అంతా కలలా వుంది రాజయ్యకి. పుట్టి పెరిగిన పల్లె వదిలి, నగరానికి రావటం... అప్పుడే రెండేళ్ళు గడవటం... ఈ రెండేళ్ళలో తమ పరిస్థితి మెరుగు పడిందో లేదో అర్థం కాకపోవటం అంతా అయోమయంగా వుంది.నూట ఎనిమిదో నెంబరు ఫ్లాట్‌లో వుండే రాధమ్మగారు ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పబట్టిగానీ, లేకపోతే ఎప్పుడో తిరిగి తమ పల్లెటూరికి వెళ్ళిపోయుండేవాళ్ళు రాజయ్య, గౌరి.ఆ బిల్డింగ్‌లో ఇరవై ఫ్లాటులున్నాయి. రాజయ్యని, గౌరిని వాచ్‌మన్‌ ఇస్ర్తీ చేసే వాళ్ళలాగే కాకుండా మరికొంచెం దగ్గరగా, తోటి వ్యక్తులుగా పలకరించి... మంచీ చెడూ మాట్లాడేది రాధమ్మగారే. మిగిలిన వాళ్ళందరూ ఇంచుమించు పనులకోసం పలకరించేవాళ్ళే.వాచ్‌మన్‌గా నాలుగువేలు జీతం. ఇరవై ప్లాట్లలోవాళ్ళ బట్టలు ఇస్ర్తీ వల్ల మరో అంత ఆదాయం వుంటుందని చెప్పాడు కృష్ణ. కృష్ణ వాళ్ళ ఊరివాడే. వీళ్ళకన్నా రెండేళ్ళ ముందు నగరానికి వచ్చాడు. అతను చూపించిన పనే ఇది. అతను అన్నట్లు ఆదాయం బాగానే వుంది. పల్లెటూళ్ళో, ఎన్నేళ్ళయినా ఎదుగూ బొదుగూ లేని చాకిరేవు బతుక్కన్నా నయమే. కానీ ఆదాయం, ఖర్చూ బేరీజులోనే తేడా.తమ ఊరు వదిలి రావటానికి చాలా జంజాటన పడ్డారు రాజయ్య, గౌరి. వలస బతుకులో అల జడి అది అనుభవించినవారికే తెలుస్తుంది. 

పల్లె వదలకుండా అక్కడే వుంటే అప్పులు తీరేలా కనపడలేదు. అప్పు తీరాలంటే ఆదాయం పెరగాలి. ఆదాయం పెరగాలంటే నగరానికి రావటమే దారైంది.అప్పంటే తిరిగి తీర్చాల్సిన బాధ్యత అని నమ్మటమే కాదు... ఆ అప్పు తీరేవరకూ, రాత్రింబగళ్ళు శ్రమపడే తత్వం రాజయ్యది. భర్త పట్టుదలే, గౌరికి అప్పంటే జంకు కలిగేలా చేసింది. అయినా వాళ్ళ బతుకులో అప్పులు తప్పటం లేదు.చిన్నవయసులోనే ఇద్దరికీ పెళ్ళి జరిగింది. పల్లెటూళ్ళలో కొన్ని మంచితనాలుంటాయి. రాజయ్యకి, గౌరికి పెద్దగా అయిన బంధువులు ఎవరూ లేరు. వీళ్ళిద్దరికీ వయసు రావటం చూసిన ఊరివాళ్ళే ఇద్దరినీ కలిపారు.ఇద్దరూ కలిసే చాకిరేవుకి వెళ్ళేవారు. కలిసి కష్టం చేసేవారు. తమ గుడిసెకి తామే రాజూ రాణి. ఊరంతటితో కలిసి బతుకుతున్నా తమిద్దరి జీవితం