‘‘ఇరవై ఏళ్ళ తరువాత మనం మళ్ళీ కలవడం, అదీ మనం అనుకున్నట్లే కలవడం నాకెంతో సంతోషంగా ఉంది’’ అన్నాడు విజయ్‌.‘‘నాకు మాత్రం థ్రిల్లింగ్‌గా ఉంది’’ అన్నాడు రాజేష్‌.‘‘తొమ్మిది గంటలకు స్కూల్లో అడుగుపెట్టాను. గంటసేపట్నుంచి నువ్వు వస్తావో, రావో అన్న ఆలోచనతోనే గడిపాను.నువ్వు లోపలికి రాగానే వెంటనే గుర్తుపట్టాను. చిన్నప్పటి నీ ఫీచర్స్‌ యిప్పటికీ అలాగే ఉన్నాయి’’ .‘‘నా పరిస్థితీ అదే. ట్రైనులో నీ గురించే ఆలోచిస్తూ వచ్చాను. స్కూల్లో అడుగుపెట్టగానే రావిచెట్టు కింద కూర్చున్ననువ్వు కనిపించావు. గడ్డం, మీసం పెంచుకున్నా నీ కళ్ళు,నీ చూపులు నాకింకా గుర్తే.’’రాజేష్‌ సిగరెట్‌ పెట్టి తీసి విజయ్‌ వైపు చేయి చాచాడు.‘‘నో థాంక్స్‌ అలవాటు లేదు’’‘‘సో నువ్వింకా మాస్టర్‌ విజయ్‌వే నన్న మాట’’ అంటూ పెట్టెలోంచి ఓ సిగరెట్‌తీసి నోట్లో పెట్టుకుని వెలిగించుకున్నాడు రాజేష్‌.‘‘మీ నాన్నకు ట్రాన్స్‌ఫరై నువ్వు హైదరాబాదుకు వెళుతున్న రోజు నువ్వు నాతో చెప్పిన విషయం నేను మర్చిపోలేదు. బహుశ అప్పట్లో మనకు పాఠ్యాంశంగా వచ్చిన ‘ఓ హెన్రీ’ కథ, ‘‘ఆఫ్టర్‌ ట్వంటీ యియర్స్‌’’ నీకు స్ఫూర్తినిచ్చి ఉండవచ్చు. ప్రతి జనవరి ఫస్టున నీ గురించి ఆలోచించేవాడిని. నిన్ను కలవడానికి యింకా ఎన్నేళ్ళుందని లెక్కలు కట్టేవాణ్ణి. ‘రాజేష్‌ ఎట్లున్నాడు, ఏ గ్రూపు తీసుకున్నాడు, ఏ కాలేజీలో చేరాడు. ఏ ఉద్యోగం చేస్తున్నాడు’ అని ఆలోచించేవాడిని.

 చిన్ననాడు మనసులో నాటుకున్న విషయాలు కలకాలం గుర్తుండిపోతాయని అంటారు. అందుకే ఇరవై ఏళ్ళ తర్వాత బాపట్ల ప్రకాశం హైస్కూల్లో మనం కలవాలన్న నీ కోరిక, తప్పకుండా వస్తానన్న నా భరోసా నన్ను యింతదూరం ప్రయాణింపజేసింది’’ అన్నాడు విజయ్‌.‘‘ప్రతి జనవరి ఫస్టున నాకూ నువ్వు గుర్తొచ్చేవాడివి. నిజానికి నాకున్న బిజినెస్‌ కమిట్‌మెంట్స్‌ వల్ల యింతదూరం వచ్చే సమయం లేదు నాకు. అయితే నువ్వు వస్తావో రావో చూడాలన్న క్యూరియాసిటీ మాత్రమే నన్ను యిక్కడికి రప్పించింది.’’ అన్నాడు రాజేష్‌.‘‘యు ఆర్‌ ఫ్రాంక్‌’’‘‘యస్‌. ఐ యామ్‌ బ్రూటల్లీ ఫ్రాంక్‌. ఇంకో విషయం తెలుసా, అవసరం లేకున్నా కంపెనీ తరపున ఓ సేల్స్‌ మీటింగ్‌ విజయవాడలో ఏర్పాటు చేశాను. కనీసం అంతవరకూ టి.ఎ., డి.ఎలు వస్తాయన్న ఉద్దేశ్యంతో’’