సాకేత్‌కి కుజదోషం వల్ల ముప్ఫయ్‌ ఏళ్ళ వరకూ పెళ్ళి కుదరక, అదే సమస్యతో సతమతమవుతున్న సుప్రియతో పెళ్ళి నిశ్చయమైంది. ఇద్దరూ ఎమ్మెన్సీ కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లే. అందం, కావాల్సినంత డబ్బు ఇద్దరికీ పుష్కలంగా ఉన్నాయి.హైదరాబాదులో పుట్టి పెరిగిన సాకేత్‌ది ఆధునికత కోసం ప్రాకులాడే మనస్తత్వం. పల్లెటూరి నేపథ్యం నుండి వచ్చినందువల్ల హైదరాబాద్‌లో జాబ్‌చేస్తున్నా సహజత్వం, ప్రకృతి, ప్రశాంత వాతావరణాన్ని ఇష్టపడే సున్నిత వ్యక్తిత్వం సుప్రియది.ఇంకో రెండ్రోజుల్లో పెళ్ళి. అటు వాళ్ళకి, ఇటు వాళ్ళకి ఆర్థిక సమస్యలు లేవు కాబట్టి... ఖరీదైన కల్యాణ మండపంలో ఖర్చుకి వెనకాడకుండా పెళ్ళి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు.‘‘పెళ్ళవుతుందా?’’ అన్న సంశయంతో ఉన్న ఇద్దరికీ పెళ్ళి కుదిరేసరికి... ఇద్దరి మనసులు మానస సరోవరానికెళ్ళి ఏకాంతం కోసం ఈదు లాడసాగాయి. పెళ్ళి కుదిరిన మరుక్షణం నుంచీ స్పీడుగా ఉన్న సాకేత్‌... కాబోయే భార్యకి స్పైసీ మెసేజ్‌లతో, పగలూ రాత్రీ లేకుండా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ సుప్రియలో స్తబ్దుగా నిద్రబోతున్న శృంగారాన్ని తట్టిలేపి, స్నానం చేయించి, బ్యూటీ పార్లర్‌కి తీసికెళ్ళి తుదిమెరుగులు దిద్దుతున్నాడు.

సాకేత్‌ వేగానికి ఏం మాట్లాడాలో, ఏం బదులివ్వాలో తెలీక తడబడుతున్న సుప్రియలో కూడా శృంగార రాగం సరిగమపదనిసలు ఆలపించటం ఆరంభించింది.ఫఫఫపెళ్ళికి ఇంకా ఇరవై నాలుగ్గంటలే సమయం. పెద్దవాళ్ళు పెళ్ళి ఏర్పాట్లలో తలమునకలవుతోంటే... సమయం దొరకబుచ్చుకుని ఆరోజు సాయంత్రం సుప్రియని తీసుకుని బయటికొచ్చాడు సాకేత్‌. కారు వేగంగా వెళ్తోంది. సాకేత్‌ మాటలు, చేతల స్పీడు చూసి, కార్లోనే శోభనం కానిచ్చేట్టున్నాడని గ్రహించి... బ్రేకులు వెయ్యటం మొదలు పెట్టింది. ఇన్నాళ్ళూ ఎదురుచూసిన ఆ సుమధుర భావన జ్ఞాపక దీపికల్లో మిగిలిపోయేలా నాల్గుగోడల మధ్య మృదుమనోహరంగా సాగాలనీ, వార్థక్యంలో గుర్తొచ్చినా.. మనసు మధురోహలతో నిండి, ఆ అనుభవం ఎప్పటికప్పుడు రీచార్జి చేసేలా ఉండాలనేది సుప్రియ తపన. అలా తన సున్నిత భావాలకు, సుమధుర స్వప్నాలకు కవితా తోరణాలు కట్టుకున్న సుప్రియకి సాకేత్‌ స్పీడు చూస్తే, లెర్నింగ్‌ లైసెన్సు ఉన్న వాడు... హైవే మీద హైస్పీడులో కొత్తకారు డ్రైవ్‌ చెయ్యాలనుకున్నట్టన్పిస్తోంది..బంజారాహిల్స్‌లో ‘కపుల్‌ ప్రైవసీ’ కెఫటేరియాలో పక్కన కూచున్న సుప్రియకి సడన్‌గా ముద్దుకి ముహూర్తం పెట్టబోయాడు. సుప్రియ సున్నితంగా తిరస్కరించేసరికి.. చిన్నబుచ్చుకున్నాడు. ‘మనం రాతియుగంలో లేం కదా! లివిన్‌ రిలేషన్స్‌ కాలంలో కిస్‌, ‘హగ్‌... కామన్‌’ అంటూ సాకేత్‌ క్లాస్‌ పీకుతుంటే... అతడి హార్ష్‌ మాటలు సుప్రియలోని సున్నిత భావాల సాఫ్ట్‌వేర్‌ని వైరస్‌ హ్యాక్‌ చేస్తున్నట్టనిపించింది.‘‘సీ.. సాకేత్‌! ఎక్కడబడితే అక్కడ కిస్సులకి, హగ్గులకి మనమేం టీన్‌ ఏజ్‌లో లేం. తినబోతూ, తొందరపడి.. ఏదో తిన్నామన్పించుకోవటం.. ఐ డోన్ట్‌ లైక్‌’’ అంది.