ఆ ఫ్లాట్‌ మా ఇద్దరికీ బాగా నచ్చింది. బెడ్రూం... కిచెన్‌... చిన్న హాల్‌.‘‘మన ఆఫీస్‌ నుంచి నాలుగు కిలోమీటర్లే. బైక్‌ మీద పావు గంట చాలు’’ అన్నాడు అనురాగ్‌.‘‘నీ స్పీడ్‌కి అందులో సగం చాలేమో’’ ఐదడుగుల పదంగుళాల ఎత్తున్న అతని వైపు మురిపెంగా చూస్తూ అన్నాను. అనురాగ్‌ మనోహరంగా నవ్వాడు. నాకెంతిష్టమో ఆ నవ్వంటే...ఫ్లాట్‌ చూపించడానికి వచ్చిన ఇంటావిడతో ‘‘మాకు నచ్చింది. అడ్వాన్స్‌ ఇచ్చేయమంటారా’’ అని హిందీలో అడిగాడు.‘‘అద్దె పదిహేనువేలు...మూడు నెలల అడ్వాన్స్‌... ఫస్ట్‌ తారీక్కి అద్దె ఇచ్చేయాలి’’ ఆమె నా వైపు గుచ్చి గుచ్చి చూస్తూనే చెప్పింది.‘‘పదకొండు నెలలకు సరిపడా పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులిచ్చేస్తాం’’ తన చెక్‌ బుక్‌ బైటికి తీస్తూ అన్నాడు.ఆమె ఎటువంటి ఆసక్తి చూపించకుండా ‘‘ఎంత మంది ఉంటారు.’’ అని అడిగింది.‘‘మేమిద్దరమే’’ అన్నాను.‘‘మీరిద్దరూ భార్యాభర్తలా?’’ నా మెడ వైపు, పాదాల వైపు పరిశీనలగా చూస్తోందామె.అనురాగ్‌ ఏదో చెప్పబోయేలోపల ‘‘కాదు’’ అని సమాధానం చెప్పాను.ఆమె భృకుటి ముడివేసి ‘‘మరి బంధువులా’’ అని అడిగింది.‘‘కాదు..స్నేహితులం’’ అన్నాను.‘‘సారీ, ఫ్యామిలీకి మాత్రమే అద్దెకిస్తాం’’ మరో మాటకు తావివ్వకుండా ఆమె ఒక్కో తలుపుని మూయటంలో నిమగ్నమైపోయింది.రోడ్డు మీది కొచ్చేవరకు బిగపట్టుకున్న నవ్వు ఒక్కసారిగా పొంగుకొచ్చింది.

 తెరలు తెరలుగా నవ్వుతున్న నా వైపు ఆశ్చర్యంగా చూశాడు అనురాగ్‌.‘‘మనకు నచ్చిన ఇల్లు చేజారిపోయిందని బాధపడాల్సిందిపోయి ఆ నవ్వేంటి?’’ అన్నాడు.‘‘బాధపడటమా?నాన్సెస్‌...నా డిక్ష్నరీలోంచి ఆ పదాన్ని చెరిపేసి చాలా రోజులైంది. ఈ ఫ్లాట్‌ కాకపోతే దీని బాబులాంటి మరో ఫ్లాట్‌ దొరుకుతుంది. డబ్బుంటే చాలు. విచ్చలవిడిగా ఖర్చు చేసుకున్నా ఇంకా మిగిలిపోయేంత జీతాలు మనవి. మనిద్దరం స్నేహితులం అని చెప్పగానే ఆవిడ మొహం ఎలా మాడిపోయిందో గమనించావా? అది చూడగానే ఎంత నవ్వొచ్చిందో.. ఆపుకోవడానికి ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసు’’‘‘అసలలా ఎందుకు చెప్పావు? భార్యభర్తలమనే చెప్పాల్సింది.’’‘‘మనం భార్యాభర్తలం కాదుగా... అబద్ధం ఎందుకు చెప్పాలి? నాకు నువ్వంటే ఇష్టం. నీతో కలిసి బతకాలనుకున్నాను. బరువు బాధ్యతలు లేని బంధం కావాలనుకున్నాను. దానికి నువ్వూ ఒప్పుకున్నావు సింపుల్‌.’’‘‘నీకు సింపులే. అందరికీ కాదు. పెళ్ళికాకుండానే కలిసి ఉండే పద్ధతి మన సమాజానికి పూర్తిగా ఆమోదయోగ్యం కావడానికి కొన్ని దశాబ్దాలు పట్టొచ్చు. మన సంప్రదాయాల ప్రకారం పెళ్ళి ఓ పవిత్ర కార్యం. మనసా వాచా కర్మణా ఒకరికొకరు అంకితమై జీవితాంతం కలిసి ఉంటామని చేసుకునే ప్రమాణం. బలమైన సాంఘిక కట్టుబాట్లకు లోబడి సంసారం సాగిస్తున్నారు కాబట్టే మన దేశంలో వివాహ వ్యవస్థ అంత బలంగా పటిష్ఠంగా ఉంది.’’