శాంతమ్మగారి మనసు మనసులో లేదు. పదినిమిషాల క్రితం, ఇంటి పురోహితులు కోదండశాస్త్రిగారన్న మాటలే, చెవుల్లో మారుమోగుతున్నాయి. తనని బాధ పెట్టాలనిగానీ, కించపరచాలనిగానీ అన్నమాటలు కావవి. వృత్తిధర్మాన్ని మనసావాచా నమ్మిన ఒక మనసున్న మనిషి ‘గుండె తడి’ ని గుర్తుచేసే మాటలవి.కోదండ శాస్త్రిగారి మాటలు గుర్తుకొస్తున్నాయి ఆమెకు.‘‘శాంతమ్మగారూ! నాకింక సెలవిప్పించండి. గత నలభైసంవత్సరాలుగా మీ అబ్బాయి పెట్టిన భిక్షతో, ఈ పురోహితుడు కాలం గడుపుతున్నాడు. అబ్బాయిగారు, ఆయన కంపెనీలో నిత్యపూజల నెపంతో, ఈ పేదబాపనికి నెల తిరక్కుండానే మూల్యం ముట్టచెప్పేవారు. ఇంత ఆకస్మికంగా ఆయన కన్నుమూయడం, ఇంకా కలగానే ఉంది. మనవడుగారు, తండ్రి అంత్యక్రియలే అతికష్టం మీద చేశారు. అస్థి సంచయనం చేయటానికి నిరాకరించారు.నేను ఎవ్వర్నీ విమర్శించటం లేదు శాంతమ్మగారూ! మనవడుగారు విదేశాల్లో పెద్దచదువులు చదివారు. మనలాంటి సత్తెకాలాన్ని చూడలేదు ఆయన. వాళ్ళ భావాలూ... వాళ్ళ విలువలూ.. జీవితంపట్ల వాళ్ల అవగాహన వాళ్ళది.కానీ... ఇంతకాలంపాటు నాకు అన్నం పెట్టిన అబ్బాయిగారి అంత్యేష్టి జరగని ఈ ఇంట్లో నిలవలేకున్నానమ్మా! కళ్ళముందు అబ్బాయిగారు నల్లని కాకిరూపంలో... మనవడు గారు పెట్టే అన్నం పిడచకోసమే ఎదురుచూస్తున్నారని కళ్ళుమూసినా, కళ్ళుతెరిచినా అనిపిస్తోంది నాకు.మీరూ పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. మిమ్మల్ని నా మాటలతో బాధపెట్టి, ఇరకాటంలో పెట్టలేను.ఇంతకాలం, ఈపేద బాపడిమీద చూపిన దయకీ... ఈ బాపడు పుత్ర పౌత్రాలతో ఇంటిని నడపటానికి కావలసిన విత్తాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞుణ్ణి.

దేవుడు మీకు ప్రశాంతత కలిగించాలని కోరుకుంటున్నాను. సెలవిప్పించండమ్మా’’ అని చెప్పి నమస్కారం చేసి.. కళ్ళుతుడుచుకుంటు వెళ్ళిపోయారు.ఆమె కళ్ళముందు మనవడిరూపం కదలాడింది. అందంగా ఆత్మవిశ్వాసంతో తాను నమ్మినవిధంగా... హాయిగా బ్రతికేసే మనవడు.తనని గుండెల్లో పెట్టుకుచూసే మనవడు.మనవడి మాటలు ఇప్పుడు గుర్తుచేసుకున్నారు శాంతమ్మ గారు.‘‘మామ్మా! మనిషి శరీరంలోంచి ఒకసారి ప్రాణం పోతే, లబ్‌డబ్‌మనే గుండె ఆగిపోతే, ఇక మిగిలేవి ఆ మనిషి గురించిన జ్ఞాపకాలు మాత్రమే. ఆ మనిషి ఒక చరిత్రగా మిగిలిపోతాడు. గతించిన గతంగానే ఉండిపోతాడు. యమభటులు వస్తారనీ, పాశాలు బిగిస్తారనీ, చీమూ నెత్తురూ పారే వైతరిణిలో ఈడ్చుకెళతారనీ.. ఈ మాటల మీద నాకు నమ్మకం లేదు.