ఉదయం ఎనిమిది గంటలు దాటుతూంది....వర్లక్షమ్మ ఆలస్యంగా నిద్ర లేచింది. మోకాళ్ల నొప్పుల్తో రాత్రంతా సరిగ్గా నిద్రపట్టలేదు.పని ముండకు ఏం మాయరోగం వచ్చిందో - నాల్గురోజుల్నించీ పన్లోకి రాటం లేదు. ఇంట్లో ఎక్కడ పని అక్కడే వుంది. తనేమో ఈ పాడు నొప్పుల్తో అడుగుదీసి అడుగు పెట్టలేక పోతోంది.కాస్త పుత్తూరు తైలం కాళ్లకు మర్దన చేసుకుందామని నట్టింట కూలబడ బోతోంది.... ఇంతలో బయట గేటు దగ్గర అలికడయ్యేసరికి తలెత్తి చూచింది.చుడీదారు డ్రెస్‌లో వున్న ఒక యువతి గేటును నెట్టుకొని లోపలికి వస్తోంది. చూడబోతే బస్తీపిల్ల లాగా వుంది. రెండు జడలు వేసుకుంది. జడ కొసల్ని పైకెత్తి కట్టుకుంది. చిలకాకుపచ్చ రంగు చున్నీని మెడకు చుట్టుకుంది. 16-17 ఏళ్లుంటాయి.మెట్ల దిగువున నిలబడిన ఆ పిల్లను ఎగాదిగా చూస్తూ ‘‘ఎవరు కావాలి?’’ అనడిగింది.‘‘మా మమ్మీ పంపించింది’’ అంది. 

‘‘మీ మమ్మీ ఎవరు?’’‘‘వేదలక్ష్మి’’ వేదలక్ష్మి ఎవరు? నేనాపేరు ఎప్పుడూ విన్లేదే?’’ విసుగ్గా అంది.‘‘మీ ఇంట్లో పన్జేసే వేదలక్ష్మి డాటర్ని!’’ కాస్త నిక్కుగా అంది.పని దాని కూతురనగానే వర్లక్షమ్మకు ఒక విధ మైన చులకన భావం కలిగింది. పనిముండ కూతురుకిన్ని షోకులా అనుకుంది.ఆ పిల్లను పట్టిపట్టి చూస్తూ, ‘‘ఏంటీ నీవు మా యాదీ కూతురువా?’’ బుగ్గలు నొక్కుకుంటూ ఆశ్చ ర్యంగా అంది.దానికా పిల్ల ఠక్కున ‘‘యాదీ కాదు. వేద లక్ష్మీ!’’ అంటూ నొక్కి పలికింది.చిరుగులు బడ్డ పాత చీరకట్టి, మాసి కలు వేసిన మురికి రెవిక తొడిగి, చింపిరి జుట్టేసుకుని ఈ ఇంట్లో పన్జేసే యాది ముండ కూతురా ఇదీ! షోకుల్జేసుకొని మా ‘మమ్మీ-కమ్మీ’ అంటూ వచ్చింది. పైగా ‘యాదీ కాదు; వేదలక్ష్మీ!’ అంటూ తన్తో రెట్టించి మాటాడుతోంది... వర్ల క్షమ్మకు వళ్లు మండు కొచ్చింది.‘‘మీ అమ్మకేం వచ్చింది. నాల్గు రోజుల్నుంచీ పన్లోకి రాటం లేదు?’’ గట్టిగానే దబాయించింది.‘‘వంట్లో బాగుండటం లేదు’’ ఠక్కున సమాధానం ఇచ్చింది.‘‘ఏం రోగం?’’ చాలా హీనంగా, చులకనగా అంది.ఆ మాటకాపిల్ల ముఖం కంద గడ్డలాగా చేసుకుంది.