వాటారిన పొద్దు నిపలు చెరగతా వుండాది.బయారెడ్డి, ఆయన తమ్ముడు జయన్న కుర్చీల్లో కుర్చోని ఇంగా కొండమనాయుడు రానందుకు లోలోపల కుళ్ళుకొంటా వుండారు. వాళ్ళ కండ్లల్లో వాటారిన పొద్దు గుచ్చుకుంటా వుండాది.దేవలం అరుగుమింద అయివోరు కొత్త పంచాంగాన్ని చేత్తో పట్టుకుని ఇసురుకుంటా వుండాడు. జనం చెమటలు కక్కుకుంటా కొండమనాయుడి రాకకోసం ఎంతో ఓపిగ్గా ఎదురుచూస్తా వుండారు.