పిల్లలు స్కూల్‌కి, ఆయన ఆఫీస్‌కి వెళ్ళారు. వాళ్ళ బాక్సుల్లో పెట్టడానికి వంట చేసేసాను కాబట్టి అట్టే పని కూడా లేదు. కాఫీ కలుపుకోని బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాను. చుట్టూ కీకారణ్యం-అదే కాంక్రీట్‌ జనారణ్యం. మా ఇంటికి నాలుగు భవనాల అవతల కనిపించే రోడ్డు మీద దూసుకుపోతున్న వాహనాలు. అంతా ఆఫీసులకీ, ఉద్యోగాలకి, స్కూళ్ళకి కాలేజీలకి పెడుతున్న పరుగులు, పొరపాటున ఏదో ఒక వాహనం ఆగినట్టుంది. ఒక్కసారిగా అన్ని వాహనాలు గొంతు చించుకు కేకలు పెడుతున్నాయి. రకరకాల గొంతులు, రకరకాల శబ్దాలు.. మోత. రణగొణ ధ్వని.ఒక్క క్షణం ఆగితే వీళ్ళ సొమ్మేం పోయింది? ఆ ఆగిపోయిన బండివాడు ఏమన్నా సరదాగా ఆగేడా? ఆ బండీ ముందుకెళ్ళాల్సిందేగా. ముందున్న బండి కదిలాక ఎలాగూ అందరూ కదలక తప్పదు. ఇంతలోనే హారన్‌ గొత్తెత్తి గోలపెట్టాలా?బండ్లు మళ్ళీ కదిలాయి. అంతా ఒక రూల్‌ ప్రకారం... ముందే నిర్ణయించుకున్న దారిలో ముందుకు... ముందుకు. ఏమిటో... ఎన్నో సంవత్సరాలు ఒకే రోడ్డు వెంట, ఒకే దారిలో అదే పనిగా తిరుగుతుంటే విసుగనిపించదూ? ఎప్పుడూ అవే భవనాలు, అదే ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌, ఆ సిగ్నల్‌ దగ్గర అదే ముసలాయన చెయ్యి చాస్తూ.. ఎప్పుడూ అదే రొటీన్‌ రూటూ... రొటీన్‌ బ్రతుకు.

కనీసం ఒక్కసారన్నా ఎప్పుడూ వెళ్ళే దారిని వదిలి వేరే దారిలోకి మలుపు తిప్పారా? అసలు ఆ మలుపు తిప్పితే ఏముందో ఎవరికైనా తెలుసా? ముందే నిర్ణయమై పోయిన దారిలో విసుగూ విరామంలేకుండా అలాపోతూ వుండకపోతే ఒక్క సారైనా దారి మార్చి చూడకూడదూ....!!కాఫీ అయిపోయి లేవబోతుంటే ఎక్కడినుంచో కోయిల గొంతు పలకరించింది. ఎడారిలో నీటిబుగ్గ పుట్టినట్టు పచ్చదనం మచ్చుకైనా కనిపించని ఈ ఇటుక రాళ్ళ గూళ్ళ మధ్యలో కోయిల కూడా ఒకటుందా? ‘‘కూ.. కూ...’’ మళ్ళీ కూసిందది. ఇది ఇంకా ఫిబ్రవరి నెలే. ఇంకా దాదాపు నెలరోజులుంది ఉగాదికి. తొందరపడి కూసే కోయిల అని ఎవరో కవి అన్నట్టు, ఇదేనా ఆ కోయిల. వసంతాగమనానికి ముందే గొంతెత్తి కూస్తోంది. లేకపోతే వసంతార్భాటాలన్నీ చూడాలన్న తపనతో ఇంకా రాలేదే అని కోప్పడుతోందా? ప్రియ వసంతుణ్ణి రావేలా అని పిలుస్తోందా? అదే నిజమైతే అసలు వసంతం వచ్చాక కోయిల కూయాలా లేక కోయిల పిలిచిందని వసంతం వస్తుందా?