ఆదివారం గనుక సాయంత్రం నాలుగింటికే బయటపడ్డాను. పల్లెటూర్లో గంటలతరబడి కొంపలో బల్లిలా పడి వుండడం పరమ బోరు. చిన్నపిల్లలు మనవడో, మనుమరాలోవున్నా ఇంత అవస్థ వుండేది కాదు.ఒకనాడు కోరగుంటపల్లె అంటే జిల్లాలో పేరుమోసిన గ్రామం. నేడు చిక్కి శల్యమయింది. గతంలో తూర్పున వూరికానుకుని అతిపెద్దది కాదు మరీ చిన్నది కాదు ఒక యేరు వుండేది. అందులో పిల్లలు పెద్దలు పట్టరాని ఆనందంతో జలకా లాటలు ఆడేవారు. కబడ్డీ ఆడేవారు. పక్కన మామిడివనం. అక్కడ కోడిపందాలు, ఎద్దుల సోగ పందాలు జరిగేవి.అవి లేనపడల్లా వాలీబాల్‌ ఆట మహా ఉత్కంఠ భరితంగా వుండేది. పంట పొలాల్లో తిరుగుతున్నా, కూర్చొని మాట్లాడుకుం టున్నా ఆ పచ్చదనంలో ఆ చల్లని గాలిలో పొద్దెపడు కునికిందో తెలిసేది కాదు. ఆ కలయికే వేరు. ఆ ఉల్లాసమే వేరు. ఆ అనుభూతి తిరిగిరాని స్వప్నమయింది. 

యేరు పారక తొమ్మిదేండ్లు కావస్తోంది. కాలం గడిచేకొద్దీ దాని స్వరూపం మారిపోయింది. వొళ్ళంతా కంపచెట్ల అమ్మవారు పోసింది. ఇపడు పొద్దుపోవడానికి హైస్కూలే గతి. కనీసం ఐదు రూపాయల సిండికేటు ఆడే వాళ్ళు కూడా కరువైపోయారు. అయినా ఇంకెన్నా ళ్ళులే ఇక్కడ. రేపు మాపు. కళ్ళజోడును షర్టు అడుగు భాగంతో తుడుచుకుని తగిలించు కున్నాను. మరు నిముషంలో నిలువు చూపులు పడ్డాయి.వంకర టింకర లేని పొడుగాటి ఉత్తర దక్షిణం వీధి. దీన్ని బురుజు వీధి అంటారు. ఇది నేరుగా తూర్పు పడమర వీధిలో వూరబావి వద్ద కలు స్తుంది. ఆ సర్కిలుకు ముందే ఎడమవైపు బుద్ధుడి ఇంటిముందు పెద్ద గుంపు. బావికాడ చిన్న గుంపు. జనం ఆగి ఆగి పోతున్నారు వస్తున్నారు. ఆరేడు మంది ఆడవాళ్ళ గుంపు కనబడుతోంది.

నెల కిందట బుద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డా డని పుకారు లేపినారు. ఎదురింటికి, పక్కిండ్లకు కూడా తెలీకుండా అతికినట్లు ఒక అబద్దమాడి మాధవ మలుపు తిప్పినాడన్నారు. పులివెందులకు బదులు ప్రొద్దుటూరు బస్సెక్కడం తిరుగులేని సాక్ష్యమన్నారు. మనుషులన్నాక ఏవో పనులుం డవా? ఆ కాలంలో ఎస్‌.ఎస్‌. ఎస్‌.సి ఫెయిలైనా తండ్రి అకాల మరణంతో బుద్ధుడు నిరంతరం కష్టజీవి అయినాడు. తెల్లవారుజామున లేచి బెలుకు, చెర్లోమన్ను మూడేసి బండ్లు తోలుతాడు. భూమిని అద్దమంత శుభ్రంగా తయారు చేస్తాడు. ప్రింటెడ్‌ గీతల్లా తనే సక్కగ విత్తనం గొర్రు నడిపించి చాల్లు చూపిస్తాడు. చనక్కాయ కట్టె, వరిసెత్త, కందిపొట్టు, పెసర పొట్టుల అమరికతో సొగసైన వామి వేస్తాడు. ఆర్నెల్ల కిందట కూతురు పెళ్ళి మరీ నిరాడంబరంగా చేసినా పేరుకున్న అపలు బయటపడ్డాయి. అప్పట్నుంచి రకరకాల వూహలు పుట్టుకొస్తున్నాయి. వచ్చిన కొత్తలో మూడేండ్లు మాధవ నాకు ప్రియశిష్యుడు. అందు వల్ల వాళ్ళ కుటుంబంతో మంచి పరిచయం వుంది. అతి చనువుతో నా భార్య అదే రోజు తటాలున అడిగింది..