చూడు మునిస్వామి! నిన్ను రెండ్రోజులు లాకప్‌లో పెట్టినందుకు నాక్కూడా బాధగానే ఉంది. ఏం చెయ్యమంటావో నువ్వే చెప్పు. ఈ మధ్యనే పీడీ యాక్ట్‌ అనేది ఒకటొచ్చింది. దీని కింద అరెస్ట్‌ అయినోళ్లకు బెయిల్‌ రావాలంటే కూడా ఆరునెలలు పడుతుంది. ఇంకనైనా జాగ్రత్తగా ఉండండి. ఈ సంగతి మీ పల్లెలో వాళ్లకందరికీ చెప్పు’’ పోలీస్‌ స్టేషన్‌లో కాలు మీద కాలేసుకొని బూట్లు ఆడిస్తా, కళ్లు ఎగరేస్తా చెప్పినాడు ఎస్సై సుధాకర్‌.చేతులు కట్టుకొని, మాసిన బట్టల్తో, విచారం నిండిన ముఖంతో నిలబడి ఉన్నాడు మునిస్వామి... ఎదురుగా.‘మరీ బతకలేకపోతే ఒక పని చెయ్యండయ్యా...ఎక్కడో ఒక చోట రోడ్డు పక్క రెండు గుంజలు పాతి మధ్య తాడు కట్టి నీ కూతుర్నో, కొడుకునో పైకెక్కించి దొమ్మరి ఆటనే ఆడుకోండి. డబ్బులు వస్తాయి. ఈ కొయ్య బొమ్మల పని చేసి జైళ్లల్లో పడేదానికంటే అదే మేలు కదా....ఏమంటావ్‌...’’ ఎడంచేత్తో మీసాన్ని దువ్వుకున్నాడు ఎస్సై...రెచ్చగొడుతూ.తనని కులం పేరుతో దూషిస్తున్న ఎస్సై పట్ల పట్టరాని ఆగ్రహం వస్తోంది. కానీ ఏం చేయగలడు?తిరగబడలేని బలహీన బతుకులు...మౌనంగా నిలబడిపోయాడు....బొమ్మలా....కొయ్యబొమ్మలా...మునిస్వామి!నరాల్లో నెత్తురు రగులుతోంది. కానీ చేతకాని తనం. కళ్లు మూసుకున్నాడు.కన్నీళ్లు పొంగుకొచ్చాయి.కళ్ల ముందు రకరకాల బొమ్మలు కన్పిస్తాఉండాయి.

దేవుళ్లు...దేవతలు...వేంకటేశ్వరుడు, వినాయకుడు, కృష్ణుడు, మహావిష్ణువు, హనుమంతుడు, శివపార్వతులు, దశావతారాలు, లక్ష్మీ సరస్వతులు...ప్రత్యక్షమవుతున్నారు. వీళ్లనందరినీ తాను ఎందుకు సృష్టించాలి? ఎందుకు జైల్లో పడాలి?రెండు రోజులు లాకప్‌ జీవితం గుర్తుకొచ్చింది.కడుపులో తిప్పినట్లయింది. తానెప్పుడూ స్టేషన్‌ ముఖం కూడా చూసింది లేదు. అలాంటిది కటకటాల వెనుక రెండ్రోజులు గడపాల్సి వచ్చింది.తన పట్ల, తను నమ్ముకున్న కళ పట్ల అసహ్యం వేస్తోంది. తనని ఏ దేవుడూ కనికరించలేదెందుకు? రకరకాల ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయి.్‌్‌్‌‘మాంఛి బేరం తగిలింది. మద్రాస్‌ నుంచి వ్యాపారి వచ్చాడు. చూడు...ఆర్డర్‌ తీసుకో...నువ్వు బాగా బొమ్మలు చేస్తావు కాబట్టి నీ దగ్గరికే పిలుచుకొచ్చినా...’ మునిస్వామిని పక్కకు తీసుకొచ్చి చిన్నగా చెవిలో చెప్పాడు వైకుంఠం.‘ఎంతిస్తాడంటా?’ ప్రశ్నించాడు మునిస్వామి.‘ముఫ్ఫై వేల రూపాయలు. వినాయకుడి బొమ్మ కావాలట’ చెప్పాడు వైకుంఠం.కళ్ల ముందు కాసుల వర్షం కదలాడింది.కానీ...కొయ్య ఎక్కడ్నుంచి వస్తుంది? ఆ ప్రశ్న ఆలోచనల్లోకి రాగానే నిరాశ ఆవహించింది.‘సరిపోదంటే చెప్పు...ఇంకో మూడు వేలు ఖర్చుల కోసం మాట్లాడి ఇప్పిస్తాలే...’ బేరం పోగొట్టుకోవద్దు. నా కమీషన్‌ మరిచిపోవద్దు అనే ధోరణిలో చెప్పాడు వైకుంఠం.ఇంటి బయట వేప చెట్టు నీడలో..తెల్లటి కారులో వ్యాపారి ఉన్నాడు. బేరం ఏదో ఒక విధంగా కుదిరితే అడ్వాన్సు కూడా అందుతుంది.‘సరే...నేను బొమ్మ చేసి ఇస్తాను’ అని చెప్పడానికి ధైర్యం చాలడం లేదు మునిస్వామికి.