‘‘నీకా అమ్మాయి నచ్చలేదా?’’ ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరిగి వస్తుంటే అడిగాడు నందగోపాల్‌ భారతిని. అతడి ప్రశ్నకి ఒక్క క్షణం తత్తరపడినట్టుగా చూసి తలదించుకుంది భారతి. ‘ఆ అమ్మాయి’ అని అతడు అడుగుతున్నది తమ కొత్త కోడలు లావణ్య గురించి!అభికీ లావణ్యకీ పెళ్ళై వారం రోజులే అయింది. హనీమూన్‌కి మారిషస్‌ వెళ్ళాలనుకుంటున్నారు. దానికింకా వారం రోజులు సమయం వుంది. ఈ లోగా ఏదో అర్జెంటు కాన్ఫరెన్సుకి హాజరు కావడానికి అంతకుముందు రోజే అభి ఢిల్లీ వెళ్ళాడు. ఆ వారం రోజులు ఆఫీసుకు వెళ్తే తరువాత సెలవు పెట్టుకోవచ్చని లావణ్య కూడా బెంగుళూరుకి బయలుదేరింది. ఆమెని ఫ్ౖలయిట్‌ ఎక్కించి అప్పుడే తిరిగి వస్తున్నారు వాళ్లిద్దరూ.‘‘ఇప్పుడు కొత్తగా నచ్చడమేముంది? అందరం చూసి ఎంపిక చేసుకున్న సంబంధమే కదా?’’ అంది భారతి ముభావంగా.‘‘అప్పటి సంగతి కాదు నేనడుగుతున్నది, పెళ్ళయ్యాక ఆమె ప్రవర్తన నీకు నచ్చలేదా?’’‘‘అదేం లేదు’’‘‘మరెందుకలా వున్నావు?’’ఈసారి కూడా భారతి సమాధానం చెప్పలేదు కానీ అణచి పెట్టుకున్న భావోద్వేగాలకి గుర్తుగా ఆమె కంటినుంచి కన్నీళ్ళు మాత్రం జలజలా రాలాయి. వాటిని అతడు చూడకుండా దాచే ప్రయత్నం చేయలేదు భారతి.ఆమె కన్నీళ్ళని చూసి కంగారు పడుతూ నందగోపాల్‌ కారు రోడ్డు మీదనుంచి పక్కకి తీసి ఆపాడు. ‘‘ఏమైంది భారతీ? ఎందుకా కన్నీళ్ళు?’’ అన్నాడు ఆమెని పొదివి పట్టుకుని.‘‘మన అభీ మనకి దూరమైపోతాడేమోనని భయంగా వుందండీ’’ వెక్కిళ్ళ మధ్యన అందామె.నందగోపాల్‌ ఆమెనలాగే చూస్తూ వుండిపోయాడు.

 ఆమెని కాసేపు సేద తీరనిచ్చి, ఆ తరువాత అనుమానంగా అడిగాడు నందగోపాల్‌.‘‘అసలు నువ్వెందుకంతలా భయపడుతున్నావు? ఈ నాలుగు రోజుల్లోనూ ఆ అమ్మాయి నీతో ఏమైనా అమర్యాదగా ప్రవర్తించిందా?’’భారతి తల అడ్డంగా ఊపి చెప్పింది. ‘‘లావణ్య ప్రవర్తన గురించి నాకేం ఫిర్యాదులు లేవు’’‘‘మరింకేమిటి నీ బాధ?’’భారతి మాట్లాడలేదు. ఆ భయం తనలో ఎందుకు కలుగుతోందో స్పష్టంగా తెలియడం లేదుగానీ పెళ్ళైన దగ్గరనుంచీ అభీ తనకి దూరమౌతున్నాడన్న సత్యం మనసుకు తెలుస్తోంది. తనలో చెలరేగుతున్న సంఘర్షణలని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదామెకి.‘‘నువ్వు అనవసరంగా ఆదుర్దా పడుతున్నావు భారతీ... లావణ్య విషయంలో అలా భయపడాల్సిన అవసరం లేదనిపిస్తోంది. తను అందరిలాంటి అమ్మాయి కాదు, పెద్దలంటే గౌరవాభిమానాలున్నాయి. అనవసరమైన భేషజాలు లేవు. చాలా త్వరగానే మనలో కలిసిపోతుంది’’ ఆమెని కన్విన్స్‌ చేస్తున్నట్టుగా అన్నాడతను.భారతి కళ్ళు తుడుచుకుంటూ తల అడ్డంగా ఊపి అంది ‘‘ఈ కాలం పిల్లలు ఎవరితోనైనా తొందరగానే కలిసిపోతారు. లేదా కనీసం అలా కలిసిపోయినట్లు కనిపిస్తారు. అది కాదు నా బాధ.. నాకెలో చెప్పాలో అర్థం కావడం లేదు. అభీకి ఇన్నాళ్ళూ మనమే ప్రపంచం. ఇప్పుడు వాడి జీవితంలోకి ఆ అమ్మాయి ప్రవేశించింది. క్రమంగా వాడి జీవితంలో ఆమె పాత్ర ఎక్కువై మన జీవితంలో అభీ పాత్ర తగ్గిపోతుందన్న విషయమే నాకు భయాన్నీ, బాధనీ కలిగిస్తున్నాయి’’