‘‘పూజిత హాస్పిటల్‌’’ అనే బోర్డున్న ఆ భవనం గ్లాస్‌వాల్స్‌తో ఎండకి తళతళా మెరుస్తోంది. వరండాలో వరసగా వేసిన కుర్చీల్లో పేషెంట్లు, వాళ్ళతో పాటు వచ్చిన బంధువులు కూర్చుని ఎదురుగా పెట్టి ఉన్న టీవీ చూస్తున్నారు. కౌంటర్లో రిసెప్షనిస్ట్‌ కొత్తగా వచ్చిన పేషెంట్లదగ్గర వివరాలు రాసుకుని సీరియల్‌ నెంబర్‌ ఇస్తోంది. నర్సులు అటూఇటూ తిరుగుతున్నారు. కాంపౌండర్‌ డోర్‌ దగ్గర నిలబడి సీరియల్‌ ప్రకారం ఒక్కొక్కరిని డాక్టర్‌ గదిలోకి పంపుతున్నాడు.కుర్చీల్లో కూర్చున్న అశోక్‌, ప్రశాంతి... డాక్టర్‌ పిలుపుకోసం ఎదురుచూస్తున్నారు. ‘‘అలా విచా రంగా ఉన్నారేమిటండీ?’’ భర్త వంక చూస్తూ అడిగింది ప్రశాంతి. అశోక్‌ ఆమె వంక సూటిగా చూస్తూ ‘‘నీకు తెలియదా?’’ అన్నాడు. ప్రశాంతి సమాధానం చెప్పలేనట్లు తల తిప్పుకుంది. ఆమెకు జరిగి పోయినవన్నీ గుర్తొచ్చాయి.ప్రశాంతి తల్లిదండ్రులు పాతకాలం వారు. ప్రశాంతికి ఒక అన్న ఉన్నాడు. పేరు సుధాకర్‌. తల్లిదండ్రులు మగ పిల్లాడని అతను అడిగినవన్నీ తెచ్చి ఇచ్చేవారు. ప్రశాంతి అడిగితే మాత్రం ‘‘మగ పిల్లాడితో నీకు పోటీ ఏమిటి?’’ అనేవారు. అతను చదివి వదిలేసిన సెకండ్‌ హాండ్‌ బుక్స్‌తోనే చదువుకునేది.సుధాకర్‌ తెలివిగా ‘‘అమ్మా, నాన్నా కొని ఇస్తున్నారు. నేను తీసుకుంటున్నాను. నా తప్పేం లేదు’’ అన్నట్లు ఉండేవాడు. అతను ఇంటర్మీడియట్‌ తర్వాత ఇంజనీరింగ్‌ చదువుతూంటే ప్రశాంతి ఇంట్లో కూర్చుని ప్రైవేట్‌గా డిగ్రీ చదివేది. అయినా ఏనాడూ అన్నని చూసి అసూయ పడలేదు. తల్లిదండ్రులు ప్రశాంతి పెళ్ళి కూడా సాదాసీదాగా జరిపే శారు. ప్రశాంతి భర్త అశోక్‌ పేద కుటుంబంలో నుంచి వచ్చాడు. అతనిది చిన్న చదువు. చిన్న ఉద్యోగం.సుధాకర్‌కి కట్నం తీసుకుని డబ్బున్న ఇంటి అమ్మాయి మాధవితో వివాహం వైభవంగా జరిపించారు. కొన్నాళ్ళ తర్వాత తల్లీతండ్రీ కన్నుమూశారు.

 ప్రశాంతి కుటుంబం, సుధాకర్‌ కుటుంబం ఒకే ఊళ్ళో ఉంటున్నారు. ధనవంతురాలిననే అహాన్ని మాధవి అప్పుడప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటుంది. భార్యకు సుధాకర్‌ ఎదురు చెప్ప లేడు. రెండు కుటుంబాల మధ్య ఆత్మీయతలు పెద్దగా లేకపోయినా, గొడవలు మాత్రం లేవు. వస్తూ పోతూ ఉంటారు.‘‘వాళ్ళు మనస్ఫూర్తిగా మనతో కలవలేనప్పుడు మనం వాళ్ళింటికి వెళ్ళటం దేనికి?’’ అనే వాడు అశోక్‌.‘‘మా పుట్టింటి వైపు మిగిలింది అన్నయ్య ఒక్కడు. వాడిని కావాలని దూరం చేసుకోవటం ఎందుకు?’’ వాళ్ళకిష్టమైనట్లే ఉండనివ్వండి. వదిన స్వభావం మనకు తెలిసిందే కదా!’’ అనేది ప్రశాంతి. భార్య మాటలకు ఏమీ అనలేక పోయేవాడు అశోక్‌.ప్రశాంతికి ఎనిమిదేళ్ళ పాప, మూడేళ్ళ బాబు ఉన్నారు. సుధాకర్‌కి పెళ్ళయి పదేళ్ళయినా పిల్లలు లేరు. సుధాకర్‌ మేనల్లుడిని, మేనకోడలిని దగ్గరకు తీస్తూండేవాడు. వాళ్ళకి బొమ్మలు, చాక్లెట్లు కొని ఇస్తూంటాడు.