‘‘ఏమయ్యా! పొద్దన్నే వూరికే కూసుంటే అవునా! యేదోవొగిటి చేసుకోకపోతే యట్టా?’’చుట్టింట్లో ఎండు చేపలావున్న చంక బిడ్డకి పాలిస్తూ అంది ఆదిలచ్చిమి. ఆమె వంటిపైనా అంత కండలేదు. చింపిరిజుట్టుతో సన్నగా, చర్మం కపకున్న ఎముకలతో పొలాల్లో తిరుగాడే గొల్లభామలా వుంది. ఆమె కట్టుకున్న చీరా అక్కడక్కడా మాసికలతో కనిపిస్తోంది.‘‘చేసేదానికి యేం పండ్లుండాయే. భూములున్న మారాజులే కరువుకు పొట్ట చేతబట్టుకోనుండారు. యింక మనట్లా వోళ్ళు యేంజేసేదీ?’’వీధిలో గడప పక్కన, ఈగల్ని తన చీమిడి ముక్కుతో ఆకర్షించి ఆదరిస్తూ... గుజ్జు రూపం దాల్చిన దరిద్ర దేవతలాకూర్చోనున్న అయిదేండ్ల చిన్నమ్మి వైపు చూస్తూ నిర్వేదంగా అన్నాడు ఇర్లోడు. ఆ బిడ్డ శరీరం పైన ఏ ఆచ్చాదనా లేదు. సరైన తైల సంస్కారం లేక రాగిరంగులోకి మారిపోయివున్న జుట్టు గచ్చపొదలా వుంది.‘‘యేందయ్యా, నీకు సెప్తావుంటే మొణుసకెక్కలా. యింట్లో నూకలు అయిపోయి పది దినాలయింది. పిల్లోల్ళు పల్లెలమిందబడి అడక్కొచ్చుకోని తింటావుండారు. ఏం బతుకో ముండ బతుకు.’’ ముక్కు చీదుకుని పైటకు తుడుచుకుంటూ చెప్పింది ఆదిలచ్చిమి. ఆ మాటలు వినేసరికి తన మనసు విలవిలలాడిపోయి విప్పిపారేసిన పొట్లం కాగితంలా తయారయింది.ఏదీ పట్టనట్లు, గుడిసె పక్కనున్న రాతి తిన్నెపైన కూర్చొని ఢక్కీ వాయిస్తూ ‘‘నెరా నెరా నెరబడండి జెరా జెరా నిలుపుబండి’’ అంటూ జానపద గీతం పాడుకుంటున్నాడు పన్నెండేండ్ల ముసిలిగోడు.

వీధిలో కొందరు పిల్లలు, చింపిరి జట్టుతో చిరిగిన బట్టల్తో మట్టిలోనే కూర్చొని ఆడుకుంటున్నారు.రెండు వీధి కుక్కలు ఒక పందిగున్నను తరుముతుంటే, అది ప్రాణభయంతో ఘీ పెడుతూ పల్లకవతలకి పరిగెత్తుతోంది. ఆ దృశ్యం చూసి కొందరు ‘చ్ఛాయ్‌. చ్ఛాయ్‌’ అంటూ కుక్కల్ని అదిలిస్తున్నారు.‘‘యేమ్మామా, పొద్దన్నే తీరుబడిగా కూసోనుండావు?’’ గుడిసె ముందరికి వస్తూ పలకరించాడు వెంకటస్వామి.‘‘కూసోక చేసేదానికేముండాదిరా’’ గొణిగినట్టున్నాడు ఇర్లోడు.‘‘యేమ్మామా! మనం జూలెత్తుకొని అట్ల మార్లో కన్నా పోతే తిండి గింజలేమైనా వస్తాయేమో గదా’’ అన్నాడు వెంకటస్వామి.‘‘కరువుకి, రైతులే కష్టాల్లో వుండారు. మనకేం పెడతారు.’’‘‘అట్టనొద్దులే మామా. మనకు చెయ్యి సాచే మారాజులుండనే వుంటారు.’’‘‘మనం బొయ్యి యిండ్ల ముందర నిలబడితే, ‘వొగడొగడు ఎద్దులు మాదిరుండారు. అడుక్కుంటే దానికొచ్చిండారు సూడో’ అంటా గెడ్డి పెడతారు.’’తన అనుమానం వ్యక్తం చేశాడు ఇర్లోడు.‘‘యిట్లే పోతే అంటారు. మనం యేజేసి కాలేసుకోని చిందాడితే సరిపాయ’’ కళ్ళు పెద్దవి చేసి ఉపాయం చెప్పాడు వెంకటస్వామి.‘‘నాకు చిందెయ్యడం రాదే’’‘‘నీకు వచ్చులే మామా ఊరికే అట్టంటావుండావు గానీ.. పోనీలే డముకు వాయించు మిగిలింది మేం జూసుకుంటాం.‘‘నువ్వెన్నన్నా చెపరా యెంగటా! ఆ మడిసికి దున్నపోతు మింద వాన కురిసినట్టే.’’ అంతవరకూ మౌనంగా వున్న ఆదిలచ్చిమి అందుకుంది.