ఎప్పటిలాగే ఉత్తరం ఎక్కడినుంచి వచ్చిందో అర్థం కాకుండాతపాలా ముద్ర ఒకటి వుంది. రకరకాల కోణాల్లో తిప్పి కళ్ళు చికిలించుకుని చూస్తే రెండు, మూడు అక్షరాలు గుర్తుపట్టగలిగాను. ఊహూ పట్టుబడలేదు. అయినా ఈ రోజుల్లో ఉత్తరం రావడమే అదృష్టం. ఎస్‌.ఎం.ఎస్‌లూ, ఇ-మెయిల్స్‌తో విసిగిపోయాను.మీరు ఈ లోకంలో సంతోషంగా ఉన్నారా? లేరు కదూ? ఎలా ఉంటారు? మీరు కేవలం మీకోసం, మీ కుటుంబం కోసం మాత్రమే ఆలోచించరు కనుక. మీరు ప్రజల సమస్యల గురించి చింతాక్రాంతులై ఉంటారు. ఏమీ చెయ్యలేని నిస్సహాయత మిమ్మల్ని ఆవరించి ఉంటుంది. ఏం చెయ్యాలి, ఎక్కడ మొదలుపెట్టాలి అనే ఆలోచనలతోనే సమయం గడిచిపోతుంటుంది. నిజానికి మీలో ఒక కొత్త బంగారు లోకాన్ని సృష్టించగల శక్తి నిద్రాణంగా ఉంది. మీరు మార్పుకోసం ప్రయత్నించకుండా, కనీసం మార్పు గురించి ఆలోచించే సమయం కూడా ఇవ్వకుండా విపణి శక్తులు మిమ్మల్ని చక్రవ్యూహంలో బంధించి ఉంచుతాయి.

అభివృద్ధి ముఖ్యం, సాధించే తీరు కాదు అని ఘోషిస్తుంటాయి. వ్యాపారాల్లో, రాజకీయాల్లో విలువలు మృగ్యం అనే రోజుల నుండి విలువలు లేకపోవడమే వ్యాపారం, రాజకీయం అనే రోజులు వచ్చాయి. మేమూ మీలాంటివారమే. అయితే శృంఖలాలను ఛేదించి ప్రపంచంలో పెరిగిపోయిన హింస, అవినీతి, మోసం, స్వార్థం, కుటిలత్వం- వీటిని సహించలేని, సర్దుకుపోలేని వారి కోసం ఒక కొత్తబంగారు లోకాన్ని ఆవిష్కరించాం. మీ నడవడికను, ఆలోచనా ధోరణులను గమనించాం. మాకు ఆమోద యోగ్యంగా ఉండడంతో మిమ్మల్ని కొత్త బంగారులోకంలోకి ఆహ్వానిస్తున్నాము. కానీ ఈ ఆహ్వానం మీ ఒక్కరికే. మీ ఒక్కరికే కొత్త బంగారులోకంలోకి ప్రవేశం. బంధుమిత్ర సపరివార సమేతంగా కాదు. మీరు ఏ సమయంలో, ఎక్కడకు రావాలో త్వరలోనే తెలియచేస్తాము. సిద్ధంగా ఉండండి’’తిప్పి చూడండి.తిప్పి చూసాను. వెనక ఏమీ లేదు. ఊరూ, పేరూ లేదే అనుకుంటూ ముందుకు తిప్పాను. షాక్‌ ఆఫ్‌మై లైఫ్‌. తెల్లకాగితం తప్ప అక్షరాలు మాయం!అవును కదూ. ఈ ఉత్తరం జాగ్రత్తగా చదవండి. మీకు మరోసారి చదివే అవకాశం ఉండదు అని ఉత్తరం మొదట్లో రాసారు. అసలు వీళ్ళెవరు? నా మనసుని ఇలా స్కాన్‌ చేసి పడేశారు. నన్ను బాగా ఎరిగిన వాళ్ళా? కొత్త బంగారులోకం అనే పేరుతో ఫోన్‌ నెంబర్‌ కానీ, ఏదైనా ట్రస్ట్‌ రిజిష్టర్‌ అయి ఉందాని, వైబ్‌సైట్‌ ఉందా అని వెతికాను. ఎవడో ఆకతాయి చేసి ఉంటాడనుకోవడానికి వీల్లేదు. కాగితంలో అక్షరాలు మాయమవడమేమిటి?