అరవై అయిదేళ్ళు మీద పడినా, నిటారుగా నడుస్తూ వచ్చాడు రామయ్య. అతని జుత్తు బాగా నెరసి సంస్కార రహితంగా వుండి, మొహం మీద ఒత్తుగా పడిన ముడతలు, అతడు గడించిన జీవితానుభవానికి నిదర్శనంగా అగుపిస్తన్నయ్‌.గంగరాజు, మొహం దించుకొని యేదో రాసుకుంటున్నాడు. రామయ్య రావడం అతడు గుర్తించినా మొహమెత్తి చూళ్ళేదు. ‘‘నమస్కారం గంగరాజు బాబూ’’ అన్నాడు. కొద్దిగా వొణుకుతున్న చేతులు జోడిస్తూ.గంగరాజు తలెత్తాడు. ‘‘ఏవిఁటి రామయ్యా. ఇలా వచ్చావు? ఈ వయసులో యెందుకిల్లా తిరగడం! ఇంట్లో కూచుని విశ్రాంతి తీసుకోకూడదు?’’ అన్నాడు. జేబులోంచి సిగరెట్‌ తీసి వెలిగిస్తూ.రామయ్య నిండుగా నవ్వేడు. ‘‘ఇంట్లో కూసుంటే మరింత నీరసంగా వుంటాది బాబూ! ఇటూ అటూ తిరగతావుంటే కొత్త బలం వచ్చినట్టే వుంటాది. అదీగాక ఇయ్యాళ అయ్యగార్ని కలుసుకుపోదామనే వొచ్చాను బాబూ!’’ సవినయంగా అన్నాడు.‘‘ఏమిటి సంగతి రామయ్యా!’’‘‘రేపు కొత్త సంవత్సరం బాబూ! రేపు ఒక్కరోజు సరదాగా గడిపేయాలన్న ఓ కోరిక పుట్టేసింది. కాటికి కాలుసాపుకు నున్నవోణ్ని. ఇంక యెన్నాళ్ళో బతకను. చచ్చిపోయేముందు ఈ ఒక్క పండుగ సరదాగా గడిపితే సాలనిపిస్తుంది బాబూ! తవరు దయతలసి కొత్త బట్టలిప్పిస్తే సంవత్సరం పొడుగునా తవరి పేరు సెప్పుకుంటాను.. ఏనాడూ యెరగని గడ్డు రోజులొచ్చినయ్‌ బాబూ! బట్టలకి శానా ఇబ్బంది పడతన్నాను బాబూ!’’ ప్రాధేయపూర్వకంగా అన్నాడు రామయ్య.గంగరాజుకి, రామయ్య కోరిక ఆశ్చర్యం కలిగించడమే గాకుండా, ఒకవేపు చిరుకోపమూ తెప్పించింది.

 ‘అడుక్కోవడంలో కూడా యెంత దర్పం...?’ అనుకుంటూ వెటకారంగా ఓ నవ్వు నవ్వేడు.‘‘బావుంది రామయ్యా నీ వరస. నీలాంటి పేదవాళ్ళు కూటికీ, గుడ్డకీ కరువైన వాళ్ళు యెంతో మంది వున్నారీవూళ్లో. నువ్వొచ్చినట్టే, వాళ్ళంతా వచ్చి అడిగితే, అడిగిన వాళ్ళందరికీ మేం యివ్వాలంటే, ఇహ మేం చిప్పట్టుకోవల్సిందే! అయినా యిటువంటి కోరికలేవిటి? తిండికీ లేదు. తిండి పెట్టమంటే యెవరైనా హర్షిస్తారు. కట్టుకుందుకు బట్టల్లేవు... పాత బట్టలిమ్మంటే, యెవరైనా సమర్థిస్తారు. అంతేగాని, కొత్తబట్టలు కావాలనడం విన్నవాళ్ళకే యేదోలా అనిపిస్తుంది. నాలుగురాళ్ళు సంపాదించుకుంటున్న వాళ్ళే ఈ రోజుల్లో పండగలకీ, పబ్బాలకీ కొత్త బట్టలు వేసుకోలేక పోతున్నారు. ఇహ నీలాంటి వాడికి యెట్లా వస్తాయి చెప్పు? పేరాసలొద్దు రామయ్యా, ఏదో యిల్లా కడుపు నిండుతున్నందుకు సంతోష పడు’’ అన్నాడు.రామయ్య మనస్సు చివుక్కుమంది. అతని మొహంలో మరిన్ని ముడతలు ఏర్పడినయ్‌. దట్టమైన కనుబొమ్మలు రెండూ కలిశాయి. ఫాల భాగంపై చెమట బిందువులు మెరిసినై. పెదాలు యెందుకో వణికాయి. గంగరాజు నుంచి అతడు ఆ విధమైన జవాబును ఆశించలేదు. ఎంత గానో బాధపడ్డాడు. బరువుగా ఓ నిట్టూర్పు విడిచాడు.