‘‘మేడమ్, ఇక్కడి నుంచి దట్టమైన అరణ్యం మొదలవుతుంది. అడవిలో క్రూరమృగాలు స్వేచ్ఛగా తిరుగాడుతుంటాయి. ఇంకా ముందుకెళ్ళటం ప్రమాదం’’ రీటాని హెచ్చరించాడు గైడ్. ఆ మాటల్ని పట్టించుకోకుండా టాప్ లేని ఆ జీపులో నిల్చుని బైనాక్యులర్స్‌తో అడవిని వీక్షిస్తోంది రీటా.మనోహర దృశ్యమది! ఆకాశాన్ని కమ్మేసినట్టు ఎత్తయిన వృక్షాలు, భూమిని కప్పేస్తూ అల్లుకు పోయిన తీగలు - ఎటు చూసినా పచ్చదనంతో సృష్టికర్త గీసిన పెయింటింగ్‌లా వుందది. చెట్లపై కిలకిల రావాలతో స్వాగతం పలుకుతున్న వివిధ రకాల పక్షుల్ని చూసి రీటాలో ఉత్సాహం వురకలేసింది.‘‘ఎస్. నేను వెదుకుతున్న అడవి ఇదే! నాక్కావల్సిన పక్షి, కీటక జాతులు ఇక్కడ కన్పించే అవకాశముంది. ఇంకాస్త ముందుకెళతావా?’’ రీటా మాటలు విన్న డ్రైవర్ ఆమెను ఎగాదిగా చూశాడు.‘‘మేడమ్, ముందు దారి లేదు. బలవంతంగా వెళితే చెట్లమధ్య ఇరుక్కుపోతాం. అప్పుడు వాపసు వెళ్ళటానికి జీపు తిప్పుకోవాలన్నా సాధ్యం కాదు’’ అన్నాడు. డ్రైవర్ చెప్పింది నిజమే! అడవి లోపలికి మనుషులు వెళ్ళగలిగే స్థలం కూడా లేదు. జీపు ఎలా వెళ్ళగలదు?‘‘ఓ.కె. మీరిక్కడే వుండండి. నేను అడవిలో కెళ్ళి నా పని చేసుకొస్తాను. సాయంత్రం కల్లా తిరిగొస్తాను’’ అంటూ రెండు బ్యాగుల్ని తీసుకుని జీపు దిగింది రీటా. జీపు డ్రైవర్, గైడ్ ఆమెను పిచ్చిదాన్ని చూసినట్టు ఆశ్చర్యంగా చూశారు.‘‘మేడమ్, ఈ అడవిలోకి వెళ్ళిన వారెవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు. అడవిలో అడుగు పెట్టగానే మీరు తప్పిపోతారు. అడవిలో దారి అంటూ వుండదు.
ఎక్కడ చూసినా చెట్లే కన్పిస్తాయి. దాంతో మీరు వెళ్ళిన దారిలోనే వెళుతూ అక్కడే తిరుగుతూ ఉండిపోతారు. ఈ అడవి క్రూరమృగాలకు నిలయం. ఒంటరి మనిషిని చూడగానే అవి దాడి చేస్తాయి. పైగా అడవుల్లో హఠాత్తుగా వర్షం కురుస్తుంది. కుంభవృష్టి కురిస్తే మీకు తల దాచుకునే చోటు కూడా దొరకదు. ఇక్కడ సెల్‌ఫోన్లు కూడా పని చెయ్యవు’’ గైడ్ రీటాకి వివరంగా చెప్పాడు.‘‘థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఇంతకన్నా ప్రమాదకరమైన ఆఫ్రికన్ ఫారెస్ట్‌లో రీసెర్చి చేసిన అనుభవం నాకుంది. నేను పుట్టి పెరిగిందే అమేజాన్ అడవుల్లో. నా బాల్యమంతా జంతువుల సహవాసంలోనే గడిచింది. కాబట్టి మీరు నా గురించి బెంగపడొద్దు. నేను అడవిలోంచి తిరిగొస్తాను. ఒక వేళ చీకటి పడేలోగా నేను రాకపోతే మీరు వాపసు వెళ్ళిపోండి’’ అంటూ రీటా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేసి బ్యాగులు మోసుకుని అడవిలోకి దూరి క్షణాల్లో మాయమైంది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ వారిద్దరూ నిశ్చేష్ఠులై పోయారు. అప్పుడు సమయం ఉదయం పది కావస్తోంది.