రాత్రి గడిచింది. సూరీడు కొండ ఎనకాల నుండి మీదికి నెగకముందే అప్పలరాజు వొటేలు ఓపిను చేసేసాడు. టంచనుగా టయిముకు రోజూ తీస్తాడు. ఒక గంట టీ మాత్తరమే అమ్ముతాడు. ఆ వీధిలో నిద్రపట్టక తెల్లారకుండా లెగిసిపొయ్యేవాళ్లు చాలామంది ఉన్నారు. ఆ దారిలో పొలం పనులకు తట్టా పారా పట్టుకొని ఎల్లేవాళ్లు కూడ చాలామందున్నారు. ఆ టయిములో ఆళ్లందరి టీ బేరం వస్తాది. తర్వాత దోసె మాష్టరు, వాళ్ళతోబాటు పిండి కలిపేవాళ్లు వస్తారు. అప్పటి నుండి టిపిను వొటేలు లాగా చలామణి అయిపోతుందా టీ కొట్టు. యాపారం సుకంగానే నడుస్తూంది. దోసె మాస్టరు అసలు పేరేటో చాలామందికి తెలీదు. తెలిసిన వాళ్లు మరచిపోయేరు. అడిగిన వాళ్లకు పైడిరాజు అని చెబుతాడు.ఆ వొటేల్లోనే నరసి లేక నరసిగాడు క్లీనరు కుర్రాడుగా పనిచేస్తున్నాడు. వాడి అసలు పేరు నరసింహం, వాడికి ప్లేటులు కడగడంలోనూ గలాసులు తోమడంలోనూ అనుబవం వచ్చేసింది.

వీలు చిక్కినప్పుడల్లా దోసె మాస్టరు దోసెలెయ్యడం చూసేవాడు. అతడిచ్చిన దోసెలు తినడం కోసం కూర్చుని ఎదురుచూస్తున్న కస్టమర్లని చూసి నరసి ఆచ్చర్యపోయేవాడు. ఆ దోసె మాస్టరుకున్న డిమాండు ఎక్కువే. తనూ ఎప్పటికైనా దోసె మాట్టరు అవుదామని ఆ పదేళ్ల వయసులోనే కలలు కనేవాడు.ఆ రోజు పొద్దుటేల లేబరు ఇనస్పెట్రు దిగిపోనాడు, వొటేలు కాడకొచ్చి గదమాయించేడు. ‘‘ఏటీ చిన్న పిల్లల చేత పని చేయిస్తున్నారూ?’’ అంటూ హడలుగొట్టేసాడు. అప్పలరాజు గుండి గుబేల్మంది. ఇనస్పెట్రు అతడ్ని సూసిన సూపు మర్డరు సేసినోడ్ని జడ్జి చూసినట్టుంది. గుళ్లోకి సెప్పుల్తో యెళ్లిన భక్తుడ్ని పూజారి సూసినట్టుంది. గోరం జరిగిపోయింది. ‘‘చదువు కోవాల్సిన పిల్లలు బడికి ఎల్లనీకుండా ఆళ్లసేత పని చేయిస్తున్నావు’’ అన్నాడు ఇనస్పెక్టరు. అప్పలరాజు బయపడ్డాడు. నిజంగా బయపడింది కేసు పెట్టేస్తాడనికాదు. 

కేసు లేకుండా చేసేందుకు ఎంత మామూలు అడుగుతాడోనని. అయినా వేడుకొన్నాడు. ‘‘నేనేమీ పిలిసి ఆ కుర్రాడిని పనిలోకి ఎట్టుకోలేదు. ఆడి బాబే బతిమాలి ఇక్కడ ఎట్టాడు. కావలిస్తే ఆ కుర్రాడినే అడగండి’’ అన్నాడు.‘‘అవును, మా అయ్యే నన్నిక్కడ పనిలోకి ఎట్టాడు. నాకు రోజూ పనిచేస్తున్నందుకు టిపిన్లు ఎడతాడు. డబ్బులు కూడా ఇస్తాడు.’’ అన్నాడు నరసి. ‘‘ఆ డబ్బులేం చేస్తున్నావ్‌?’’ అడిగాడు ఇనస్పెక్టర్‌.‘‘మా అయ్యే తీసుకొంటాడు, నా దగ్గర ఉండవు.’’‘‘ఇది చాలా తప్పు, నువ్వు హొటేల్లో పనిచెయ్యకూడదు, బడికి వెళ్లి చదువుకోవాలి.’’ అన్నాడు ఇనస్పెక్టరు.’’‘‘మరి నాకు రోజూ రెండు పూటలా టిపినూ కాపీలు బళ్లో ఇస్తారా?’’ అడిగాడు నరసి.‘‘నీ వయస్సు వాళ్లకు తిండిపెట్టి చదువు చేప్పే బళ్లు చాలా ఉన్నాయి. ఎక్కడైనా చేరు.’’ అన్నాడు ఇనస్పెక్టరు.